పూజ ఖేడ్కర్ పెద్ద ఫ్రాడ్: నిర్ధారించిన యూపీఎస్‌సీ, కేసు నమోదు

ఆమె తప్పుడు సర్టిఫికెట్‌లు, తప్పుడు సమాచారం సమర్పించిందని, తద్వారా అనుమతించిన పరిమితికంటే ఎక్కువ పర్యాయాలు పరీక్ష రాసిందని యూపీఎస్‌సీ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది.

Update: 2024-07-19 10:55 GMT

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ మోసకారిగా నిర్ధారణ అయింది. యూపీఎస్‌సీ పరీక్షకోసం ఆమె తప్పుడు సర్టిఫికెట్‌లు, తప్పుడు సమాచారం సమర్పించిందని, తద్వారా అనుమతించిన పరిమితికంటే ఎక్కువ పర్యాయాలు పరీక్ష రాసిందని యూపీఎస్‌సీ ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపింది. 2022వ సంవత్సరపు యూపీఎస్‌సీ పరీక్షలో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయటం, భవిష్యత్తులో తిరిగి ఈ పరీక్షలలో హాజరుకాకుండా నిషేధించటంపై ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు వెల్లడించింది.

పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 821వ ర్యాంక్ సాధించారు. ఆమె తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారి. ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. పూజ ప్రొబేషన్ కాలంలో పూణె జిల్లలో అసిస్టెంట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. అయితే శిక్షణ సమయంలోనే ఆమె పలు తప్పుడు కారణాలవలన వార్తలలో వ్యక్తిగా నిలిచారు. పూణె జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా చేసేటప్పుడు ఆమె వ్యవహారశైలి, డిమాండ్లు వివాదాస్పదమయ్యాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆమెను పూణె నుంచి వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు.

మరోవైపు పూజ తల్లి మనోరమ ఒక భూవివాదంలో కొందరిని తుపాకితో బెదిరించటంతో ఆమెను పూణె పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హజరుపరిచారు. ఆమెకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.

Tags:    

Similar News