బీహార్ కే అంతా, ఆంధ్రాకు కొంత! లోపం బాబుదా, మోదీదా?
ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న అతిపెద్ద పార్టీ టీడీపీ అయితే, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏపీకంటే, జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌కు పెద్ద పీట వేశారు.
దయనీయ పరిస్థితిలో ఉన్న ఏపీని ఆదుకోవటానికి లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. ఇవాళ ప్రకటించినది చూస్తే ఈ సంవత్సరానికిగానూ అమరావతి నిర్మాణంకోసం రు.15,000 కోట్లు. ముందు సంవత్సరాలలో అదనపు నిధులు ఇస్తామని చెప్పారు. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తామని, త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సూత్రప్రాయంగా చెప్పారు. ఇంతకు తప్పితే ఇదమిత్ధంగా ఏపీకి కేటాయిస్తున్నట్లు నిర్మల ప్రకటించింది ఏమీ లేదు.
మరోవైపు బీహార్‌పై మాత్రం నిర్మల నిధుల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రంలోని వివిధ రోడ్ ప్రాజెక్టులకు రు.26,000 కోట్లు కేటాయించారు. వరదల నియంత్రణకోసం రు.11,500 కోట్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పిర్‌పైంటిలో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని రు.21,400 కోట్లతో నెలకొల్పుతామని ప్రకటించారు. గయలో పారిశ్రామికవాడను నెలకొల్పుతామని చెప్పారు. గయలోని విష్ణుపాద దేవాలయాన్ని, బోధ్ గయలోని మహాబోధి దేవాలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం తరహాలో ప్రపంచ స్థాయి వారసత్వ సంపద కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటంతోపాటు, నలందను పర్యాటక కేంద్రంగా మారుస్తామని నిర్మల చెప్పారు.
16 మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అయితే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికంటే 12 సీట్లతో రెండో అతి పెద్ద పార్టీ అయిన జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌కు పెద్ద పీట వేయటం వెనక ప్రభుత్వ పెద్దల ఉద్దేశ్యమేమిటో ప్రస్తుతానికి తెలిసి రావటంలేదు. దీనికి కారణం, చంద్రబాబు తనకున్న bargaining power ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటమా, లేక మోది తదితర ప్రభుత్వ పెద్దలకు ఏపీ పట్ల నిర్లక్ష్య వైఖరా అనేది తేలాల్సి ఉంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాకోసమో, దేనికోసమో గానీ, ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలో ఏపీకి మంత్రుల సంఖ్య గురించిగానీ, కీలక పోర్ట్‌ఫోలియోల గురించిగానీ మోదిపై ఒత్తిడి తీసుకురాలేదు. పైగా, ఫలితాలు వెలువడగానే ప్రధాని పదవితోసహా దేనికైనా టీడీపీకి అవకాశమిస్తామని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, బాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మోదికి ఇంత గౌరవం ఇచ్చినాకూడా చంద్రబాబు పట్ల కేంద్ర ప్రభుత్వ స్పందన సముచితంగా లేదు అనేది సుస్పష్టం.
ఇదిలాఉంటే, వైసీపీ నేతలు ఈ విషయంపై చంద్రబాబునాయుడును ఎద్దేవా చేస్తున్నారు. బాబు కేంద్రంలో చక్రం తిప్పలేకపోయారు అని, కేంద్రం ఏపీకి పంగనామాలు పెట్టిందని రాజమండ్రి మాజీ ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.