టీమిండియాకు మరోసారి నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ
వరుసుగా ఐసీసీ టైటిల్స్ గెలవడంపై సంతోషం వ్యక్తం చేసిన క్రికెట్ బోర్డు;
By : The Federal
Update: 2025-03-20 07:44 GMT
పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి - 2025 ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ క్రికెటర్లు, కోచ్ ఇతర సహాయ సిబ్బందికి నజరానాగా రూ. 58 కోట్లను ప్రకటించింది.
‘‘ఆ ఆర్థిక గుర్తింపు ఆటగాళ్లు, కోచింగ్ స్టాప్, సహాయక సిబ్బంది, పురుషుల సెలెక్షన్ కమిటీ సభ్యులకు అందజేస్తాం’’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
అజేయంగా నిలిచిన జట్టు..
కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ట్రోఫిని కైవసం చేసుకుంది. ముఖ్యంగా మార్చి9 న దుబాయ్ లో జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించారు.
భారత్ తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత పాకిస్తాన్ ను మట్టికరిపించింది. గ్రూప్ మ్యాచ్ లో చివరగా న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచింది. చివరగా సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియాను ఓడించింది.
బిన్నీ, సైకియా..
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వరుసుగా ఐసీసీ టైటిల్స్ గెలుచుకోవడం ప్రత్యేకమైనది. ఈ బహుమతి ప్రపంచ వేదికపై మన జట్టు అంకితభావం, నైపుణ్యాన్ని గుర్తిస్తుంది.
ఈ నగదు ప్రొత్సాహం ట్రోఫిని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరు చేసిన కృషికి గుర్తింపు. ఐసీసీ అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజయం తరువాత 2025 లో ఇది దేశం సాధించిన రెండో ఐసీసీ టైటిల్. ఇది మన దేశంలో ఉన్న బలమైన క్రికెట్ వ్యవస్థను హైలైట్ చేస్తుంది’’ అన్నారు.
‘‘ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఈ అర్హమైన బహుమతి అందించడం పట్ల బీసీసీఐ గర్వంగా ఉంది’’ అని కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ‘‘ప్రపంచ క్రికెట్ లో మన ఆధిపత్యం సంవత్సరాల కృషి, వ్యూహాత్మక అమలు ఫలితంగా ఉంది.
ఈ విజయం వైట్ బాల్ క్రికెట్ లో భారత్ అగ్రస్థానాన్ని సమర్థించింది. రాబోయే సంవత్సరాల్లో జట్టు మరింతగా రాణింస్తుందని మేము భావిస్తున్నాం. ఆటగాళ్లు చూపిన అంకిత భావం, నిబద్దత కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి.
ఇవన్నీ ప్రపంచ వేదికపై భారత క్రికెట్ స్థాయిని పెంచుతుందని మేము భావిస్తున్నాము’’ అన్నారాయన
గత ఏడాది వెస్టీండీస్- యూఎస్ఏ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ను కూడా భారత్ ఒడిసి పట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాది భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత్ పైనల్ చేరింది. అయితే దురదృష్టవశాత్తూ టీమిండియా, ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది.
భారత్ చివరగా 2013 లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి సాధించింది. 2017 లో జరిగిన టోర్నిలో ఫైనల్ చేరినా పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే టీ20 ప్రపంచకప్ సాధించాక బీసీసీఐ టీమిండియాకు రూ. 125 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది.