మల్లారెడ్డి భూ బాగోతం ఏమిటి?ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న వివాదం

‘‘సైకిలుపై పాలమ్మినా...పూలు అమ్మినా...కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చాను’’ అంటూ చెప్పే తెలంగాణ మాజీమంత్రి మల్లారెడ్డి తాజాగా మరో భూవివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-05-20 08:18 GMT
తన భూమిలో ఫెన్సింగ్ వేశారంటూ పోలీసు అధికారితో మల్లారెడ్డి వాగ్వాదం

ప్రభుత్వ కార్యక్రమమైనా, సినిమా ఫంక్షన్‌ అయినా.. వేదిక ఏదైనా మల్లారెడ్డి మైక్‌ పట్టుకున్నారంటే చాలు.. ‘‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. సక్సెస్‌ అయ్యా’’అనే డైలాగ్‌ వినపడుతోంది. ఇలా తన మాటలతో ఎప్పుడూ సోషల్​ మీడియా ట్రెండింగ్​లో నిలిచే మంత్రి మల్లారెడ్డి తాజాగా భూవివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు.

- హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82,83లో ఉన్న భూమి విషయంలో వివాదం రాజుకుంది. తన భూమిలో ఫెన్సింగ్ వేసి కబ్జా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తన అల్లుడైన ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, ఇతర అనుచరులతో కలిసి వచ్చి వీరంగం సృష్టించారు. తన స్థలంలో వేసిన ఫెన్సింగ్ ను తొలగించాలని అనుచరులను మల్లారెడ్డి ఆదేశించారు. కోర్టు వివాదంలో ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.

పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం
తన భూమిలో ఇతరులు ఫెన్సింగ్ వేస్తుంటే ఎలా ఊరుకున్నారని మల్లారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ‘‘నాపై కేసు పెడితే పెట్టుకోండి, కానీ నా స్థలాన్ని కాపాడుకుంటాను’’అని ఆయన చెప్పారు. పోలీసుల సమక్షంలోనే తన అనుచరులతో ఫెన్సింగ్ ను కూల్చివేయించారు. ఇంతలో ఈ భూమి తమదేనంటూ 15 మంది ఆ స్థలం వద్దకు వచ్చారు.

అసలు వివాదం ఏమిటి?
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న భూమి గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య వివాదం రాజుకుంది. తాము 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని తాము కొన్నామని 15 మంది పోలీసులకు చెప్పారు. కాగా రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది చెబుతున్నారు. కోర్టు కూడా ఈ భూమి తమదేనని అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు చెప్పారు. మల్లారెడ్డి, మరో 15 మంది వాదనలను విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.

14 ఏళ్లుగా రాజుకున్న భూవివాదం
సర్వేనంబరు 82,83లో ఉన్న 2.20 ఎకరాల భూమిని 14 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేశామని మల్లారెడ్డి చెబుతున్నారు. కాగా 2015లో ప్రస్థుత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితోపాటు 9 మంది 3,900 పై చిలుకు చదరపు గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన చెప్పారు. భూమి గురించి గతంలో వారు తన వద్దకు వచ్చారని చెప్పారు. తాము ఆ భూమిని శ్రీనివాసరెడ్డికి 2021లో విక్రయించామని చెప్పారు. ఈ భూమిపై 2016లో హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందన్నారు. గతంలో సర్వే కోరగా తనకు అవసరం లేదని మల్లారెడ్డి చెప్పారని అడ్లూరి ఆరోపించారు.

సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి : ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ కుమార్
మల్లారెడ్డి భూములపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ కుమార్ డిమాండ్ చేశారు. 2015లో మదన్ మోహన్ అనే వ్యక్తి 4 ఎకరాల సుధామణ కొనుగోలు చేశారని, ఆయన వద్ద నుంచి 4వేల గజాలను తాను, మరో 8 మంది కలిసి కొన్నామని ఆయన చెప్పారు.

మల్లారెడ్డి చెప్పే మాటలన్నీ బోగస్ ...ఎమ్మెల్యే అడ్లూరి వ్యాఖ్యలు
సుచిత్రలోని సర్వే నంబర్ 82/ఈఈలో రెండు ఎకరాల 35 గుంటల భూమి పట్టాపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో ఈ వివాదం నెలకొంది.అదే స్థలంలో 600 చదరపు గజాల స్థలంలో కొంత భాగాన్ని ఉప్పల్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాస్‌రెడ్డితో కలిసి తాను కొనుగోలు చేశానని, దీనిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. నిషేధ ఉత్తర్వులకు ఎలాంటి కౌంటర్ లేదని, జిల్లా కలెక్టరేట్ రికార్డుల ఆధారంగా 2021వసంవత్సరంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి భూమిలో కొంత భాగాన్ని విక్రయించారని ఆయన చెప్పారు. మల్లారెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తమను వేధించాడని ఆయన ఆరోపించారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, మల్లారెడ్డి చెప్పినవన్నీ బోగస్ అని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

ఏరోనాటికల్ కాలేజీలో కూల్చివేతలు
గతంలో దుండిగల్‌లోని మల్లారెడ్డి ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే అక్రమ రహదారిని కూల్చివేశారు. అప్పుడు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే రెండు పర్యాయాలు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలవలేకపోయారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి తాను ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని కాంగ్రెస్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇరువర్గాలపై పోలీసు కేసులు
ఈ భూవివాదంలో ఇరువర్గాలపై వాగ్వాదం, దౌర్జన్యం వంటి పలు కేసులు నమోదు చేశామని పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్పారు. ఆదివారం దేవాదాయ శాఖ ద్వారా భూమి సర్వే చేపట్టామని పేట్‌బషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. విజయవర్ధన్‌ తెలిపారు. శనివారం మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులతో ఆ స్థలంలోకి చొరబడి తాత్కాలికంగా ఫెన్సింగ్ లాగేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు శేరి శ్రీనివాసరెడ్డిపై కూడా కేసు పెట్టామని పోలీసులు చెప్పారు.

నా భూమి కబ్జాకు కాంగ్రెస్ నేతల యత్నిస్తున్నారు : మల్లారెడ్డి ఆరోపణ
తన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాగానే తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుచిత్ర వద్ద ఉన్న 2 ఎకరాల 20గుంటల భూమిలో దౌర్జన్యంగా చొరబడి కాంగ్రెస్ పార్టీ విప్ లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ భూమిలో దౌర్జన్యంగా చొరబడి పాగా వేస్తే,పోలీస్ యంత్రాంగం సైతం వన్ సైడ్ ప్రోటెక్షన్ కల్పించడం దౌర్జన్యమని మల్లారెడ్డి చెబుతున్నారు.

మల్లారెడ్డి సవాలు
అధికార కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముంటే తాను భూములు ఆక్రమించుకున్నట్లు నిరూపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి సవాలు విసిరారు. తన వద్ద ఉన్న భూ పత్రాలు నకిలీవని తేలితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద ఉన్న పత్రాలు నకిలీవని మల్లారెడ్డి ఆరోపించారు. కాగా తమ భూమిని తాము అమ్ముకున్నామని అడ్లూరి చెప్పారు.

సుచిత్ర స్థలంలో రెవెన్యూ అధికారుల సర్వే
సుచిత్ర వద్ద ఉన్న వివాదాస్పద భూమిలో పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు ఆదివారం సర్వే చేశారు.ఇరువర్గాల సమక్షంలో అధికారులు సరిహద్దులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే ఏరియాలో 82, 83 సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. హద్దులు ఏర్పాటు చేసి, సర్వే రిపోర్టులు సిద్ధం చేసే పనిలో రెవెన్యూ అధికారులున్నారు.

అందరి దృష్టి సర్వే నివేదికపైనే...
భూములు ఎవరివో తేల్చేందుకు భూసర్వే నివేదికను సిద్ధం చేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సర్వే నివేదిక సోమవారం లేదా మంగళవారం వస్తుందని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారి చెప్పారు. సర్వే నివేదిక వచ్చే వరకు అందరూ వేచి ఉండాలని మల్లారెడ్డి కోరారు. ‘‘ఈ భూ వివాదంపై తాను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రెవెన్యూశాఖ మంత్రిని, కలెక్టర్‌ని కలుస్తాను. నా దగ్గర ఉన్న ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్లను వారికి చూపిస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News