ప్రత్యేక హోదాను ఏపీ కాకుండా ఎన్ని రాష్ట్రాలు కోరుతున్నాయో తెలుసా?

తెలుగుదేశం, జేడీయూ స్పెషల్ స్టేటస్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గడ్, హర్యానా రాష్ట్రాలు కూడా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరుతున్నాయి.

Update: 2024-06-28 08:06 GMT

మోది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సన్నాహాలు చేస్తుండగా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకహోదా డిమాండ్‌తో సర్కారుపై ఒత్తిడి తేవటానికి సిద్ధమవుతున్నాయి.

ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలయిన తెలుగుదేశం, జేడీయూ ఇప్పటికే తమకు స్పెషల్ ప్యాకేజ్ వస్తుందని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గడ్, హర్యానా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరుతున్నాయి.

క్యూలో కేరళ, తమిళనాడు కూడా

ఇవి చాలదన్నట్లు, బీజేపీ అధికారంలో లేని తమిళనాడు, కేరళ కూడా తమకు స్పెషల్ ప్యాకేజ్ కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాలన్ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ రాష్ట్ర అభివృద్ధికోసం రు.24,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు.

కేరళకు కేటాయించే నిధులలో బాగా కోత పడిందని, నిధుల కొరత వలన అభివృద్ధి కుంటుపడుతుందని బాలగోపాల్ ది ఫెడరల్‌తో చెప్పారు. అందుకే తాము రు.24,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా

ఇప్పుడు కేంద్రం ముందున్న పెద్ద సవాల్, అధికార కూటమిలో ఉన్న కీలక భాగస్వాములు తెలుగుదేశం, జేడీయూలను సంతృప్తిపరచటమే కాదు, ఇటీవలే మొదటిసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒదిశా, ఛత్తీస్‌గడ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరుతున్నాయి.

ఛత్తీస్‌గడ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, తమ రాష్ట్ర కొత్త రాజధానిగా నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌ను అభివృద్ధి చేయాలని తమ సర్కార్ ప్రయత్నిస్తోందని చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన గ్రీన్ సిటీగా చేయాలని చూస్తున్నామని అన్నారు. తమ వద్ద వనరులు తక్కువ ఉన్నప్పటికీ కొత్త రాజధానిలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, గృహకల్పన వంటి అనేక ప్రాజెక్టులను మొదలుపెడుతున్నామని చెప్పారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) తరహాలో ఆధునిక పట్టణ సౌకర్యాలన్నీ ఉండేలా నిర్మిస్తున్న కొత్త రాజధానికి నిధులను కేటాయించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చౌదరి వెల్లడించారు.

ఎన్నికల ఎత్తు

నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండటంతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలకోసం కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలంటూ రాగం ఎత్తుకుంది. హర్యానాలో పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తే వరుసగా మూడోసారి కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని పార్టీ సీనియర్ నాయకులు ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని పది స్థానాల్లో ఐదు గెలుచుకోవటం అక్కడ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మిగలటంతో కేంద్రంనుంచి స్పెషల్ ప్యాకేజ్‌పై గానీ, ప్రత్యేక ఆర్థిక సాయంపైగానీ ప్రకటన వస్తే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో అది బాగా సాయపడుతుందని స్థానిక కమలనాథులు అంటున్నారు.

అయితే, హర్యానా అభివృద్ధికి కేంద్రాన్ని ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరటం ఒక సానుకూల చర్యే అయినా కూడా అసెంబ్లీ ఎన్నికలు కేవలం నాలుగు నెలల్లోనే ఉండటంతో కేంద్రం అలాంటి ప్రకటన చేసినా అది ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అషుతోష్ కుమార్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే హర్యానా ప్రభుత్వం అదనపు నిధుల డిమాండ్‌ను తీసుకొస్తోందని అన్నారు. అయితే ఎన్నికలు నాలుగు నెలల్లోనే ఉన్నందున, ఒకవేళ అలాంటి ప్రకటనను కేంద్రం చేసినా కూడా దాని ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు.

స్పెషల్ ప్యాకేజ్ రాజకీయాలు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్త రాజధానిని నిర్మిస్తూ, దానికోసం కేంద్రాన్ని నిధులు కోరుతున్నది ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఒక్కటే కాదు.

చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త రాజధాని అమరావతి నిర్మాణం అనే మెగా ప్రాజెక్ట్‌ను భుజాలకెత్తుకుంది. స్పెషల్ ప్యాకేజ్ డిమాండ్ చేయకపోయినా, కొత్త రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంనుంచి మద్దతు ఆశిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

టీడీపీ ప్రభుత్వంలాగే, బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వంకూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం చిరకాలంగా చేస్తున్న డిమాండ్‌ను పునరుద్ధరించాలని చూస్తున్నారు.

ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ అనేవి జేడీయూ చేస్తున్న కొత్త డిమాండ్‌లు కాదని, తాము ఎంతో కాలంగా వాటిని కోరుతున్నామని జేడీయూ సీనియర్ నాయకుడు మహాబలి సింగ్ ది ఫెడరల్‌కు చెప్పారు. కేంద్రంతో చర్చల సమయంలో ఈ డిమాండ్‌లను మళ్ళీ ప్రభుత్వం ముందు ఉంచామని తెలిపారు.

Tags:    

Similar News