అయోధ్య రామా.. అద్వానీ చేసిన నేరము ఏమీ!
చరిత్ర మరుగున పడి కాన్పించని ఓ పెద్దాయన హస్తినాపురిలో తనకు పిలుపెప్పుడు వస్తుందోననుకుంటుండగా హఠాత్తుగా పిడుగుపడినంత పనైంది.
“ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా,
చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా” అంటూ ఆవేళ భక్త రామదాసు వాపోయాడు. పాపం ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీ కురువృద్ధులు లాల్ కిషన్ అద్వానీ, మరుళీ మనహోర్ జోషి కి వచ్చింది.
అయోధ్య రామమందిరం పునర్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. రాములోరి విగ్రహ ప్రతిష్టాపన పనులు ముగిశాయి. శ్రీరామ పట్టాభిషేకానికి సర్వంసిద్ధమైంది. ఆకాశమంత పందిళ్లు, భూదేవంత పెళ్లిపీటలు సిద్ధమయ్యాయి. దేశదేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ప్రజలందరూ ఊపిరి బిగపట్టి శ్రీరాముడు ఎప్పుడెప్పుడు దర్శనం ఇస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ చరిత్ర మరుగున పడి కాన్పించని ఓ పెద్దాయన హస్తినాపురిలో తనకు పిలుపెప్పుడు వస్తుందోననుకుంటుండగా హఠాత్తుగా పిడుగుపడినంత పనైంది.
మీ వయసు పెద్దది.. వద్దులే...
ఆ పెద్దాయనే లాల్ కిషన్ అద్వానీ. అయోధ్య కోసం రథాన్నెక్కి బీహార్ లో అరెస్టయి ఊచలు లెక్కించిన పెద్ద మనిషి. అయోధ్యను తెరపైకి తెచ్చి ఉద్యమానికి పురుడుపోసిన అద్వానీకి పిలుపు లేకుండా పోయింది. ఈ కురువృద్ధుడికి అసలు కబురు ఆలస్యంగా అందింది. ‘ నువ్వొద్దులే పెద్దాయన, ఆ తర్వాత ఎప్పుడైనా రండనే ‘కబురందింది. అద్వానీ అప్రతిహాత రథయాత్రకు నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సడన్ బ్రేక్ వేయడంతో దేశవ్యాప్తంగా అయోధ్య ఉద్యమం ఉప్పెనలా ఊపందుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాజపేయి ప్రభుత్వం వచ్చింది. అది వేరే కథ. అటువంటి రథసారధి అద్వానీ అయోధ్య టెంపుల్ ఆరంభ కార్యక్రమానికి దూరమవుతున్నారు.
అద్వానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావద్దని రామ మందిరం ట్రస్టు కోరింది. అందుకు ఆయన కూడా చేసేదేమీ లేక అంగీకరించారు. ‘‘ అద్వానీ వయసు 96 ఏళ్లు. పెద్ద వయస్కులు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి రావొద్దని విజ్ఞప్తి చేశాం. మా వినతిని అంగీకరించారు’’ అని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఏకంగా మీడియాకే చెప్పారు.
దేవెగౌడ వయసు పెద్దది కాదా?
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి నరేంద్ర మోదీ. ప్రధాని హోదాలో మోదీ పక్కనే ఉన్న అద్వానీనే పట్టించుకోలేదని, అద్వానీ నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం చేయలేదని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో అద్వానీ కూడా అక్కడికి పోకుండా ఉండడమే మేలనుకుని ఉండొచ్చునని ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఒకరు చెప్పారు. మరోపక్క, జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలంటూ 90 ఏళ్ల మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
అక్షత్ పూజతో అయోధ్య వేడుకలు ప్రారంభం..
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు భవ్యరామమందిరంలో శ్రీరామచంద్రుని విగ్రహం ప్రాణప్రతిష్టకు తరలిరానున్నారు. ప్రముఖులకు, ప్రజలకూ నిర్వాహకులు ఆహ్వానాలు పంపుతున్నారు. అయోధ్యలో ప్రత్యేకంగా నిర్వహించిన అక్షత్ పూజలో ఉపయోగించిన అక్షింతలతో జమ్మూకశ్మీర్‌లో భక్తులను ఆహ్వానిస్తున్నారు.
ఏమిటీ ఈ అక్షింతల ప్రత్యేకత అంటే
నవంబరులో అయోధ్యలో అక్షత్ పూజ నిర్వహించారు. వంద క్వింటాళ్ల బియ్యానికి పసుపు, నెయ్యి కలిపి అక్షింతలు తయారుచేశారు. ఈ అక్షింతలను VHP సభ్యులు దేశవ్యాప్తంగా భక్తులకు అందజేస్తున్నారు. ఇందుకోసం...కలశాలలో అక్షింతలను పలుప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వేలసంఖ్యలో సాధువులు పాల్గొంటారు.