ఉపాధ్యాయుల నిరసన మమతను ఇరుకునపెడుతుందా?
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న ఆలోచనలో పశ్చిమ బెంగాల్ సర్కారు. కానీ అది అంత సులభం కాదని నిపుణులు..;
పశ్చిమ బెంగాల్(West Bengal)లో ఉపాధ్యాయుల నిరసన తీవ్రమవుతోంది. మమతా(Mamata Banerjee) బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ (TMC) ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడతుంది? ఉపాధ్యాయుల ఆందోళన(Teachers Agitation)లను ఎలా శాంతపరుస్తుందన్నదే ప్రసుత్తం చర్చనీయాంశం.
విద్యా శాఖ మంత్రి బ్రాత్య బసు వారి రెండు ప్రధాన డిమాండ్లకు అంగీకరించిన తర్వాత కూడా ఉపాధ్యాయులు శుక్రవారం తమ నిరసనను విరమించుకోవడానికి నిరాకరించారు. అయితే మమత తన వద్ద A, B, C, D , E ప్లాన్ సిద్ధంగా ఉందని చెబుతోంది. ముఖ్యమంత్రి సాహసోపేతంగా ముందుకు సాగినా.. 2016 SSC నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆప్షన్లు పరిమితంగా ఉన్నాయి.
మరి ఆ ఆప్షన్లేంటి?
సుప్రీం తీర్పు(Supreme Court)ను తిప్పికొట్టడానికి రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం అందులో మొదటిది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. కానీ ఇధి అంత సులభం కాదు.
"ప్రభుత్వం తన అభ్యర్థనకు మద్దతుగా ఆధారాలు చూపకపోతే ప్రభుత్వం పిటిషన్‌ను అంగీకరించదు అని న్యాయ నిపుణులు మాకు చెబుతున్నారు" అని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయురాలు మౌమిత సర్కార్ ది ఫెడరల్‌తో అన్నారు.
ప్రభుత్వంతో చర్చలు..
ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నియామకాలు రద్దయ్యాయి. దీంతో ఉద్యోగాలు పొందిన బోధన, బోధనేతర సిబ్బంది 13 మంది సభ్యుల ప్రతినిధి బృందం మంత్రి బసు తో సమావేశమైంది. ఆయన వారికి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఉపాధ్యాయులు వెనక్కి తగ్గడం లేదు.
మరో డిమాండ్‌కూ ఆమోదం..
ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో పరీక్షలకు హాజరైన 22 లక్షల మంది అభ్యర్థుల ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ (OMR) షీట్ల డిజిటల్ మిర్రర్ చిత్రాలను పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) ప్రచురించాలనే మరో డిమాండ్‌కు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత రెండు వారాల్లో OMR షీట్లను కూడా ప్రచురిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే "సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ద్వారా తమ సేవలను పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగుతుంది" ఆందోళనకారు మౌమిత సర్కార్ చెప్పారు.
నిపుణుల సందేహం?
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నజ్రుల్ ఇస్లాం ప్రకారం.. OMR షీట్‌ను బహిర్గతం చేయడం వల్ల 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలకు సంబంధించిన చిక్కుముడికి పరిష్కారం దొరకదు. కేసు దర్యాప్తులో CBI స్వాధీనం చేసుకున్న OMR షీట్ ప్రతిబింబాన్ని కోర్టు సాక్ష్యంగా అంగీకరించకలేదని ఆయన చెప్పారు.
ఇటు 5 వేల మందిని చట్టవిరుద్ధంగా నియమించుకున్నారని SSC పేర్కొంది. అలా నియమకమైన వారు పేర్లను కోర్టుకు స్పష్టంగా ఇవ్వలేకపోయారు. దానివల్ల నిజంగా అర్హత సాధించిన వారు ఎవరో.. తప్పుడు మార్గంలో నియామకమైన వారు ఎవరో తెలీక, నియామకాలన్నింటిని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.
మరో మార్గ ఉందా?
తప్పుడు మార్గాన్ని అనుసరించిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని కాంట్రాక్టు కింద నియమించుకోవడం వల్ల వాళ్ల జీవితాలను కాపాడినట్లవుతుందన్న వాదన మరోవైపు ఉంది. ఒప్పంద నియామకాలకు అధికారిక నియామక పరీక్ష కూడా అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పారా టీచర్‌కు దాదాపు రూ.13వేల జీతం అందుతుండగా.. రెగ్యులర్ టీచర్‌కు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, మెడికల్ అలవెన్స్‌తో కలిపి దాదాపు రూ.42వేలు వస్తుంది. కానీ ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు అలాంటి రాజీ ఏర్పాటుకు అంగీకరిస్తారా? లేకపోతే, ఏడాదిలోపు జరగనున్న ఎన్నికలతో టిఎంసి ఇబ్బందుల్లో పడుతుంది.
ఇంతకు కేసేమిటి?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలను చేపట్టింది. నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’ కుంభకోణంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2024 ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందిన వారు.. అలానే బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ సబ్మిట్ చేసి.. ఉద్యోగాలు పొందిన వారి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్ల పాటు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీరేటుతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపులో మోసపూరిత విధానాలు అవలంబించారని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. 25 వేల మంది నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది.