డాబాపైన డ్రాగన్ పళ్ళ సాగు: నెలకు రు.లక్షన్నర గడిస్తున్న రిటైర్డ్ టీచర్

మామూలుగా డ్రాగన్ పళ్ళ సాగులో రైతులకు నెలకు రెండు సార్లు కాపు వస్తుంటే, సేంద్రియ పద్ధతిలో పండించటంవలన రేమాబాయికి నెలకు మూడుసార్లు కాపు వస్తోంది.

Update: 2024-09-19 11:44 GMT

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. కొందరు సీనియర్ సిటిజన్‌లు మాత్రం వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన రేమాబాయి అనే మహిళ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా కూర్చోవటం ఇష్టంలేక తన సొంత ఇంటిపైనే సేంద్రియ పద్ధతిలో పళ్ళసాగు మొదలుపెట్టి నెలకు లక్ష రూపాయలు గడిస్తూ సక్సెస్ స్టోరీగా మారారు.

గజం నేల కూడా లేకుండా, కాలు కదపకుండా ఇంటి కప్పుపైనే పళ్ళు పండిస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదించటం అంటే మాటలు కాదు. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు రేమాబాయి. 36 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూలులో రిటైర్ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది… ఇక చాలు విశ్రాంతి తీసుకుందాము అని. 2022లో రిటైర్ అయిన రేమాబాయి కూడా అలాగే అనుకున్నారు. అయితే తన పదవీ విరమణ సమయంలోనే తన తల్లి చనిపోవటం, కొడుకు ఉద్యోగరీత్యా దూరమవటం, భర్త తన పనిలో తాను ఉండటంతో జీవితంలో ఏర్పడిన ఆ వెలితిని మర్చిపోవటంకోసం ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. డ్రాగన్ పళ్ళతో కొలెస్టరాల్ తగ్గటం, కంటి చూపు మెరుగవటం వంటి ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయని తన కుమారుడు చెప్పటంతో దానిపై ఆసక్తి పెరిగింది. రెండు నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాత డ్రాగన్ పళ్ళ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు.

మొదట తన ఇంటి ఆవరణలో ఖాళీగా ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో సాగు మొదలుపెట్టారు. డ్రాగన్ పళ్ళ మొక్కలకు ఆసరాగా ఉండటంకోసం 90 కాంక్రీట్ స్తంభాలు పాతారు. ఈ స్తంభాలు ఒక్కొక్కటి నాలుగు డ్రాగన్ పళ్ళ మొక్కకు ఆసరాగా నిలిచాయి. అలా ఆ 4 సెంట్ల స్థలంలో 400 మొక్కలు పెంచారు. అవి బాగా పెరిగి దిగుబడి బాగా రావటంతో,డాబా పైన కూడా ఆ పళ్ళసాగును ప్రారంభించారు. మట్టిని డాబాపైకి తీసుకెళ్ళటం కష్టమవటంతో, మట్టిలేకుండా పండించే సాయిల్ లెస్ పద్ధతిని అనుసరించాలనుకున్నారు.

రేమాబాయి ముందు 50 ప్లాస్టిక్ డ్రమ్ములను తీసుకుని, డాబాపై పెట్టి దానిలో ఆకులు పరిచారు. తర్వాత రంపపు పొట్టు, దానిపై వరిపొట్టు, దానిపై కంపోస్టును పలుచని పొరగా వేశారు. డ్రమ్ముకు కిందభాగంలో నీళ్ళు పోవటానికి చిన్న రంధ్రం చేశారు. అప్పుడు దానిలో మొక్కలు నాటారు. వాటికి ఎరువును కూడా ఆమే తయారు చేసుకున్నారు. ఎండిన ఆకులు, కూరగాయల వ్యర్థాలు, రొయ్యపొట్టును వేస్తుంటారు. మరోవైపు, కేజీ చేప, రొయ్య, ఎండ్రకాయ పొట్టుకు అంతే పరిమాణంలో బెల్లాన్ని, బొప్పాయి తొక్కలను కలిపి నీడలో పెట్టి, మూడు రోజులు ఆగి, అది ఎరువుగా మారిన తర్వాత తీసి మొక్కలకు వేస్తారు. ఈ ఎరువులోని క్యాల్షియం, ఫాస్ఫరస్ మొక్కల పెరుగుదలకు బాగా సాయపడుతుందని రేమాబాయి తెలిపారు. డ్రమ్ములలో పెట్టిన మొక్కలనుంచి ఆరునెలల్లో పళ్ళు వచ్చాయని చెప్పారు. ఒక్కో డ్రమ్ములో పెట్టిన రెండు మొక్కల ద్వారా 30 పళ్ళ చొప్పున మొత్తం 50 డ్రమ్ముల ద్వారా 1,500 పళ్ళు పండాయని తెలిపారు. ఇవి 600 గ్రా. నుంచి 800 గ్రా. వరకు బరువు ఉంటాయని చెప్పారు.

డాబాపైన, కింద ఖాళీ స్థలంలో కాస్తున్న డ్రాగన్ పళ్ళ ద్వారా రేమాబాయి నెలకు మొత్తం మీద రు. లక్షన్నర సంపాదిస్తున్నారు. మామూలుగా డ్రాగన్ పళ్ళ సాగులో రైతులకు నెలకు రెండు సార్లు కాపు వస్తుంటే, సేంద్రియ పద్ధతిలో పండించటంవలన రేమాబాయికి నెలకు మూడుసార్లు కాపు వస్తోంది. సాధారణంగా డ్రాగన్ పళ్ళు మే నుంచి నవంబర్ దాకా కాస్తాయి. కానీ రేమాబాయి అనుసరించే సాగు పద్ధతులవలన కాపు మార్చిలో మొదలయ్యి, డిసెంబర్ దాకా వస్తోంది. ఎరుపు, పసుపు రకాల డ్రాగన్ పళ్ళను పండిస్తున్న రేమాబాయి, అవి కాకుండా దాదాపు 100 రకాల అరుదైన విదేశీ పళ్ళను కూడా పండిస్తున్నారు. భూటాన్ మామిడిపళ్ళు, పాకిస్తాన్ మల్బరీలు, సపోటా పళ్ళ సాగు చేస్తున్నారు. కుండీలలో పనసపళ్ళ సాగు కూడా చేస్తున్నారు. ఆమె వేసే సొంత ఎరువుతో 300-400 పనసపళ్ళు కాస్తున్నాయి. పళ్ళతోటల సాగు ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే రేమాబాయి సాధించిన అనేక ఘనతలు చూసి ఎన్నో సంస్థలు అవార్డులు ఇచ్చి సత్కరించాయి.

ఈ పళ్ళచెట్ల సాగు పుణ్యమా అని ఆమెకు సమయం చక్కగా గడిచిపోతోంది. మరోవైపు, జేసీస్ వరల్డ్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఆమె నడుపుతున్నారు. డ్రాగన్ పళ్ళ సాగులో తన అనుభవాలను ఆ ఛానెల్ ద్వారా పంచుకుంటున్నారు. తనకు 58 ఏళ్ళయినా, ఇరవై ఏళ్ళే అన్నట్లుగా ఉంటుందని, ప్రతిరోజూ డాబాపై 200 నుంచి 300 పువ్వులు పూస్తుంటాయని, వాటిని చూడగానే తనకు కలిగే దిగులు, భయం వంటి నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ తొలగిపోతాయని రేమాబాయి చెప్పారు.

వ్యవసాయం నష్టం కాదని ఆమె అన్నారు. పంటలను బాగా ఆలోచించి ఎంచుకోవాలని చెప్పారు. సేంద్రియ పద్ధతులను అనుసరించాలని, తద్వారా ఖర్చు తగ్గుతుందని, పర్యావరణానికి మంచి జరుగుతుందని అన్నారు.

Tags:    

Similar News