‘ఔరంగజేబును పొగిడేవారు దేశద్రోహులు’

‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను గుణాల్లోని ఒకదాన్నయినా అలవర్చుకోవాలి. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం’’ - షిండే.;

Update: 2025-03-18 06:41 GMT
Click the Play button to listen to article

‘‘మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు(Aurangzeb) మహారాష్ట్ర(Maharashtra)ను ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పాటు అనేక దురాగతాలకు పాల్పడ్డాడు. శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ను హత్య చేయించారు. చాలా అకృత్యాలకు పాల్పడ్డ ఔరంగజేబును పొగిడేవారు దేశద్రోహులు(Traitors)’’ - మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).


సోమవారం రాత్రి ‘శివ జయంతి’ సందర్భంగా తానే జిల్లా డొంబివ్లి ప్రాంతం ఘర్డా చౌక్‌లో శివాజీ(Shivaji Maharaj) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. ధైర్యసాహసాలు, హిందుత్వ ప్రేరణకు శివాజీ నిదర్శనమని, ఆయన వీరత్వానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు తమ జీవితాల్లో శివాజీ మహారాజ్‌లోని కనీసం ఒక గుణాన్నయినా అలవర్చుకోవాలని, అదే మనం ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం అని పేర్కొన్నారు. ఈ విగ్రహం యువతకు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఔరంగజేజును సమాధిని తొలగించాలని కొన్ని హిందుత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షిండే వ్యాఖ్యలు చేశారు.

ఇకపై ఘర్డా చౌక్‌ను "ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్"గా పిలవాలని షిండే ప్రకటించడంతో సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. జై భవానీ.. జై శివాజీ" అంటూ నినాదాలు చేశారు.

సోమవారం మధ్యాహ్నం మహల్‌ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన అనంతరం ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన సమాధి వద్దకు వెళ్లేవారు భద్రతా సిబ్బంది వద్ద రిజిస్టర్‌లో సంతకాలు చేయడంతోపాటు తమ గుర్తింపుపత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News