ఆఫ్గనిస్తాన్‌కు కొత్త ఊపిరి పోస్తున్న క్రికెట్ ఆట!

తాలిబన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల గుర్తింపుకు నోచుకోని పరిస్థితిలో ఉండగా, క్రికెట్ జట్టు విజయంతో తమపై ఉన్న బహిష్కృత ముద్రను తొలగించుకోవటానికి మార్గం సుగమం అయింది.

Update: 2024-06-26 16:45 GMT

ఆమెరికాలో జరుగుతున్న టీ 20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరుకోవటాన్ని కేవలం ఒక క్రీడా విజయంగా మాత్రమే చూడకూడదు. ఆఫ్గనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల గుర్తింపుకు నోచుకోని పరిస్థితిలో ఉండగా, ఆ దేశపు క్రికెట్ జట్టు విజయం పుణ్యమా అని తమపై ఉన్న బహిష్కృత ముద్రను తొలగించుకోవటానికి ప్రభుత్వానికి మార్గం సుగమం అయింది.

తాలిబన్ ప్రభుత్వంపై తిరస్కారభావం

ముప్ఫై ఏళ్ళ తర్వాత, 2021 ఆగస్ట్ 15న తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, క్రీడలలోకి ఆడవారిని నిషేధించటం వంటి తీవ్రమైన ఛాందస విధానాలను అనుసరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఏవగింపుతో చూస్తున్నా

చివరికి, అమెరికాలో టీ 20 క్రికెట్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించటం, పటిష్ఠమైన ఆస్ట్రేలియా జట్టుపై అద్భుత విజయం సాధించటం వంటి ఎన్నో ఘనతలను సాధిస్తున్న ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కూడా చిన్నచూపుతో చూడబడుతోంది.

ఉదాహరణకు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికీ తాలిబన్‌ను ఇంకా గుర్తించలేదు. దీనికి కారణం మహిళలపై ఆ ప్రభుత్వం విధించిన నిషేధంలో మహిళా క్రికెట్ కూడా ఉండటం.

దీని అర్థం ఏమిటంటే, ఆఫ్గన్ జట్టు మ్యాచ్ ఆడటానికి ముందు ఆ దేశ జాతీయ జెండాను ప్రదర్శించటం, ఆ దేశ జాతీయగీతం ఆలపించటం జరగటంలేదు.

తాలిబన్ షరతులు

సంగీతం లేకుండా జాతీయ గీతాన్ని వినిపించాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ దానిని మన్నించలేదని అంటున్నారు.

ఆఫ్గన్ జట్టులోని ఇద్దరు ముఖ్య ఆటగాళ్ళు ఆ దేశంలో జీవించరు. కెప్టెన్ రషీద్ ఖాన్, ఆల్ రౌండర్ మహమ్మద్ నబి దుబాయ్‌లో నివశిస్తారు.

తాలిబన్‌లు మొదటిసారి, 1990 నుంచి 2001 దాకా పరిపాలించిన సమయంలో క్రికెట్‌ను నిషేధించారు. అమెరికా ఆక్రమణ సమయంలో పాకిస్తాన్, భారత్‌ల సాయంతో ఆఫ్గనిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధి చెందింది.

వాస్తవానికి 1979-1990 కాలంలో రష్యా ఆక్రమణ సమయంలో పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరాలలో తలదాచుకున్న ఆఫ్గన్ దేశస్థులకు క్రికెట్ మొదటిసారి పరిచయం అయింది.

క్రికెట్-రాజకీయాల సంబంధం

పాకిస్తాన్ దేశం తాలిబన్‌లను పెంచిపోషించటంతో, క్రికెట్, రాజకీయాలు పెనవేసుకుపోయాయి. అమెరికాలో 9/11 తీవ్రవాద దాడులు జరిగిన తర్వాత అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ దళాలు తాలిబన్‌లను అధికారంనుంచి తప్పించి ఆక్రమించుకున్నప్పుడు ఆఫ్గనిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి బీజం పడింది.

2021లో తాలిబన్‌లు తిరిగి అధికారంలోకి వచ్చే సమయానికి ఆఫ్గనిస్తాన్‌లో క్రికెట్ వేళ్ళూనుకుపోయింది. 2017లోనే ఐసీసీలోకి ఆఫ్గనిస్తాన్‌కు ప్రవేశం లభించింది, పూర్తిస్థాయి క్రికెట్ ఆడే దేశంగా గుర్తించబడింది.

ఆఫ్గనిస్తాన్ జట్టు కొన్ని మంచి విజయాలనే సాధించింది, రషీద్ ఖాన్ వంటి కొంతమంది ఆటగాళ్ళు తమదైన ముద్ర వేసుకున్నారు.

ఛాందసవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేసే తాలిబన్‌లు తమ రెండో విడత పాలనలో క్రికెట్‌ను మాత్రం నిషేధించలేకపోయారు. తమ మద్దతుదారులు, అధికారులు కూడా క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, ఆడుతుండటంతో తాలిబన్‌లు ఏమీ చేయలేకపోయారు.

అత్యంత కఠినంగా ఉండే తాలిబన్ పాలనలో క్రికెట్ కొద్దో గొప్పో సంస్కరణలు తీసుకురావటానికి అవకాశం కల్పించింది. ఆఫ్గనిస్తాన్ జట్టు మ్యాచ్‌లు ఆడబోయే ముందు పాత జాతీయగీతం వినిపించటం, జెండాను ప్రదర్శించటాన్ని కాబూల్‌లోని తాలిబన్ ప్రభుత్వం నిరాసక్తంగానే చూస్తూ ఊరుకుంది.

