తెలంగాణలో ఆల్ టైం రికార్డ్ ఉష్ణోగ్రత,వైద్యుల అత్యవసర సలహా

తెలంగాణలో మండే ఎండలు, వడగాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది మరణించారు. దీంతో వైద్యాధికారులు అత్యవసర సలహా జారీ చేశారు.

Update: 2024-05-05 02:50 GMT
తెలంగాణలో భగ భగ మండుతున్న సూర్యుడు

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మే 4వతేదీ శనివారం హైదరాబాద్ నగరంలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2015వ సంవత్సరం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో నమోదైనాయి. ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉన్నందున హైదరాబాద్ హీట్‌వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణలో అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 46.8 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి, ఇది ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికం. నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాలు, పెద్దపల్లిలో కూడా 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్, ధర్మపురి మండలం జైన, నేరెళ్ల గ్రామాల్లో, కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో శనివారం 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలకు చేరింది. కీసర, ఘట్ కేసర్ ప్రాంతాల్లో 45.1 డిగ్రీల సెల్సియస్, చిలకూరు, మొయినాబాద్ ప్రాంతాల్లో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగర శివార్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం ఆల్ టైమ్ రికార్డు అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు చెప్పారు. సోమవారం తెలంగాణలో ఇదే ఎండవేడిమి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

వడదెబ్బతో 19 మంది మృతి

తెలంగాణలో శనివారం ఒక్క రోజే వడదెబ్బతో 19 మంది మరణించారు. జగిత్యాల, కరీంనగర్,నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 22 జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ 15 శాతానికి తగ్గింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేలా గోండుగూడెం గ్రామంలో సోము, వెల్గటూరు, ఎండపల్లి మండలాల ఏంఈఓ బత్తుల భూమయ్య వడదెబ్బతో మరణించారు.

అత్యవసర సలహా జారీ

తెలంగాణలో మండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో తెలంగాణ ప్రజా వైద్యఆరోగ్య శాఖ అత్యవసర సలహాను జారీ చేసింది. తెలంగాణాలోని 18 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు శనివారం నాడు నమోదయ్యాయి.

- ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోనుంచి బయటకు రావద్దని వైద్యాధికారులు సలహా ఇచ్చారు.

- దప్పిక అనిపించక పోయినా తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సూచించారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), ఇళ్లలో తయారు చేసుకున్న నిమ్మరసం, బటర్ మిల్క్, లస్కీ, పండ్ల రసాలు కొంత ఉప్పు కలుపుకొని తాగాలని వైద్యులు కోరారు.

- ప్రయాణం చేసే వారు విధిగా మంచినీటి బాటిళ్లను వెంట తీసుకువెళ్లాలని కోరారు.

- సీజనల్ పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి, నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చపండ్లు, మస్క్ మిలన్, ఆరంజ్, ద్రాక్ష, ఫైనాపిల్, దోస కాయలు తినాలని వైద్యులు సలహా ఇచ్చారు.

ఇళ్లలోనే ఉండండి

- సూర్యుడు ప్రభావితం చూపించే సమయంలో ప్రజలు ఇళ్లలోపల సురక్షితంగా ఉండాలని, వదులుగా ఉండే లైట్ కలర్ కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు.

- ఎండలోకి వెళ్లాల్సి వస్తే తలను గుడ్డ, లేదా టోపి, గొడుగు, టవలుతో సూర్యరశ్మి తగలకుండా కప్పుకోవాలి.

- ఎండలో బయటకు వెళ్లేటపుడు షూ లేదా చెప్పులు తప్పకుండా ధరించాలి.

- ఎండ పడకుండా వెంటిలేషన్ ఉన్న చల్లని ప్రదేశాల్లో, ఇళ్లలోపల ఉండాలి

- సూర్యరశ్మి, వడగాలులు తగలకుండా చూసుకోవాలి. పగలు కిటికీలకు కర్టెన్లతో మూసివేయాలి. రాత్రి వేళ చల్లని గాలి ఇంట్లోకి వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.

- ఏదైనా పని ఉంటే ఎండవేడిమి లేనపుడు చల్లని గాలి వీచే సమయం అంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేసుకోవాలి.

- భారత వాతావరణశాఖ హెచ్చరికలను పాటిస్తూ ఇళ్లలో సురక్షితంగా ఉండాలని వైద్యులు ప్రజలకు సూచించారు.

వడదెబ్బతో జర జాగ్రత్త

సూర్యుడి వేడి వల్ల వడగాల్పులు వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు ఎండలో, వేడి గాలుల్లో తిరగకూడదు. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌‌కు గురవుతారు. వడ దెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్ డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లిపోతారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

ఎవరైనా వడదెబ్బకు గురై పడిపోతే అంబులెన్స్‌కు కాల్ చేయాలి.అంబులెన్స్ వచ్చేలోపు బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశం లేదా చెట్టు నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి. అవసరమైతే బాధితుడి శరీరంపై దుస్తులు ఉంటే వాటిని తొలగించి గాలి తగిలేలా చూడాలి.వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కోసం క్లాత్‌ను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవాలని వైద్యులు సూచించారు. 

Tags:    

Similar News