పదేళ్ల తరువాత పవన్ ఇంటికి..
చంద్రబాబు మరొక నాయకుడి ఇంటికి వెళ్లడమే అరుదు, అందునా ఆదివారం రాత్రి. సుమారు గంటన్నరపాటు చర్చ.
Byline : G.P Venkateswarlu
Update: 2023-12-17 17:19 GMT
యువగళం పాదయాత్రకు పవన్ ముఖం చాటేశారని వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. నారా చంద్రబాబునాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ముఖం చాటేశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ అధినేత నేరుగా ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని కొణిదెల పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. పదేళ్ల తరువాత చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయన అలా వెళ్లాడో లేదో అప్పుడే రాజకీయ దుమారం చెలరేగింది.
‘‘రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఎవరి ఇంటికి ఎవరు ఎవళ్లినా చివరకు అక్కడే స్థిరపడతారు’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం రాత్రి పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో చర్చలు జరుపుతుండగా ట్వీట్ చేశారు. రాంబాబు చేసిన ట్వీట్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు.
అసలు ఇంతకూ ఆయన ఎందుకు వెళ్లినట్లు.. ఏమిటి?
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కింటికి నేరుగా వెళ్లడం పలువురిలో చర్చనియాంశమైంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు (Chandrababunaidu) ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) నివాసానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులు, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ట్విటర్(ఎక్స్)లో తెలిపింది. ఏపీలో తెలుగుదేశం, (TDP), జనసేన (Janasena) వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ మరి కొన్ని అంశాలు జోడించాలని ఇప్పటికే సూచించింది. మొత్తం 10 అంశాలతో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాల్ని జనసేన సూచించినట్టు సమాచారం. రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో.. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇప్పటికే తెదేపా చేపట్టిన కార్యక్రమం పేరులోనూ మార్పులు చేయనున్నట్టు సమాచారం. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల ఫొటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి ఇప్పటికే తీసుకెళ్లారు. వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం. అలాగే త్వరలోనే ఉమ్మడి వేదికపై రెండు పార్టీల ఉమ్మడి సభ నిర్వహించి జనం వద్దకు వెళ్లాలనే విషయంపై కూడా చర్చ సాగిందని సమాచారం.