కోల్‌కతా ఘటనతో ఆ ముగ్గురు సహా 57 మందికి సమన్లు

కోల్‌కతాలో పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై ఫేక్ వార్తలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు మొత్తం 60 మందికి పోలీసులు సమన్లు జారీ చేశారు.

Update: 2024-08-18 08:38 GMT
Locket Chatterjee

కోల్‌కతాలో పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై పూటకో వార్త, రోజుకో కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏది వాస్తవమో, ఏది అవాస్తవయో తెలియడం లేదు. నిజం తెలుసుకోకుండా వచ్చిన వాటిని వచ్చినట్లుగా సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అవి కాస్త అల్లర్లకు దారితీస్తున్నాయి. దీంతో పుకార్లు, నకిలీ వార్తలు షేర్ చేసేవారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు.

పీజీ ట్రైనీ డాక్టర్ విషయంలో బాధితురాలి ఐడెంటిటీని, అవాస్తవాలను ప్రచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు బిజెపి మాజీ ఎంపి లాకెట్ ఛటర్జీ, ఇద్దరు ప్రముఖ వైద్యులకు సమన్లు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు హాజరు కావాలని వారిని కోరారు. ఆ ముగ్గురితో పాటు తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు మరో 57 మందికి కూడా సమన్లు పంపారు.

‘ఎందుకు పంపారో తెలీదు’

పోలీసులు పంపిన సమన్లు తనకు అందాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సర్కార్ తెలిపారు. “అవును, నాకు సమన్లు అందాయి. కానీ ప్రస్తుతానికి నేను ఊరు బయట ఉన్నాను. ఈ విషయాన్ని కోల్‌కతా పోలీసులతో చెప్పాను. వారు నన్ను ఎందుకు పిలిచారో తెలియదు. సోషల్ మీడియాలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వల్లే కావొచ్చు.” అని అన్నారు.

‘ఇంకా అందలేదు’

తనకు ఇంకా సమన్లు అందలేదని పుర్బా బర్ధమాన్ జిల్లా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోస్వామి తెలిపారు. “కేసును దర్యాప్తు చేయనప్పుడు కోల్‌కతా పోలీసులు నాకు ఎందుకు సమన్లు జారీ చేశారో తెలీదు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తా. నేను బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు.” అని చెప్పారు.

‘బాధితురాలికి న్యాయం జరగాలి’

తనకు ఇంకా సమన్లు అందలేదని హుగ్లీ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎంపీ ఛటర్జీ చెప్పారు. “కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు వారు (కోల్‌కతా పోలీసులు) అదే చురుకుదనం చూయించి ఉంటే బాగుండేది. బాధితురాలికి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు’’ అని అన్నారు.

కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో చాలా పుకార్లు, అవాస్తవాలతో కూడిన వార్తలు బయటకు వచ్చాయని, అవి శాంతిభద్రతలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News