‘కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తెస్తాం’
ఇకపై ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టాన్ని తీసుకువస్తామని క్యాబినెట్ మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఢిల్లీ ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు ఐఏఎస్ ఆవవహులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఇకపై కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టాన్ని తీసుకువస్తామని క్యాబినెట్ మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.
చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వ అధికారులు, వివిధ కోచింగ్ హబ్‌ల విద్యార్థులతో ప్రభుత్వం త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ చట్టం పరిధిలో కోచింగ్ సెంటర్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హతలు, ఫీజుల నియంత్రణ తదితరాలు ఉంటాయని చెప్పారు.
చట్టాన్ని ఉల్లంఘించి బేస్‌మెంట్లను ఉపయోగించుకున్న కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కఠినంగా వ్యవహరించిందని అతిషి చెప్పారు.
"నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రాజీందర్ నగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్‌లలోని 30 కోచింగ్ సెంటర్ల సెల్లార్లను ఇప్పటికే సీజ్ చేశామని చెప్పారు. మరో 200 ఇతర కోచింగ్ సెంటర్‌లకు నోటీసులు జారీ చేశామని చెప్పారు.
దోషులుగా తేలిన అధికారులపై కఠిన చర్యలు
ఓల్డ్ రాజిందర్ నగర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ నివేదిక రాగానే దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రావూస్ IAS స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్నారని ఒక IAS ఆశవహుడు ఢిల్లీ మునిపిపల్ కార్యాలయానికి పంపిన ఫిర్యాదును ఏ అధికారి పట్టించుకోలేదో దర్యాప్తులో బయటపడుతుందన్నారు.