బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో న్యూట్రెండ్..కొత్తగా ఖుర్బానీ సేవలు
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ కోసం హైదరాబాద్ ముస్లింలు సమాయత్తమయ్యారు.ఈ పండుగ కోసం ఈ ఏడాది కొత్తగా ఖుర్బానీ సేవలు ప్రారంభమయ్యాయి.
By : The Federal
Update: 2024-06-13 01:29 GMT
రమజాన్ తర్వాత ఇస్లామిక్ క్యాలెండర్‌లో వచ్చే ముఖ్యమైన నెల. బక్రీద్ లేదా ఈదుల్ జుహా అనేది మనిషి త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ.
- కొడుకునే బలిచ్చేందుకు సిద్ధమైన ఇబ్రహీం భక్తికి,త్యాగానికి గుర్తుగా ఆ సంప్రదాయా న్ని స్మరిస్తూ ఆయన గౌరవార్థ్ధం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను జూన్ 17వతేదీన జరుపుకుంటారు.
- త్యాగనిరతితోపాటు మనోవాంఛ,స్వార్థం,అసూయ,రాగద్వేషాలను విడిచిపెట్టి మానవత్వంతో వ్యవహరించే గొప్పనీతి ఈ పండుగలో దాగి ఉంది. ప్రపంచానికి దానగుణాన్ని,దయాగుణాన్ని చాటి చెప్పడంలో ఉన్న ఆనందాన్ని బక్రీద్ తెలియజేస్తుంది.
- ప్రాణత్యాగానికైనా వెనుకాడనని చెప్పటమే ఖుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు చెపుతుంటారు.ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు పంచి మరో భాగం తన కుటుంబానికి ఉంచుకుంటారు.
- బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాత నగరంలో ఏ కూడలిలో చూసినా పొట్టేళ్లు, మేకపోతుల విక్రయ కేంద్రాలు కనిపిస్తుంటాయి.
ఈ ఏడాది కొత్తగా...
బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ కోసం జంతువులను కొనుగోలు చేసే సంప్రదాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది కొత్తగా ఖుర్బానీ సేవలు ఆరంభించారు.ఖుర్బానీ కోసం జంతువుల కొనుగోలు నుంచి దాన్ని వధించడం, మాంసాన్ని శుభ్రం చేసి డోర్ డెలివరీ చేయడం వరకు ఖుర్బానీ సేవలు అందిస్తున్నారు. ఈ వినూత్న సౌలభ్యం కారణంగా హైదరాబాదీల నుంచి ఖర్బానీ సేవలకు ప్రజాదరణ లభిస్తోంది.
వినూత్నఖుర్బానీ సేవలు
బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకపోతులకు డిమాండ్ పెరిగింది. ఖుర్జానీ కోసం జంతువులను కొనడం నుంచి దాన్ని వధించే వరకు పలు పనులుంటాయి.ఖుర్బానీ సందర్భంగా కసాయిలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో బక్రీద్ సందర్భంగా అధిక డిమాండ్ ఉన్న కసాయి కోసం వెతకడానికి ఇబ్బంది లేకుండా ఖుర్బానీ సేవల ద్వారా బక్రీద్ పండుగను పూర్తిగా ఆస్వాదించవచ్చని హైదరాబాదీ అబ్దుల్ బారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఖుర్బానీ సేవలపై హైదరాబాదీల ఆసక్తి
జంతువులను వధించినపుడు జంతువ్యర్థాలను పారవేయాలి. దీంతోపాటు ఖుర్బానీ చేసిన ప్రదేశంలో పరిశుభ్రత ముఖ్యం. దీనివల్ల అపార్ట్ మెంట్ వాసులు ఖుర్బానీ సేవలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నగరానికి చెందిన షేక్ అలీం చెప్పారు. ఖుర్బానీ సేవల్లో ఉన్న సౌలభ్యం కారణంగా ఎక్కువమంది ఈ సేవలను ఎంచుకుంటున్నారని అలీం పేర్కొన్నారు.
బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు
బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 17వతేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఖుర్బానీ కోసం స్థలాల గుర్తించడం సవాలుగా మారిన నేపథ్యంలో అపార్ట్‌మెంట్లలో నివసించే వారు ఖుర్బానీ సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖుర్బానీ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో హైదరాబాద్‌లోని పలు సంస్థలు, వ్యాపారులు బక్రీద్‌కు ముందు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఖుర్భానీ మాంసం డోర్ డెలివరీ
ఖుర్బానీ సేవల ప్రొవైడర్లు జంతువులను కొనుగోలు చేయడం నుంచి వాటిని వధించడం, కస్టమర్ల ఇంటి గుమ్మాల వద్దకు మాంసాన్ని డెలివరీ చేయడం వరకు అన్ని సేవలను కవర్ చేసే సమగ్ర ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. వినియోగదారులు మొత్తం సర్వీస్‌కు ఏకమొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
అక్రమ జంతు వధను అరికట్టండి : తెలంగాణ హైకోర్టు
బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా జంతు వధను అరికట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గౌ జ్ఞాన్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విషయాన్ని నొక్కి చెప్పింది.జంతువుల రవాణా,వధకు సంబంధించిన చట్టాలను సక్రమంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలనిగౌ జ్ఞాన్ ఫౌండేషన్ హైకోర్టు పిటిషన్‌లో కోరింది.
జంతుబలి చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు
జంతుబలి చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ముస్లింలకు సూచించింది.బక్రీద్ సందర్భంగా జంతుబలి చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ముస్లింలను కోరుతూ ఒక సలహా జారీ చేసింది.ఇతర వర్గాల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ ఇస్లామిక్ సెంటర్ ఈ సలహా ఇచ్చింది. చట్టపరమైన ఆంక్షలు లేని జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని ఇస్లామిక్ సెంటర్ పేర్కొంది.
పెరిగిన గొర్రెలు,మేకల ధరలు
బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 17వతేదీన ముస్లింలు ఖర్భానీ చేయనున్న నేపథ్యంలో గొర్రెలు, మేకల ధరలు పెరిగాయి. ఈదుల్ అదా ప్రార్థనల అనంతరం పొట్టెళ్లు, మేకపోతులు, ఆవులు, ఒంటెలను ఖుర్బానీ చేస్తారు. హైరరాబాద్ పాత నగరంలో పలు చోట్ల గొర్రెలు, మేకల విక్రయ కేంద్రాలు వెలిశాయి.