కోల్‌కతా ఘటనలో సీబీఐ కూపీ లాగుతుందా?

ట్రైనీ డాక్టర్ చనిపోయిందని బాధితురాలి తల్లిదండ్రులకు ముందు ఎవరు చెప్పారు? తమ కూతురిని చూసేందుకు వారిని వెంటనే ఎందుకు అనుమతించలేదు? అని సీబీఐ కూపీ లాగుతోంది.

Update: 2024-08-18 10:45 GMT

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కాల్ డేటా, వాట్సప్ చాట్‌లను పరిశీలించే అవకాశం ఉంది. ఆదివారం వరుసగా మూడో రోజు కూడా సందీప్ సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఘటనకు ముందు, ఆ తర్వాత ఆయన ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో.. వివరాలు ఇవ్వాలని కోరినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఆయన చెప్పే వాటితో క్రాస్ చెక్ చేసుకునేందుకు మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రందించి కాల్ డేటాను కూడా తెప్పించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

లోతుగా విచారణ..

మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అధికారులు శనివారం 13 గంటలపాటు ప్రశ్నించారు. తిరిగి ఆదివారం రాగాలని చెప్పడంతో ఉదయం 11 గంటలకు సాల్ట్ లేక్‌లోని సిజిఓ కాంప్లెక్స్‌లోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు సందీప్. ట్రైనీ డాక్టర్ చనిపోయిన విషయం మొదట ఎవరి నుంచి తెలుసుకున్నారు? ఆ తర్వాత ఘోష్ ఏం చేశారు? ఎవరికి ఫోన్ చేశారు? బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఎవరిచ్చారు? వారు వచ్చాక కూతురు మృతదేహాన్ని చూడటానికి వెంటనే ఎందుకు అనుమతించలేదు? మూడు గంటల పాటు వారిని ఎందుకు వెయిట్ చేయించారన్న ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు.

అకస్మాత్తుగా మరమ్మతు పనులు..

ఘటనా స్థలం సెమినార్ హాల్‌కు సమీపంలో ఉన్న గదులను అకస్మాత్తుగా ఎందుకు మరమ్మతు పనులు చేయిస్తున్నారని, అలా చేయమని ఎవరు చెప్పారు? అన్న కోణంలోను వివరాలు రాబడుతున్నారు.

నోరు విప్పని ఘోష్..

సీబీఐ అధికారుల ముందు ఘోష్ హాజరయిన తర్వాత బయటకు వచ్చారు. ఆయనను మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే వాటికి సందీప్ సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఘోష్‌ను మొదట శుక్రవారం, తర్వాత శనివారం ప్రశ్నించింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సందీప్ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. దాడి జరిగే అవకాశం ఉండడంతో తనను రక్షణ కల్పించాలని లాయర్ ద్వారా కోర్టును కూడా ఆశ్రయించారు.

కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో మరుసటి రోజు పోలీసులు పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు.

Tags:    

Similar News