హైదరాబాద్ జూపార్కులో 125 ఏళ్ల వయసున్న అరుదైన తాబేలు మృతి

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 125 ఏళ్ల వయసున్న తాబేలు మృతి చెందింది. 71 ఏళ్లుగా సందర్శకులకు కనువిందు చేసిన ఈ తాబేలు మృతికి జూ సిబ్బంది సంతాపం తెలిపారు.

Update: 2024-03-16 14:00 GMT
Galapagos Giant Tortoise (Photo Credit : ZOO)

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో 125 ఏళ్ల వయసున్న తాబేలు శనివారం మృతి చెందింది. ఈ అరుదైన తాబేలు 200 కిలోల కంటే అధిక బరువు ఉంది. ఈ పెద్ద తాబేలును 1963వ సంవత్సరంలో పబ్లిక్ గార్డెన్ నుంచి హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలకు తీసుకువచ్చారు. జూపార్కులో గత 71 సంవత్సరాలుగా సందర్శకులకు కనువిందు చేసిన తాబేలు మరణించిందని జూపార్కు క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ సునీల్ ఎస్ హీరిమత్ ‘ఫెడరల్ తెలంగాణ’ చెప్పారు.గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృతి పట్ల క్యూరేటర్ మరియు జూ సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ సైన్స్ కాలేజ్‌లోని పాథాలజీ విభాగంలో ఈ తాబేలుకు ప్రొఫెసర్, హెడ్ డా. డి. మాధురి, డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. స్వాతి, డిప్యూటీ డైరెక్టర్ (వెట్) డాక్టర్ ఎం. ఎ. హకీమ్ పోస్టుమార్టం నిర్వహించారు.


అంతరించిపోతున్న గాలాపాగోస్ జెయింట్ తాబేళ్లు
అరుదైన 125 ఏళ్ల వయసున్న తాబేలు గత పది రోజులుగా ఆహారం తీసుకోలేదని జూ పార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఎ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీంతో తాము ఈ తాబేలును పరిశీలనలో ఉంచామని, అయితే పలు అవయవాలు పనిచేయక పోవడం వల్ల అది మరణించిందని ఆయన పేర్కొన్నారు. ఈ అతి పెద్ద గాలాపాగోస్ జెయింట్ తాబేలు వృద్ధాప్య సమస్యలతో శనివారం తెల్లవారుజామున మరణించిందని చెప్పారు.ఈ తాబేలు కళేబరం, దాని నమూనాలను పరిశోధనల కోసం రాజేంద్రనగర్ లోని వెటర్నరీ కళాశాలకు పంపించామని జూ క్యూరేటర్ చెప్పారు.

ఈ మగ తాబేలు నెహ్రూ జంతుప్రదర్శన శాల ప్రారంభమైనప్పటి నుంచి సందర్శకులు, పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాలాపాగోస్ జెయింట్ టార్టాయిస్ అంతరించిపోతున్న జాతుల్లో ఒకటని జూ పార్కు వెటర్నీరీ డాక్టర్ చెప్పారు. ఈ జాతి తాబేళ్లు నెమ్మదిగా ప్రశాంత జీవితం గడుపుతాయని పశువైద్యులు చెప్పారు. అతి పెద్ద షెల్ తో ఉన్న ఈ తాబేలు గంటకు 0.3 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.


Tags:    

Similar News