ఐపీఎల్ వేలం: పంత్ కోసం పాతిక కోట్లు ఖర్చు పెడతారా?
ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ సారి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అత్యధిక ధర పలుకుతాడని అంచనాలు ఉన్నాయి.
By : The Federal
Update: 2024-11-24 08:20 GMT
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు వేళయింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ మెగా వేలం జరగనుంది. వేలంలో అందరి కళ్లు భారత వికెట్ కీపర్, ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా ముద్రపడ్డ రిషబ్ పంత్ పై ఉన్నాయి. వేలంలో ఎంత మొత్తం దక్కించుకుంటాడనే దానిపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. బహుశా వేలంలో అత్యధిక మొత్తం పంత్ పలుకుతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్నాళ్లు పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించిన అతన్ని .. జట్టు విడుదల చేసింది. జట్టు మొత్తం ప్రక్షాళన చేయాలని డీసీ నిర్ణయించుకుంది. తిరిగి వేలంలో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ పేర్లను వేలంలో నమోదు చేసుకున్నారు.
ఎంత డబ్బు ఉందంటే..
ఐపీఎల్ లోని 10 జట్లలోని 207 ఖాళీల కోసం వేలం జరగబోతోంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర రూ. 641. 5 కోట్ల మొత్తం ఉంది. ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) దగ్గర అత్యధిక మొత్తంలో డబ్బు ఉంది. పీబీకేఎస్ దగ్గర రూ. 110. 50 కోట్లు ఉన్నాయి. పంత్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ఈ జట్టు సిద్ధంగా ఉంది.
ప్రతి సీజన్ లో మొత్తం జట్టును మార్చే అలవాటు ఉన్న పీబీఎస్కే ఈసారి ప్రధాన కోచ్ పాంటింగ్ సలహ మేరకు మొత్తాన్ని తన దగ్గరే పెట్టుకుంది. పంత్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కూడా పోటీ పడవచ్చు. ఆర్సీబీ దగ్గర రూ. 83 కోట్ల మొత్తం ఉంది. అలాగే డీసీ కూడా తన ఆటగాడిని తిరిగి దక్కించుకోవడానికి రైట్ టూ మ్యాచ్( ఆర్టీఎం) కార్డును ఉపయోగించి దక్కించుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఈ వేలంలో ఏ భారతీయ ఆటగాడు దక్కించుకోని మొత్తం పంత్ పలుకుతాడని విశ్లేషణలు వస్తున్నాయి. జట్లు తమ కూర్పు ఆధారంగా పంత్ ను కొనుగోలు చేస్తారనే దానిపైనే రేటు ఆధారపడి ఉంది. ప్రస్తుతం జరిగే వేలంలో ముంబాయి ఇండియన్స్ కానీ, సీఎస్కే కానీ పంత్ ను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే వారి దగ్గర కేవలం 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా చాలామంది ఆటగాళ్లని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో 81 మంది ఆటగాళ్లు..
వేలంలో రిజిస్టర్ కనీస ధరగా రూ. రెండు కోట్ల కేటగిరీ బేస్ ప్రైస్‌లో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో భారతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరికి కనీసం మిలియన్ డాలర్ల మార్కు అందుకుంటారని చెప్పవచ్చు. పంత్ తరువాత అత్యధిక మొత్తం భారత లెప్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేస్తాయని చెప్పవచ్చు.
సింగ్ మూడు సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ లో 96 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి మంచి ధర పలికే అవకాశం ఉంది. దాదాపు 20 కోట్ల వరకూ ఖర్చు పెట్టవచ్చు. ఢిల్లీ కెప్టెన్ గా తిరిగి శ్రేయస్ అయ్యార్ ఉంటారని వార్తలు బయటకు వస్తున్నాయి.
షమీకి ఎంత పలుకుతాడు..
RCB, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా కొత్త కెప్టెన్ల కోసం వెతుకుతున్నాయి. ప్రస్తుతం వేలంలో అయ్యార్ తో పాటు, పంత్, రాహుల్ కూడా కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.
ఇషాన్ కోసం ముంబాయి పోయిన సారిలా రూ. 15 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేదు. షమీ ఫ్రాంచైజీలకు పెద్దగా ఆకర్షించకపోవచ్చని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు.
IPL 2025 వేలంలో మంచి ధర పలికే ఆటగాళ్ల అంచనా..
1) ఖలీల్ అహ్మద్: అర్ష్‌దీప్‌ని కొనుగోలు చేయలేని జట్లు ఖలీల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. యష్ దయాల్‌ను కూడా RCB ఆర్టీఎం కార్డును ఉపయోగించి దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖలీల్ మంచి ధర దక్కించుకోగలడు.
2) దీపక్ చాహర్: గత కొన్నేళ్లుగా గాయాలు అతని డిమాండ్ ను తగ్గించాయి. కానీ భారత పరిస్థితుల్లో దీపక్ ను మించిన మంచి స్వింగ్ బౌలర్ లేడు. పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడనే పేరుంది. రంజీ ట్రోఫిలో ఆడి తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడవచ్చు.
3) అవేష్ ఖాన్: గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున 19 వికెట్లు పడగొట్టాడు. క్రితం సీజన్ లో రూ. 10 కోట్ల ధర పలికాడు. అతను మరోసారి మంచి బిడ్‌ని పొందవచ్చు.
4) హర్షల్ పటేల్: గత సీజన్ లో 24 వికెట్లు తీశాడు. దాదాపు మిలియన్ డాలర్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఐపీఎల్ లో మరోసారి ప్రదర్శన చేసి సెలెక్టర్లును మెప్పించే అవకాశం ఉంది. అందుకోసమైన ఫ్రాంచైజీలు అతనిపై గురి పెట్టే అవకాశం ఉంది.
5) భువనేశ్వర్ కుమార్: పవర్‌ప్లే ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలో అరుదైన రికార్డు ఉన్న ఈ స్వింగ్ సీమర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అతని అనుభవం ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్లను ఆకర్షించవచ్చు. అతను రూ. 10 కోట్ల లోపు ధర పలుకుతాడు.
6) జోస్ బట్లర్: ఈ వేలంలో బెన్ స్టోక్స్ ఆడటం లేదు కనుక బట్లర్ మంచి ధర పలకవచ్చు. జైశ్వాల్ తో మంచి ఓపెనింగ్ అందించిన బట్లర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడతాయి. ఆర్సీబీ అతని కోసం ఎంత ధర అయిన పెట్టవచ్చు.
7) లియామ్ లివింగ్‌స్టోన్: లివింగ్‌స్టోన్ మంచి ఆటగాడు. బంతిని బలంగా బాదడంలో అతనికి అతనే సాటి. లియామ్ ను ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ RTM ద్వారా దక్కించుకోవచ్చు. అలాగే అతను కొన్ని ఇతర ఫ్రాంచైజీల జాబితాలో ఉండవచ్చు. అతను ఖచ్చితంగా మంచి మొత్తాన్ని పొందుతాడు.
8) కగిసో రబడ: ఐపీఎల్ యూనివర్స్‌లో కగిసో రబడకు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి పేసర్‌ను తిరిగి దక్కించుకోవచ్చు. అలాగే పంజాబ్‌కు RTM ఉపయోగించి తిరిగి దక్కించుకోవచ్చు. బుమ్రాకు మంచి పేస్ భాగస్వామిని తీసుకోవడం ముంబాయి ఇండియన్స్ చూస్తోంది కానీ.. అందుకు అవసరమైన మొత్తం దాని దగ్గర లేదు.