తెలంగాణలో అక్రమార్కులపై చర్యలేవి? విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలా
తెలంగాణలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు.పదేళ్లలో అక్రమార్కులపై 1230 నివేదికలను విజిలెన్స్ సమర్పించినా వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బుట్టదాఖలా చేసింది.
By : Saleem Shaik
Update: 2024-05-24 05:26 GMT
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అధికారులపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విభాగం విచారణ జరిపి 1230 నివేదికలను ప్రభుత్వానికి సమర్పించినా వాటిపై అప్పటి కేసీఆర్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమార్కులపై చర్యలు తీసుకోక పోవడంపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
- 2014 నుంచి 2024వ సంవత్సరం వరకు గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో అధికారుల అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 1230 నివేదికలను రాష్ట్రప్రభుత్వానికి పంపించింది. దీంతోపాటు 768 విశ్లేషణ నివేదికలు, 1215 అలర్ట్ నోట్ లు, 123 సిస్టమ్ ఇంప్రూవ్ మెంట్ నివేదికలను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
విజిలెన్స్ సమాచారంతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమాచారం కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద ఈ ఏడాది మార్చి 30వతేదీన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి లేఖ రాసింది. దీంతో విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ మే 7వతేదీన విజిలెన్స్ నివేదికలపై సమాచారాన్ని పంపించారు. 2014 నుంచి 2024వ సంవత్సరం వరకు పదేళ్లలో విజిలెన్స్ సమర్పించిన నివేదికలను అందించారు.
పదేళ్లలో సంవత్సరాల వారీగా విజిలెన్స్ నివేదికలు
2014 నుంచి 2024వ సంవత్సరం వరకు పదేళ్లలో విజిలెన్స్ విభాగం మొత్తం వివిధ ప్రభుత్వ శాఖలపై 1215 విచారణ నివేదికలను పంపించింది. 2014వ సంవత్సరంలో 175 నివేదికలను విజిలెన్స్ సర్కారుకు పంపించింది. 2015లో 229, 2016లో 75, 2017లో 82, 2018లో 72, 2019లో 90, 2020లో 55, 2021లో 23, 2022లో 246 2023లో 156, 2024లో 12 నివేదికలను విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలపై విజిలెన్స్ సమర్పించిన నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖల అధిపతులు చర్యలు తీసుకోవాల్సి ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విజిలెన్స్ నివేదికల ప్రకారం అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, వ్యవస్థలో లోపాలను నివారించడం, పరిపాలనలో సంస్కరణలు తీసుకోవడం ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల అధిపతులు చేయాలని ఆయన పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో అక్రమాలు జరగవని ఆయన చెప్పారు.
కేంద్ర లోక్‌పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు పంపించాలి : మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు
తెలంగాణలో విజిలెన్స్ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే వాటిని కేంద్ర లోక్‌పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు పంపించాలని మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అక్రమాలపై వివిధ శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలి. కానీ తప్పు చేసిన వారే వాటిపై ఎలా చర్యలు తీసుకుంటారని శ్రీనివాసులు ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు తమపై చర్యలు లేకుండా చూసుకుంటారని, కానీ సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారిపైనే చర్యలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమాల్లో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం
తెలంగాణలో విజిలెన్స్ విచారణలో వెలుగుచూసిన అక్రమాల్లో రెవెన్యూశాఖ అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్లలో రెవెన్యూశాఖలో అక్రమాలపై 232 నివేదికలను విజిలెన్స్ సర్కారుకు పంపించింది. అక్రమాల్లో రెండోస్థానం తెలంగాణ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖది. మున్సిపల్ శాఖలో 189 విజిలెన్స్ నివేదికలున్నాయి. అక్రమాల్లో తెలంగాణ లేబర్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ మూడో స్థానంలో ఉంది. ఈ శాఖకు చెందిన 183 విజిలెన్స్ నివేదికలున్నాయి. విజిలెన్స్ విభాగం బయటపెట్టిన అవినీతిలో వాణిజ్యపన్నుల శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇరిగేషన్, వ్యవసాయశాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, హోంశాఖ, ఉన్నత విద్యాశాఖ, గిరిజనసంక్షేమ శాఖలున్నాయి.
సిస్టమ్ ఇంప్రూవ్ మెంట్ నోట్స్
తెలంగాణలోని పలు ప్రభుత్వ విభాగాల్లో 2014 నుంచి 2024 వసంవత్సరం వరకు 123 అలర్ట్ నోట్స్ ను విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అలర్ట్ నోట్స్ ను విజిలెన్స్ విభాగం సర్కారుకు పంపించినా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పదేళ్లలో విజిలెన్స్ వివిధ శాఖలపై 768 అప్రైజల్ రిపోర్టులు పంపినా అవి కూడా బుట్టదాఖలా అయ్యాయని సమాచార హక్కు చట్టం కింద విజిలెన్స్ విభాగం సహాయ కార్యదర్శి పంపిన సమాచారంలో వెల్లడైంది. తెలంగాణలో 35 ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు జరగకుండా ముందుజాగ్రత్తగా విజిలెన్స్ విభాగం 1215 అలర్ట్ నోట్స్ పంపినా వాటిపై కూడా సర్కారు ప్రేక్షక పాత్ర వహించింది.
