ముంచిన వాడు మోదీ... తెలంగాణ కాంగ్రెస్ చార్జ్ షీట్
కేంద్రంలో బీజేపీ పదేళ్ల మోదీ పాలనపై ఛార్జీషీటును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురువారం గాంధీ భవన్ లో విడుదల చేసింది. ఈ ఛార్జ్ షీటులో బీజేపీ నయవంచనను బయటపెట్టారు.
2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఏడాదికి 2 కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ కేవలం 7 లక్షల ఉద్యోగాలే కల్పించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మద్ధతుధర ఇస్తామని చెప్పిన మోదీ ఆదానీ, అంబానీ, అమెజాన్ లకు లబ్ది చేకూరేలా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. గత పది సంవత్సరాల బీజేపీ మోదీ ప్రభుత్వ వైఫల్యాల మీద తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జ్ షీటును కాంగ్రెస్ నేతలు విడుదల చేశాక సీఎం మాట్లాడారు. స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయల నల్ల ధనాన్ని తీసుకువస్తామని పేదల ఖాతాల్లో వేస్తామన్న ప్రధాని చిల్లిగవ్వ కూడా పేదల ఖాతాలో వేయలేదని సీఎం విమర్శించారు. 410 రూపాయలున్న సిలిండరు ధరను 1200 రూపాయలకు, 80 రూపాయల లీటరు మంచి నూనె ధర 150 రూపాయలకు పెంచి సామాన్యుడు బతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని రేవంత్ ఆరోపించారు.
బీజేపీకి ఓటు వేయవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
భక్తులని చెప్పే బీజేపీ అగర్ బత్తులపై కూడా బీజేపీ జీఎస్టీ విధించిందని రేవంత్ విమర్శించారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, పెన్సిల్ పై జీఎస్టీ మోదీ దోపిడీ కొనసాగిందని సీఎం చెప్పారు. 1947 పంద్రా ఆగస్టు నుంచి 14 మంది ప్రధాన మంత్రులు రూ. 55 లక్షల కోట్లు అప్పు చేయగా, 2014 నుంచి 2024 వరకు మోదీ రూ. 113 లక్షల కోట్ల మేర రెండింతల అప్పు చేశారని సీఎం చెప్పారు. రూ. 168లక్షల కోట్ల అప్పు ఉందని, నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు దేశాన్ని అప్పుల ఊబిలో ముంచిందని రేవంత్ విమర్శించారు. ఎల్ఐసీ నుంచి పబ్లిక్ కంపెనీలను కార్పొరేట్ కంపెనీలకు విక్రయించారని ఆయన ఆరోపించారు. బీజేపీపై, మోదీపై కాంగ్రెస్ ఛార్జ్ షీటు విడుదల చేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రేవంత్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీజేపీకి ఒక్క ఓటు వేయవద్దని రేవంత్ కోరారు.
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఛార్జ్‌షీట్
కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ ను గురువారం విడుదల చేసింది. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ తెలంగాణ కమిటీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీలు నయవంచన పోస్టరును విడుదల చేశారు.బీజేపీ వైఫల్యాలను తాము కాంగ్రెస్ ఛార్జ్ షీటులో పెట్టామని కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్ మున్షీ చెప్పారు. తాము ప్రజల ఆకాంక్షల మేర న్యాయసూత్ర పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశామని ఆమె చెప్పారు.
గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీ
పదేళ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పేరుతో హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ కు గత పదేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఫ్లెక్సీలో పెట్టారు. కృష్ణా జలాల్లో వాటా అంశాలను ఈ బ్యానరులో ప్రస్థావించారు. దేశం నుంచి బ్లాక్ మనీని తుడిచిపారేస్తామని చెప్పిన బీజేపీ బాండ్ల స్కాంకు తెర లేపిందని కాంగ్రెస్ బ్యానరులో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి పంపిస్తే, అందులో నుంచి 43 పైసలు బిచ్చం ఇస్తామని బీజేపీ కేంద్ర సర్కారు చెపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు ఏవి?
బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాలు తెరిస్తే ధన్ ధన్ రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ మా డబ్బులు ఎక్కడ వేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రస్థావించారు. పదేళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారని, అవి ఏమయ్యాయని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పదేళ్లలో దేశం అప్పు మూడింతలు అయింది. 2014వ సంవత్సరం వరకు రూ.55 లక్షల కోట్ల అప్పు ఉండగా 2024 సంవత్సరానికల్లా ఆ అప్పు రూ.183.67 లక్షల కోట్లకు పెరగటాన్ని కాంగ్రెస్ నయవంచన ఫ్లెక్సీలో వెల్లడించింది.
రైతుల ఆత్మహత్యలపై నిరసన
కృష్ణానదిలో ఆంధ్రాకు అధిక జలాల వాటా కేటాయించారని, పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. పదేళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను గణనీయంగా పెంచారని, మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే పెట్రో లీటరు ధర 400 రూపాయలుగా పక్కా చేస్తారని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా మోదీ సర్కారు ఇవ్వలేదని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కొత్త మెడికల్ కళాశాలలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ప్రచారాస్త్రంలో పేర్కొంది.
మేడారం జాతరకు జాతీయ హోదా ఏది?
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించలేదని, ములుగు గిరిజన యూనివర్శిటీ, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని కొత్త హామీల్లో చెప్పినా, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినా కేంద్రం సాయం చేయలేదని, ఐటీఐఆర్ పెండింగులోనే ఉంచిందని కాంగ్రెస్ పేర్కొంది. పెట్రోల్ లీటరు ధర రూ.108. డీజిల్ లీటరు రూ.9, కందిపప్పు కిలో ధర రూ.180, వంటనూనె లీటరు ధర రూ.180 కు పెంచారని కాంగ్రెస్ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఏది?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేయలేదని కాంగ్రెస్ నేతలు నయవంచన పోస్టరులో ప్రస్థావించారు. దేశ సరిహద్దుల్లో చైనా సైనికులు వైలెంటుగా ఉన్నా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం సైలెంటుగానే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ పదేళ్ల కన్నీటి పాలనను యాదుంచుకుందాం...ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.