పాత్రలు మారినా సభ రంజుగానే సాగింది

ఒకరు అందెశ్రీ కవిత తో ప్రారంభించి దాశరథితో ముగిస్తే మరొకరు అలిశెట్టి ప్రభాకర్ తో మొదలు పెట్టి జయశంకర్ తో ముగించారు. ఎవ్వరూ ఎవ్వరికీ తీసిపోలేదు.

Update: 2023-12-16 15:55 GMT
తెలంగాణ అసెంబ్లీ చిత్రం (ఫైల్)

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్టుగా అసెంబ్లీలో పాత్రలు మారినా చక్కగా ఒదిగిపోయారు వారిద్దరూ. నిన్నటి దాకా ప్రతిపక్షంలో ఉన్నోళ్లు ఇవాళ కుడిపక్కకు వచ్చారు. అధికార పక్షంలో ఉన్నవాళ్లు ఎడమ పక్కకు వచ్చారు. అందరిదీ ఉద్యమ నేపథ్యమే కావడం వల్లనో ఏమో కొటేషన్లు కూడా అతికినట్టు చెప్పుకొచ్చారు. ఒకరు అందెశ్రీ కవిత ‘ఏమిరా.. ఏమిరా తెలంగాణ’తో ప్రారంభించి దాశరథితో ముగిస్తే మరొకరు అలిశెట్టి ప్రభాకర్ తో మొదలు పెట్టి జయశంకర్ తో ముగించారు. ఎవ్వరూ ఎవ్వరికీ తీసిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాతీయ ధృక్పదం వల్లనే ఏమో ఇవాళ అధికార పక్షం ఉన్నోళ్లు విపక్షం పట్ల కటువుగా ఉండడానికి కాస్తంత జంకారు. కేటీఆర్, హరీశ్ లాంటి వాళ్లు విదేశీయులు, సోనియా గాంధీ నేషనాలిటీ, జవహర్ లా నెహ్రూ, ఇందిర వంటి ప్రస్తావనలు తెచ్చినప్పుడు సైతం ఖరాఖండిగా చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగానీ సీనియర్ నాయకుడు దామోదరం రాజనరసింహ గాని జంకేరనే అనిపించింది. అధికార పక్షంలో ఉండడం, అంతకు ముందు విపక్షంలో ఉండడం, మాండలికంపై పట్టుండడంతో కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాళ్లు అవలీలగా మాటలు మాట్లాడగలిగారు. వీళ్లకు ధీటుగా జవాబు చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతడొక్కడు రేవంత్ రెడ్డి మాత్రమేనని చెప్పాలి. ఆ తర్వాత చెప్పాల్సి వస్తే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

రేవంత్ ప్రసంగం ఎలా మొదలైందంటే...


గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి రేవంత్ సుమారు గంటన్నర పాటు జవాబు ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలే చేశారు. “గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి.. కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని” రేవంత్ రెడ్డి చెప్పడం కలకలం సృష్టించింది. “ఫాంహౌస్‌లో పండిన ధాన్యాన్ని ప్రైవేట్ కంపెనీల మెడపై కత్తిపెట్టి కొనిపించారు” అంటూ రైతులపై కేసీఆర్ కు ప్రేమ లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రైతు పంట బీమా అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కాదని సీఎం రేవంత్ అన్నప్పుడు కేటీఆర్ గట్టిగానే తిరగబడ్డారు. పంటల బీమాకు రైతు బీమాకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా విభేదించారు.

నోరు విప్పే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకూ లేదు...

కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్‌లో కూడా సీఎంతో మాట్లాడే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉండేది కాదని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ పూర్వ చరిత్రనంతా తిరగదోడారు. జవహర్ లాల్ నెహ్రూ మొదలు ఇటలీ అమ్మ సోనియమ్మ దాకా.. ప్రస్తావించారు. దీంతో సభలో పెద్ద రగడే జరిగింది. స్పీకర్ పదేపదే మందలిస్తున్నా హరీశ్ రావ్ అనాలనుకున్న నాలుగు మాటలనేశారు.

అబద్ధాలు చెబుతున్నారంటూ రేవంత్ మండిపాటు..

4 కోట్ల తెలంగాణ ప్రజలను ప్రజాభవన్‌లోకి అనుమతించామని రేవంత్ గుర్తుచేశారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో లేదని.. ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. సీఎం ప్రసంగానికి BRS ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సర్దిచెప్పారు.

‘ఏమిరా.. ఏమిరా తెలంగాణ’ అంటూ

మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గానే సాగాయి. ‘ఏమిరా.. ఏమిరా తెలంగాణ’ అంటూ కేసీఆర్‌ పోకడలను ఉద్దేశించి అందెశ్రీ రాసిన కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈటల, గద్దర్‌ను ప్రగతిభవన్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సభలో BRS సభ్యుల తీరు సరిగా లేదని.. కాంగ్రెస్‌కు ఇంత పెద్ద అవకాశం ప్రజలు కల్పించారని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా అంటూ కేటీఆర్‌పై రేవంత్‌ విమర్శలు చేశారు. అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ కనీస గౌరవం ఇచ్చిందా అని.. ఉద్యమాల పార్టీ.. ధర్నా చౌక్‌ను ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని, తాము ప్రజా సేవకులమే గాని పాలకులం కాదు, కాబోమంటూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కొత్త ఎమ్మెల్యేలను బాగానే ప్రభావితం చేశాయనే చెప్పాలి.

Tags:    

Similar News