విజిలెన్స్ నివేదికలపై చర్యలేవి?
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు పక్కా అధారాలతో విశ్లేషణ, విచారణ జరిపి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినా, వాటిపై చర్యలు తీసుకోవడంలో గత బీఆర్ఎస్ సర్కారు విఫలమైంది. అక్రమాలపై వచ్చిన విజిలెన్స్ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోగా, సంబంధిత శాఖల అధిపతులకు పంపించి సర్కారు చేతులు దులుపుకుంది. విజిలెన్స్ అలర్ట్ నోట్ పై కూడా సర్కారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ అధికారుల అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తూ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవినీతికి పాల్పడిన వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు తమ శాఖల్లోని అక్రమాలపై ఎలా చర్యలు తీసుకుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ, ప్రముఖ విద్యావేత్త ‘ఫెడరల్ తెలంగాణ’తో వ్యాఖ్యానించారు. అందుకే విజిలెన్స్ నివేదికలను బుట్టదాఖలా చేశారని ఆయన ఆరోపించారు.
గవర్నరుకు లేఖ రాసినా...
విజిలెన్స్ నివేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర గవర్నరుకు లేఖలు రాసినా అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ నివేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2019 మే 9వతేదీన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. అయినా దీనిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో విజిలెన్స్ నివేదికలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2020 ఆగస్టు 31వతేదీన సాక్షాత్తూ రాష్ట్ర గవర్నరుకు లేఖ రాసినా దీనిపై కూడా ఎలాంటి కదలిక లేదు. అంటే అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోక పోవడంతో ప్రభుత్వంలో అక్రమాలు పెరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ప్రభుత్వ శాఖల్లో పెరిగిన లంచాల బాగోతం
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలా చేయడంతో తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లంచాల బాగోతాలు పెరిగాయి. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అక్రమాల పర్వంతో సామాన్యులు సతమతమవుతున్నారు. హెచ్ఎండీఏలో భూముల విలువలను బట్టి లంచాలకు రేటు కట్టారంటే అక్రమాల బాగోతం ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో వెలుగుచూసింది.
అవినీతిని అరికట్టేందుకే విజిలెన్స్ నివేదికలు
అవినీతిని అరికట్టేందుకే విజిలెన్స్ నివేదికలు ఉపయోగపడనున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ నిఘా వేసి విచారణ జరిపి, నివేదికలను రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా అధికారులు తీసుకునే నిర్ణయాలపై, జరగబోయే అక్రమాలపై కూడా విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ నిఘా వేసి ముందుగా ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ పాలనలో మెరుగునకు కూడా డీజీ సూచనలు చేస్తుంటారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఐపీఎస్ అధికారి అయిన డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. డీజీతోపాటు ఇద్దరు డైరెక్టర్లు, 76 మంది ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు. అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటైన ఈ విజిలెన్స్ విభాగానికి ఏటా ప్రభుత్వం రూ.15కోట్లు వెచ్చిస్తోంది.
విజిలెన్స్ నివేదికలపై చర్యకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి : విజిలెన్స్ విభాగం మాజీ డీజీ అప్పారావు
విజిలెన్స్ నివేదికలపై చర్య తీసుకోవాలంటే ఆ విభాగానికి అనుబంధంగా పనిచేసేలా ప్రత్యేకంగా ఓ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని విజిలెన్స్ విభాగం మాజీ డీజీ అప్పారావు చెప్పారు. తాను విజిలెన్స్ డీజీగా పనిచేసినపుడు ప్రత్యేకంగా పోలీసుస్టేషన్ ను విజిలెన్స్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసి, అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని అప్పారావు గుర్తు చేశారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోండి : సోమ శ్రీనివాసరెడ్డి
గత పదేళ్లుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమర్పించిన నివేదికలను తొక్కిపట్టి ఉంచిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరింది. గత పదేళ్ల విజిలెన్స్ నివేదికలను వెలికితీసి వాటిలో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేలా చీఫ్ సెక్రటరీని ఆదేశించాలని సీఎంకు విన్నవించింది. ఈ మేర తాము సీఎంకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పెండింగ్ కేసుల వివరాలతో లేఖ రాశామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సీఎంకు రాసిన లేఖల కాపీలను తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారికి, జీఏడీ ప్రిన్నిపల్ సెక్రటరీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు, విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీలకు పంపించామని శ్రీనివాసరెడ్డి వివరించారు.