కర్ణాటక కాంగ్రెస్ నేతలు రాహుల్ రాసిన లేఖలో ఏముంది?

సీఎం సిద్ధరామయ్య కుర్చీ కోసం కొంతమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పోటీపడుతున్నారు. రేసులో మేమున్నామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

Update: 2024-09-11 07:18 GMT

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయనను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కూడా అంగీకరించడంతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. సీఎం కుర్చీ కోసం కొంతమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పోటీపడుతున్నారు. రేసులో మేమున్నామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేస్తున్న పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులను హెచ్చరించాలని కాంగ్రెస్ నేతల బృందం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఈ లేఖలో ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు, కొంతమంది మాజీ మంత్రులు సంతకాలు చేశారు.

నిరుత్సాహానికి గురవుతున్న కార్యకర్తలు..

“ సీనియర్ మంత్రులతో పాటు కొంతమంది పార్టీ నేతలు బీజేపీ, జేడీ(ఎస్)కు వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి.. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ ప్రకటనలు ఇస్తు్న్నారు. ఫలితంగా చాలా మంది కార్యకర్తలు నిరుత్సాహానికి గురవు తున్నారు. ప్రభుత్వం, పార్టీపై ఆశలు కోల్పోతున్నారు. అంతర్గత పోరు, నిర్లక్ష్యపు ప్రకటనల కారణంగా కర్ణాటక ప్రజలు పార్టీ, ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారు. పార్టీ, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇటువంటి హానికర ప్రకటనలు జారీ చేయకుండా చర్యలు తీసుకోండి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్ నేతలు బీఎల్ శంకర్, వీఎస్ ఉగ్రప్ప, హెచ్‌ఎం రేవణ్ణ, వీఆర్ సుదర్శన్, ఎల్ హనుమంతయ్య, ప్రకాష్ రాథోడ్ ఉన్నారు.

సీఎం రేసులో ఉన్నదెవరంటే..

ముఖ్యమంత్రి పదవిపై ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారి, ఎమ్మెల్సీ దినేష్ గూలిగౌడ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. నాయకత్వ మార్పు విషయంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తుండగా, సీనియర్ పరమేశ్వర, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోళి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కావడానికి కొలమాన సీనియారిటీ అని భావించిన ఇద్దరు సీనియర్ మంత్రులు ఎంబి పాటిల్‌, శివానంద్ పాటిల్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్‌పర్సన్ ఆర్‌వి దేశ్‌పాండే, సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలని తమ మనసులో మాటను వ్యక్తం చేశారు.

ఏమిటీ ముడా?

మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల విస్తీర్ణం గల 14 ఇంటి స్థలాలు కేటాయించింది. ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నా.. అభివృద్ధి చెందిన విజయనగర లే అవుట్‌లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధరామయ్య ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడీఎస్‌ ఇటీవలే బహిర్గతం చేసింది. కెసర పరిధిలో చదరపు అడుగు రూ.2-3 వేలు పలుకుతుండగా, విజయనగర్‌ లే అవుట్‌లో రూ.10-12 వేల వరకూ ధర పలుకుతున్న ఇంటి స్థలాలను సిద్దరామయ్య భార్య పొందారని, వాస్తవంగా ఆవి దళితులకు చెందినదని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధరామయ్య భార్యకు కేటాయించిన ఇంటి స్థలాల విలువ రూ.70 కోట్లకుపైగానే పలుకుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య గతంలో స్పందించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే.. దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.

మరో వైపు ముడా ఇంటి స్థలాలను అక్రమంగా పొందిన సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, మైసూరుకు చెందిన మరో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, బెంగళూరు నాగరభావి నివాసి ప్రదీప్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. జూలై 26న టీజే అబ్రహాం సమగ్ర వివరాలతో గవర్నర్‌ను కలిసి ప్రాసిక్యూషన్‌ కోరారు. ఆ మరుసటి రోజే సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, ముడా ఇంటిస్థలాల అక్రమంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని గవర్నర్‌ అనుమతులు ఇచ్చారు.

Tags:    

Similar News