పోయినవారం ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి తమ జట్టు ప్రవేశించటంతో దేశ ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి వేడుక చేసుకున్నారు.

ఆఫ్గనిస్తాన్ వీధుల్లోకి వచ్చి చేసుకున్న ఆ వేడుకలను, ఆ ఉత్సాహాన్ని తాలిబన్‌లు నియంత్రించలేకపోయారు.

1979లో సోవియట్ రష్యా ఆక్రమించిననాటినుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఇలా వేడుక జరుపుకోవటం ఇదే మొదటిసారి. ఎన్నో ఏళ్ళనుంచి తాము అనుభవిస్తున్న సంక్షోభం, బాధలు, రక్తపాతాలను ఈ క్రికెట్ ఆట మర్చిపోయేలా చేస్తోందని ఆఫ్గనిస్తాన్ ప్రజలు అంటున్నారని వార్తలు వస్తున్నాయి.

క్రికెట్ మరియు దౌత్యం

దౌత్యపరంగా దేశానికి ఇటీవల జరుగుతున్న సానుకూల పరిణామాలు క్రికెట్ మైదానంలోని ధీరోదాత్త కృత్యాలను తలపిస్తున్నాయి. బీజింగ్‌లో తాలిబన్ రాయబారికి చైనా ప్రభుత్వం ఇటీవల గుర్తింపు ఇచ్చింది. ఇలా తాలిబన్ రాయబారిని మరొక దేశం గుర్తించటం ఇదే మొదటిసారి.

ఈ ఏడాది జనవరిలో ఆఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాకి నేతృత్వంలో కాబూల్‌లో జరిగిన ఒక సమావేశంలో భారత్ కూడా పాల్గొంది.

అంతకుముందు ఢిల్లీలోని ఆఫ్గనిస్తాన్ రాయబార కార్యాలయాన్ని మూసేయటం జరిగింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మాత్రం పని చేస్తూనే ఉంది. అయితే భారత ప్రభుత్వంగానీ, చైనా ప్రభుత్వంగానీ అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు.

పరోక్ష రాయబారి

తాలిబన్ ప్రభుత్వానికి ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సాధించిన విజయం ఒక పరోక్ష రాయబారిలాగా కనిపిస్తోంది. పశ్చిమ దేశాలు తాలిబన్ ప్రభుత్వంపై మెత్తబడతాయేమోనని ఆశిస్తోంది.

తాలిబన్‌ల ఛాందస వైఖరిని క్రికెట్ మార్చగలుగుతుందని ఆశించటం అమాయకత్వమే అవుతుందిగానీ, మిగిలిన దేశాలకూ, ముఖ్యంగా ఆసియా దేశాలకూ తాలిబన్‌ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ప్రారంభమవటానికి క్రికెట్ తోడ్పడవచ్చు.

భారతదేశంలో ముస్లిమ్ వ్యతిరేక ధోరణి ఉన్నప్పటికీ నరేంద్ర మోది ప్రభుత్వం తాలిబన్ ప్రభుత్వం పట్ల మెతక ధోరణితో వ్యవహరిస్తోంది. రాజకీయపరంగా ఇది మంచి చర్యే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే భారత ప్రభుత్వంతో సంబంధాలు బాగోకపోతే ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్‌కు దగ్గరయ్యే ప్రమాదం ఉంది.

పాకిస్తాన్ స్నేహ హస్తం

1990లలో లాగా పాకిస్తాన్ స్నేహ హస్తాన్ని అందుకోవటానికి తాలిబన్ ప్రభుత్వం ఆసక్తి చూపటంలేదు. అమెరికా ఒత్తిడి ఫలితంగా 2001-2021 మధ్య ప్రవాసంలో ఉన్న తాలిబన్‌ల పట్ల పాకిస్తాన్ కఠిన వైఖరి అవలంబించటంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిని ఉన్న

తాలిబన్ మొదటి దఫా పాలనలో అంత సత్సంబంధాలు లేని భారత్‌కు ఇప్పుడు కాబూల్‌లో మంచి గౌరవం ఇస్తున్నారు. దీనికి కారణం మళ్ళీ క్రికెట్టే. ఆఫ్గనిస్తాన్ జట్టులోని రషీద్ ఖాన్, రహమతుల్లా, గుర్బాజ్, నవీన్ ఉల్ హక్ వంటి ప్రముఖ ఆటగాళ్ళు ఐపీఎల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆఫ్గనిస్తాన్ జట్టు ప్రాక్టీస్ చేసుకోవటానికి భారతదేశం క్రికెట్ మైదానాలను ఇవ్వటమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా సాయపడుతోంది.

ఆర్థిక ప్రయోజనాలు

ఆఫ్గనిస్తాన్‌ను ప్రపంచదేశాలు ఆమోదింపజేసేటట్లుగా క్రికెట్ చేయగలదని, ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని అర్థమవటంతో తాలిబన్ ప్రభుత్వం తన కఠినమైన చట్టాలని సరళీకరించే అవకాశం కనబడుతోంది.

ఎవరికి తెలుసు, తాలిబన్ ప్రభుత్వం ఉదారవాద, సహనశీల ప్రభుత్వంగా మారుతుందేమో. అలా జరిగితే, క్రికెట్ క్రీడకే ఆఫ్గనిస్తాన్ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలి.

Tags:    

Similar News