ముడా కుంభకోణంతో సిద్ధరామయ్య సీఎం కుర్చీ కోల్పోతారా?

ముడాలో ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన సిద్ధరామయ్యపై క్రిమినల్‌ కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది టీజే అబ్రహం గవర్నర్‌ను కోరారు.

Update: 2024-07-31 04:29 GMT

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరు తెరపైకి వచ్చింది. గతంలో తనపై వచ్చిన ఆరోపణల కారణంగా బిజెపికి చెందిన బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి సిద్ధరామయ్య ఎదుర్కోబోతున్నారా?

ముడా కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య, ఆయన కుటుంబసభ్యులపై ఇప్పటికే ఐదు కేసులున్నాయి. న్యాయ నిపుణులు మాత్రం ముడా భూకేటాయింపు కేసు, ఇతరత్రా కేసుల వల్ల సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి ఏ ప్రమాదం లేదని చెబుతున్నారు.

ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో.. ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులు, అలాగే హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీని సిద్ధరామయ్య ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది.

ముడా ద్వారా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో అధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినందుకు సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహం కోరారు.

ఈ కేసులో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇస్తారా ? లేదా? ఒకవేళ గవర్నర్ అనుమతిస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన సిద్ధరామయ్య మద్దతుదారుల్లో కనిపిస్తుంది.

సిద్ధరామయ్య యడియూరప్ప 2 అవుతారా?

2011లో అప్పటి గవర్నర్‌ హన్స్‌ రాజ్‌ భరద్వాజ్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా బిఎస్‌ యడియూరప్ప పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. సిద్ధరామయ్య కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతించరని సుప్రీంకోర్టు న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు బిటి వెంకటేష్ ఫెడరల్‌తో అన్నారు.

చీఫ్ సెక్రటరీ రిపోర్టే కీలకం..

ఫిర్యాదుదారుడు ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. అతను గవర్నర్ సలహా తీసుకుంటాడు.ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆధారాలుంటే గవర్నర్ సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదేశించవచ్చు. ఈ ప్రక్రియలో ప్రధాన కార్యదర్శి పాత్ర కీలకం’’ అని వెంకటేష్ వివరించారు.

కేవలం ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేసి, నోటీసు పంపితేనే సమస్య ఉత్పన్నమవుతుందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. నైతిక కారణాలు లేదా తన పార్టీ ఆదేశాల మేరకు కూడా సీఎం రాజీనామా చేయవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చూడండి. జైలుకెళ్లినా ఆయన తన పదవిని నిలబెట్టుకున్నారు. అదనంగా ఎఫ్ఐఆర్ లేదా గవర్నర్ అనుమతి సవాలు చేసే అవకాశం కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది.

అయితే మాజీ అడ్వకేట్ జనరల్ ఒకరు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..ముడా నుంచి అక్రమంగా ప్లాట్లు పొందిన కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతి జోక్యం ఉన్నట్లు తేలితే , అప్పుడు సీఎం బాధ్యులవుతారని అని చెప్పారు.

‘‘2013 ఎన్నికల సమయంలో తన భార్య పేరు మీదున్న ఆస్తులను ఎన్నికల కమిషన్‌ ముందు ప్రకటించలేదు. ఇప్పుడు ఆమెకు ఆస్తి ఉందని రుజువైతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

హైకోర్టు న్యాయవాది షాజీ టి వర్గీస్ ప్రకారం..‘‘ సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలలో తీవ్రత లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్యకు సైట్లు కేటాయించారు. అదే పార్టీ హయాంలో పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామికి మాత్రమే భూమి ఉందని, ముడా నుంచి స్థలాలు కేటాయించారని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంది.’’ అన్నారు.

అవినీతి నిరోధక చట్టం కింద ముడా కేసును లోకాయుక్త పోలీసులు విచారించి గవర్నర్‌కు నివేదిక సమర్పిస్తే.. దాని ఆధారంగా ముఖ్యమంత్రిపై ప్రాసిక్యూషన్‌కు ఆయన అనుమతించే అవకాశం ఉందని మాజీ ఉప లోకాయుక్త తెలిపారు. అయితే బిజెపి హయాంలో సిద్దరామయ్య భార్యకు సైట్ కేటాయించడం వల్ల సిద్దరామయ్యకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదని ఆయన అనుమానిస్తున్నారు.

సమగ్ర నివేదికకు సిఫార్సు..

ముడా ద్వారా జరిగిన స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీతో ప్రాథమిక విచారణకు ఆదేశించింది. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ వెంకటాచలపతి, ఇతర అధికారుల నేతృత్వంలోని కమిటీకి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌ 1న ప్రభుత్వం ఆదేశించింది. వారు ఆ నివేదికను ప్రధాన కార్యదర్శికి అందజేస్తారు. అందులో సిద్ధరామయ్య పేరు ఉండే అవకాశం లేకపోలేదు.

లోకాయుక్తలో బీజేపీ నేత ఫిర్యాదు..

ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య పాత్ర ఉందని బీజేపీ నేత ఎన్‌ఆర్‌ రమేష్‌ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గవర్నర్, చీఫ్ సెక్రటరీకి లేఖ..

మరో కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతితో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజుపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు నకిలీ పత్రాలు సృష్టించి ముడాకు కోట్ల రూపాయలను మోసం చేశారని ఆరోపించారు. ఫిర్యాదులో పలువురు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. వాస్తవాలు తేల్చాలని గవర్నర్‌, ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాశారు. దాంతో ఫిర్యాదును పట్టణాభివృద్ధి శాఖకు పంపి విచారణ చేపట్టారు.

ఖజానాకు రూ. 55.80 కోట్ల నష్టం..

ముడాలో ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఎం సిద్ధరామయ్యపై క్రిమినల్‌ కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది టీజే అబ్రహం గవర్నర్‌ను కోరారు. అధికార దుర్వినియోగం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల ఖజానాకు రూ.55.80 కోట్ల నష్టం వాటిల్లిందని తన 22 పేజీల పిటిషన్‌లో అబ్రహం పేర్కొన్నారు. కేసరె గ్రామంలో 3 ఎకరాల 16 గుంటల డీనోటిఫైడ్ భూమిని సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాల మేరకు మల్లికార్జున స్వామి మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. న్యాయపరంగా సిద్ధరామయ్య కుటుంబం సరైనదే అయినా నైతిక ప్రశ్నలు ముఖ్యమంత్రిని వెంటాడుతున్నాయి.

Tags:    

Similar News