మంత్రి పదవికి సెంథిల్ రాజీనామా వెనక డీఎంకే వ్యూహమేమిటీ?
కొంగునాడుపై పట్టుబిగించేందుకు ఆయన వ్యూహంపైనే స్టాలిన్ ఆధారపడుతున్నారా?;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-28 06:08 GMT
(మూలం.. మహాలింగం పొన్ను స్వామి)
విద్యుత్, ఎక్సైజ్ శాఖా మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను డీఎంకే హైకమాండ్ వెంటనే పశ్చిమ తమిళనాడు కు ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశం ఉంది. వ్యవహారికంగా ఈ ప్రాంతాన్ని కొంగునాడు బెల్ట్ గా పిలుస్తారు. ఇక్కడ చారిత్రాత్మకంగా బీజేపీ, అన్నాడీఎంకేకు మంచి పట్టు ఉంది.
వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బాలాజీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. ప్రతిపక్షపార్టీలకు బలం తగ్గించే లక్ష్యంతో పావులు కదపడానికి ఆయన మాత్రమే సరైన వ్యక్తి అని ద్రవిడవాద అధికార పార్టీ భావిస్తోంది.
బాలాజీకే ఎందుకు?
కోయంబత్తూర్, కరూర్, ఈరోడ్ వంటి జిల్లాలను కలుపుకుని కొంగునాడు ప్రాంతం ఉంది. ఇక్కడ బాలాజీకి మంచి పట్టు ఉంది. ఆయన మాత్రమే పార్టీకి మెరుగైన సీట్లను తీసుకురాగలిగే సత్తా ఉన్నట్లు డీఎంకే అధినాయకత్వం భావిస్తోంది. సెంథిల్ బాలాజీ 2018 లో డీఎంకేలో చేరారు.
ఆయన చేరిన తరువాతే అన్నాడీఎంకే- బీజేపీకి అక్కడ భారీగా ఓట్ల నష్టం వాటిల్లింది. 2022 లో జరిగిన కోయంబత్తూర్ స్థానిక ఎన్నికల్లో బాలాజీనే ఇన్ చార్జీగా పనిచేసి 100 వార్డులకు గాను 96 వార్డులను పార్టీ గెలుచుకుంది. ఇది పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికల పనితీరు కంటే చాలా ఎక్కువ మొత్తం.
జూన్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకూ జైల్లో ఉన్నప్పుడు కూడా బాలాజీ 2024 లోక్ సభ ఎన్నికలపై సైతం తన ప్రభావాన్ని చూపాడు. డీఎంకేను కోయంబత్తూర్ లో పోటీ చేయాలని సలహ ఇచ్చాడు. ఈ వ్యూహంతోనే బీజేపీకి చెందిన కే. అన్నామలై 1.14 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
2021 లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి ఇక్కడ ఉన్న 50 సీట్లలో 33 గెలుచుకుంది. ఇది డీఎంకేకు సవాల్ గా మారింది. గౌండర్ కులానికి చెందిన బాలాజీ, సాంప్రదాయకంగా అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకున్న ఈ ప్రభావవంతమైన సమాజాన్ని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించారు.
సెంథిల్ 2024 సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలైన తరువాత ఆయనను వెంటనే కొయంబత్తూర్ ఇన్ చార్జ్ గా తిరిగి నియమించారు. ఇది డీఎంకే వ్యూహాన్ని స్పష్టం చేసింది. ఇక్కడ తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి ఎంకే స్టాలిన్ బాలాజీనే నమ్ముకున్నారు.
ప్రస్తుతం బాలాజీని మంత్రివర్గం నుంచి అధికారికంగా తప్పించినప్పటికీ ఆయనకు కొంగునాడు ప్రాంతం బాధ్యతలు ఇవ్వడానికి పార్టీ అధినాయకత్వం సిద్దంగా ఉంది. ఇంతకుముందు 2019 లో కూడా ఇలాంటే వ్యూహాలను ఆయన రచించారు. డీఎంకేపై అంటిన అవినీతి మరకలను ఎదుర్కొవడానికి ఆయనే సరైన విరుగుడు అని స్టాలిన్ ఆలోచనగా ఉంది.
అనేక పార్టీలు మారిన బాలాజీ..
