ముఖ్యమంత్రి రేవంత్ తొలి సంతకం దేని మీద...
రేవంత్ ప్రమాణానికి ముస్తాబవుతున్న ఎల్ బి స్టేడియం
రేతెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం మధ్యాహ్నాం 1.04 గంటలకు జరుగుతుంది. మొదట 10.28 గంటకు అని నిర్ణయించినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేందుకు అది అనువుగా లేదని మధ్యాహ్నానికి మార్చినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రులుగా ఇతర మంత్రివర్గమంతా పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలిసింది. రేవంత్ తొలినుంచి డిసెంబర్ 9న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా జన్మదినం నాడు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెబుతూ వచ్చారు. దానికి ప్రజలంతా రావాలని కూడా ఆహ్వానించారు. అయితే, సోనియా గాంధీ జన్మదినాన కాకుండా రెండు రోజుల ముందే మంచి ముహూర్తం ఉన్నందున ఏడో తేదీన ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నది. రాజకీయఅనిశ్చిత పరిస్థితుల ఏమాత్రం ఏర్పడకుండా జాప్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారని మరొక వాదన కూడా ఉంది.
ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పరిశీలించారు. .
తొలి సంతకం దేనిమీద: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే రేవంత్ రెడ్డి తొలిసంతకం దేనిమీద చేస్తారు అనేది ఇంకా తేలడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎపుడో ప్రకటించిన ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. అయితే వాటన్నింటి మీద సమిష్టి సంతకం చేస్తారా లేక విడివిడిగా చేస్తారా అనేది తెలియదు. విడివిడిగా చేయాల్సి వస్తే మహిళలకు అర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే ఫైల్ మీద తొలిసంతకం, తర్వాత ధరణి పోర్టల్ ను రద్ద చేస్తూ రెండో సంతకం చేయవచ్చని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు.