‘ఇండియా’లో చేరలేదు, భూస్వాములతో కలవను: కమల్ హసన్

తన పార్టీ మక్కల్ నీది మైయం ఇప్పటి వరకూ ఏ కూటమిలో చేరలేదని పార్టీ అధినేత, నటుడు కమల్ హసన్ చెప్పారు. అయితే కొన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

Update: 2024-02-21 09:41 GMT

తన పార్టీ ‘మక్కల్ నీది మైయం(ఎంఎన్ఎం)’ ఏ కూటమిలో చేరలేదని, ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తన పార్టీ నిస్వార్థంగా దేశం గురించి ఆలోచించే వారితో మాత్రమే చేతులు కలుపుతుందని ప్రకటించారు. మక్కల్ నీది మైయం పార్టీ ఏడో వార్షికోత్సవంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హీరో జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు రావడం సంతోషకరమైన విషమని చెప్పారు.

ఎంఎన్ఎం, దేశంలోని 28 పార్టీల కూటమి అయిన ఇండియాలో చేరుతుందా అని అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ" నేను ఇప్పటికే చెప్పాను. దేశం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. నిస్వార్థంగా నా దేశానికి ఎవరైతే సేవలు అందిస్తారో వారితో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే స్థానిక భూస్వామ్య రాజకీయాలు చేస్తున్న వారితో ఎంఎన్ఎం చేతులు కలపదు " అని వెల్లడించారు.

మీరు ఇప్పటికే ఇండియాలో చేరారా? అని అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ " లేదు నేను చేరలేదు. అయితే ఇతర పార్టీల నేతలతో మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఏదైన కీలకముందడుగు పడితే ముందుగా మీకే( మీడియా) శుభవార్త చెబుతాను" అని చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని తమిళనాడులో ఊహగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలను విలేకరులు సంధించారు.

ఇంతకుముందు ఎంఎన్ఎం 2019 లోక్ సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మెరుగైన ఫలితాలను సాధించలేకపోయింది. 

Tags:    

Similar News