తగ్గిపోయిన నోట్ల వాడకం, గణనీయంగా పెరిగిన యూపీఐ లావాదేవీలు!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ - యూపీఐ అనేది భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ఏర్పాటు చేసిన ఒక పేమెంట్స్ వ్యవస్థ.

Update: 2024-10-11 08:21 GMT

కరోనా వ్యాధి ఉన్నట్టుండి ప్రపంచంపై దాడిచేసి అనేకమంది ప్రాణాలను కబళించిన మాట నిజమేగానీ, దానివలన కొన్ని ప్రయోజనాలు కూడా ఒనగూరాయి. ఆరోగ్యంపై మునుపెన్నడూ లేనంతగా అవగాహన పెరగటం, శారీరక వ్యాయామంపై దృష్టి సారించటం మొదలైనవి వాటిలో కొన్ని. వీటితో పాటు కరోనా తర్వాత మన దైనందిన జీవితంలో చోటుచేసుకున్న మరో ముఖ్యమైన మార్పు… డిజిటల్ లావాదేవీలు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చొరబడలేదుగానీ, పట్టణ, నగర ప్రాంతాలలో అత్యధికశాతం ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. నగరప్రాంతాలలో ఇవాళ, రేపు కరెన్సీ నోట్ల వాడకం బాగా తగ్గిపోయింది. రోడ్డుపక్కన పూలు, కూరగాయలు అమ్మేవారు, ఆటోవాళ్ళు కూడా యూపీఐ ద్వారా డబ్బును తీసుకుంటున్నారు.

యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)లలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ యాప్‌లు ముందంజలో ఉన్నాయి.

2024లో మొదటి అర్థసంవత్సరపు లెక్కలు చూస్తే, యూపీఐ లావాదేవీలు 52 శాతం పెరగగా, వీటిలో ఫోన్ పే యాప్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం యూపీఐ లావాదేవీలలో ఫోన్ పే ద్వారా అత్యధికంగా 49.28 శాతం జరిగాయి. తర్వాతి స్థానంలో 37.45 శాతంతో గూగుల్ పే, 8.11 శాతంతో పేటీఎమ్ ఉన్నాయి. ఈ మూడు యాప్‌ల మార్కెట్ షేర్ కలిసి 92.21 ఉంది. ఈ యాప్‌లలో గూగుల్ పే అనేది గూగుల్ సంస్థది కాగా, ఫోన్ పే యాప్ ఫ్లిప్ కార్డ్ యాజమాన్యానికి చెందినది. ఇది ఇప్పుడు వాల్‌మార్ట్ అధీనంలో ఉంది. పేటీఎమ్ యాప్ యజమాని పేరు విజయ్ శేఖర్ శర్మ.

డెబిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు 2024 మొదటి అర్థ సంవత్సరంలో చూస్తే, 33 శాతం తగ్గాయి. ఇదే సమయంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 32 శాతం పెరగటం గమనార్హం. క్రెడిట్ కార్డుల జారీలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటాక్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు 71 శాతం క్రెడిట్ కార్డులు జారీచేయగా, ప్రభుత్వరంగ బ్యాంకులు 24 శాతం జారీ చేశాయి.

ప్రస్తుతం యూపీఐల ద్వారా గరిష్ఠంగా లావాదేవీలు జరపటానికి పరిమితి సాధారణ అవసరాలకోసం రు.1 లక్ష, కొన్ని ప్రత్యేక అవసరాలకోసం రు.2 లక్షలుగా ఉండగా, ఇటీవలే దానిని రు.5 లక్షలకు పెంచారు. ఈ కొత్త పరిమితి రు. 5 లక్షలను పన్ను చెల్లింపులు, ఆసుపత్రి చెల్లింపులు, విద్యాసంస్థలకు చెల్లింపులకు మాత్రమే వాడుకోవాలి. మరోవైపు స్మార్ట్ ఫోన్‌ల ద్వారా మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఆర్థిక లావాదేవీలు జరుపుకోవటానికి యూపీఐ లైట్, యూపీఐ 123 పే అనే యాప్‌లు ఉన్నాయి. వాటిలో పరిమితిని కూడా ఇటీవల పెంచారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ - యూపీఐ అనేది భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకోసం ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ఏర్పాటు చేసిన ఒక పేమెంట్స్ వ్యవస్థ.

Tags:    

Similar News