ఎవరా 30 ఏళ్ల వ్యక్తి: రవ్వ ఇడ్లీని ఆర్డర్ ఇచ్చి..

బెంగళూర్ లో జరిగిన బాంబు పేలుడు పై సీసీబీ పోలీసులతో పాటు, ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేశాయి.ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి తీసుకోలేదని తెలుస్తోంది.

Update: 2024-03-02 05:31 GMT

 బెంగళూర్ లోని వైట్ ఫీల్డ్ లో గల రామేశ్వరం కేఫెలో శుక్రవారం తక్కువ తీవ్రత గల ఐఈడీ పేలుడులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు విచారణ చేపట్టారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. "విచారణ కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేశాం. కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకుంటాం" అని ఆయన ప్రకటించారు.

బెంగళూర్ లో జరిగిన పేలుడు ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కెఫెలో భోజనం చేయడానికి వచ్చిన కస్టమర్లతో పాటు సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ తీవ్రత గల పేలుడు కావడంతో చాలామంది ప్రజలు గాయాలతో బయటపడ్డారు.
ప్రధాన నిందితుడు ఎవరూ?
ప్రధాన నిందితుడి వయస్సు 28 -30 మధ్య ఉంటుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూర్ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా ఐఈడీ వల్ల పేలుడు సంభవించిదని, ఓ వ్యక్తి కెఫెలో పరికరం గల బ్యాగ్ ఉంచాడని చెప్పాడు. నిందితుడు రవ్వ ఇడ్లీని ఆర్దర్ చేసి తీసుకోకుండానే వెళ్లిపోయాడని చెప్పారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1 గంటల మధ్య పేలుడు సంభవించిందని ఇందులో పది మంది గాయపడ్డారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
పోలీసులు కెఫెలోని సీసీటీవీ ఫుటేజీతో సహ చుట్టు పక్కల గల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా పరిశీలించారు. ఈ ఘటన వెనక ఉగ్రవాదుల కోణం ఉందో లేదో పరిశీలించినట్లు సమాచారం.
ప్రధాన సాక్షి ఎం చెప్పాడంటే
సంఘటన జరిగినప్పుడు బయట వేచి ఉన్న ఎడిసన్ ఇలా అన్నాడు. " నేను నా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. సడన్ గా పెద్ద శబ్ధం వినిపించింది. అంతా గందరగోళం. అక్కడున్న వాళ్లంతా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. సిలిండర్ పేలిందని అన్నారు. కానీ ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు" అని వివరించాడు. సమీపంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న అమృత్ మాట్లాడుతూ..  ఫుడ్ కోసం ఆర్డర్ ఇచ్చాను. ఆ తరువాత సడన్ గా పేలుడు శబ్దం వినిపించింది. ఆ తరువాత అంతా గందరగోళం అని వివరించాడు.
విమర్శలు గుప్పించిన బీజేపీ
రామేశ్వర కెఫెలో పేలుడు సంఘటనపై బీజేపీ, అధికార కాంగ్రెస్ ను విమర్శించింది. దీనిపై సమగ్ర విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేసింది. " బెంగళూర్ లోని రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు గురించి తీవ్రంగా ఆందోళన చెందా. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టాలి. నిందితులను త్వరగా పట్టుకోవాలి" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
" సంఘ విద్రోహ శక్తులకు కర్నాటక సురక్షితమైన స్వర్గధామం అని మరోసారి నిరూపించబడింది. పోలీసులు, నిఘా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సమగ్ర విచారణ జరిపి అంశాలను పూర్తిగా నిర్మూలించాలని పోలీసులను కోరుతున్నా" అని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సంఘటనపై ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ మాట్లాడుతూ " సీఎం @ సిద్దరామయ్య నేతృత్వంలోని @ ఐఎన్ సీ కర్నాటక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నాటన లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయడానికి బెంగళూర్ లోని రామేశ్వరం కెఫెలో బాంబు పేలుడు మరొక స్పష్టమైన ఉదాహారణ" అని ఆయన విమర్శించారు. మొదట గ్యాస్ లీకేజీ తో పేలుడు సంభవించిందని చెప్పారని, తరువాత అగ్నిమాపక శాఖ దీనిని తోసిపుచ్చిందని, ఘటనా స్థలంలో ఒక బ్యాగ్ దొరికిందని చెప్పారు.


Tags:    

Similar News