బాలాజీ కెరీర్ అనేక పార్టీల మార్పుతో ముడిపడి ఉంది. 21 ఏళ్ల వయస్సులో పంచాయతీ కౌన్సిలర్ నుంచి జే. జయలలిత హయాంలో ఆయన రవాణాశాఖ మంత్రిగా పనిచేసే స్థాయికి ఎదిగారు. ఆ సందర్భంగా ఆయన అనేక పార్టీలను మారారు.
మొదటగా ఎండీఎంకే, డీఎంకే, అన్నాడీఎంకే, ఏఎంఎంకే లో పనిచేసి తిరిగి డీఎంకే గూటికి చేరారు. ఆయన డీఎంకేలో ప్రతిసారి ఎన్నికల విజయాన్ని సాధించగలిగారు. 2019 లో జరిగిన అరవకురిచి ఉప ఎన్నిక, 2021 కరూర్ విజయంతో పార్టీకి మంచి పునాదిని అందించాయి.
అయితే అవినీతి ఆరోపణలపై సెంథిల్ బాలాజీ 471 రోజులు జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రత్యర్థులు హైలైట్ చేసే అవకాశం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ బాలాజీ సంబంధిత ఆస్తులపై దాడులు చేసింది. ఇది కూడా డీఎంకేకు ఎన్నికల సమయంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
2026 ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే బాలాజీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికే ముందస్తు ప్రణాళికలు ముమ్మరంగా రచిస్తున్నారు.
కుంభకోణాలు మళ్లీ వెంటాడతాయా?
2011 నుంచి 2015 వరకూ అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి బాలాజీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల నియామకం సంబంధించి భారీ మొత్తంలో నగదు స్వీకరించారని అపవాదు ఆయన కెరీర్ ను బాగా దెబ్బతీసింది.
సెంథిల్ బాలాజీ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం..ఆయన మంత్రి పదవి లేదా బెయిల్ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. రాజకీయ ప్రయాణంలో మొదటిసారిగా ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం నగదు కుంభకోణం ప్రారంభం అయింది. తమిళనాడు రవాణా శాఖలో డ్రైవర్లు, కండక్టర్ల, జూనియర్ అసిస్టెంట్లు వంటి పదవులు వంటి ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి లంచాలు వసూలు చేయడంతో ఆయనే ఓ పథకం రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ సోదరుడు ఆర్ వి అశోక్ కుమార్, వ్యక్తిగత సహాయకుడు బీ షణ్ముగం వంటి వారితో కలిసి అక్రమంగా డబ్బు వసూలు చేశారని ఈడీ అభియోగాలు మోపింది.
తరువాత 2018 లో మెట్రో ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ టెక్నికల్ సిబ్బంది ఒకరూ రూ. 40 లక్షలు చెల్లించినప్పటికీ హమీ ఇచ్చిన ఉద్యోగం నిరాకరించడంతో దర్యాప్తు ప్రారంభం అయింది.
బాలాజీ, అతని భార్య ఖాతాలో రూ. 1.34 కోట్లు లెక్కల్లో చూపని నగదు డిపాజిట్లు జమ అయ్యాయని, ఈ స్కామ్ తో నేరుగా సంబంధం ఉందని ఈడీ జూలై 2021 లో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
జూన్ 14, 2023న ఈడీ బాలాజీని అరెస్ట్ చేయడం, చెన్నై,కరూర్ అంతటా దాడుల తరువాత మొదటి పెద్ద దెబ్బ. ఆయనను తరువాత 471 రోజులు జైలు జీవితం గడిపారు. తరువాత 2 వేల మందికి పైగా నిందితులు, 550 మంది సాక్షులతో విచారణ ఆలస్యం అవడంతో ఆయనకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26, 2024న బెయిల్ ఇచ్చింది.
సెప్టెంబర్ 29న ఆయన మంత్రిగా తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. ఇది స్వల్పకాలమే. అయితే ఏప్రిల్ 9, 2025న ఆయన సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన హెచ్చరికను ఎదుర్కొన్నారు. పదవీ కారణంగా సాక్షులను బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాలాజీ తన రాజీనామాను బెయిల్ కోసం వాడుకున్నారని, విడుదల తరువాత తిరిగి ప్రమాణ స్వీకారం చేశారని కోర్టు పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద ముందస్తు నేరంలో ఆయన పాత్ర గురించి ముందస్తుగా బయటకు వచ్చిన విషయాలను బట్టి ఈ చర్య ఆమోదయోగ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు.