ప్రియాంక ప్రత్యర్థి నవ్య హైదరాబాద్‌ కనెక్షన్!

ఈ ఎన్నికలో ప్రియాంకపై నవ్య గెలవటం అంటూ జరిగితే జెయింట్ కిల్లర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది, జాతీయ నాయకురాలు అయ్యే అవకాశం కూడా ఉందనటంలో సందేహంలేదు.

Update: 2024-10-25 12:00 GMT

రాహుల్ గాంధి రాజీనామాతో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో ప్రియాంక గాంధి అనే జెయింట్ లీడర్‌పై బీజేపీ నవ్య హరిదాస్ అనే ఛోటా నాయకురాలిని దించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ నవ్య హరిదాస్‌కు మన హైదరాబాద్ కనెక్షన్ ఉందని తెలియవచ్చింది.

రాహుల్ ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి అనే రెండు లోక్‌సభ స్థానాలనుంచి విజయం సాధించటంతో, ఒకదానిని వదులుకోవలసి వచ్చింది. వయనాడ్ స్థానానికి 2019నుంచి 2024 దాకా ప్రాతినిధ్యం వహించి ఉండటంతో, ఆ స్థానాన్ని తన చెల్లికే ఇస్తానని ముందే చెప్పారు. అలాగే ప్రియాంకను వయనాడ్‌లో అభ్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్, గాంధి-నెహ్రూ వారసత్వం, స్థానికంగా ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రియాంకకు కలిసొచ్చే అంశాలు.

39 ఏళ్ళ నవ్య హరిదాస్ యాదృచ్ఛికంగా రాజకీయ నాయకురాలుగా మారిన గృహిణి. ఆమె కేరళలోని కోళిక్కోడ్(క్యాలికట్) ప్రాంతానికి చెందినవారు. ఆమె కుటుంబానికి సంఘ్ పరివార్‌తో సుదీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. స్థానిక ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ చదివిన తర్వాత హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో హైదరాబాద్‌లో రెండున్నర ఏళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. 2009లో వివాహమైన తర్వాత భర్త ఉద్యోగరీత్యా సింగపూర్ వెళ్ళిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. 2015లో సెలవులకోసం చిన్న ట్రిప్‌పై కోళిక్కోడ్ వస్తే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌ పదవికి బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆమె ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించటమే కాకుండా, తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచి అదే పదవిలో కొనసాగారు. నిజానికి 2015లో ఎన్నికల్లో ఓడిపోతే సింగపూర్ తిరిగి వెళ్ళిపోవాలన్నది తన ప్లాన్ అని నవ్య చెప్పారు. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీవారు నవ్యను కోళిక్కోడ్ సౌత్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయినా, అక్కడ బీజేపీ ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచగలిగారు.

ప్రియాంక గాంధి వయనాడ్‌తోనే మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాంటి హై ప్రొఫైల్ లీడర్‌ను ఎదుర్కోవటం ఎలా ఉంది అని అడిగితే, ప్రియాంక ప్రొఫైల్‌ను తాను పట్టించుకోనని చెప్పారు. నెహ్రూ కుటుంబంతో సంబంధాల వలనే ఆమెకు ఆమోదం లభిస్తోందని అన్నారు. రాహుల్ గాంధి వయనాడ్ ప్రజలకు ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు. వయనాడ్‌కు సేవ చేస్తాడని గెలిపిస్తే, కేవలం తన చెల్లికోసం వదిలేసి వెళ్ళిపోయాడని అన్నారు. వయనాడ్‌ను రాజకీయాలలో తమ కుటుంబ ప్రాబల్యం పెంచుకోవటంకోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వయనాడ్ ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించే నేత కావాలని అన్నారు. తనకున్న విద్యార్హతలు, కోళిక్కోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా తనకు ఉన్న గుర్తింపు ఈ ఉపఎన్నికలో ఉపయోగపడతాయని చెప్పారు.

వయనాడ్‌లో వ్యవసాయ, వైద్య రంగాలలో పలు సమస్యలు ఉన్నాయని, తాను గెలిస్తే ఈ రంగాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ఏడాది జులై 30న కొండచరియలు విరిగిపడి తీవ్ర ప్రాణనష్టం జరిగిన ఘటనతో ఈ ప్రాంతం వాతావరణ పరంగా ఎంత సున్నితమో తెలిసిందని అన్నారు. ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేవని చెప్పారు. క్రూరమృగాల వలన రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నవ్య అన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధిపై నవ్య గెలవటం అంటూ జరిగితే జెయింట్ కిల్లర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది, జాతీయ నాయకురాలు అయ్యే అవకాశం కూడా ఉందనటంలో ఎలాంటి సందేహంలేదు.

Tags:    

Similar News