ఆంధ్రా పోలీసుల వేధింపుల మీద త్రిసభ్య కమిటీ
పోలీసుల వేధింపుల గురించి నిర్భయంగా వెల్లడించేందుకు బాధితులు ధైర్యంగా ఎలాంటి అధికారిక హోదా లేని ఈ కమిటీ ముందుకు రాగలరా అనేదే ప్రశ్న
తెలంగాణాలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసినందుననే అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు: మాజీ డిజిపి భాస్కరరావు
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు చేస్తున్న వేధింపుల మీద విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటయింది.
ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా విమర్శించినా, హక్కుల గురించి గుర్తు చేసినా, నిరసన ప్రదర్శన జరిపినా సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తంచేసినా, ఒక అభిప్రాయాన్ని షేర్ చేసినా, ప్రశ్నించినా కొనసాగుతున్న వేధింపుల మీద విచారణ జరిపేందుకు పౌరసమాజం తరఫున ఇలా ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటుకావడం ఇదే మొదటి సారి.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు మీద రకరకాల విమర్శలు వస్తూండటంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
పౌరహక్కుల ఉద్యమాలు బాగా బలహీన పడిన సమయంలో ఈ కమిటీ ఏర్పాటు కావడం విశేషం. గతంలో పౌరహక్కుల సంఘాలు వామపక్ష భావజాలానికి సంబంధించినవి కావడంతో వాటిని పూర్తిగా అణచివేయడం జరిగింది.
ఒకపుడు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన పౌరహక్కుల కార్యకలాపాలు ఇపుడు బాగా స్తంభించి పోయాయి. దీనితో తెలుగు నాట ఒక చిన్న ప్రశ్నఎదురయినా ప్రభుత్వాలు భరించలేకపోతున్నాయి. ప్రశ్నించిన వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెలంగాణలో ఇటీవల వెలుగులోకి వచ్చిన బర్రెలక్క కేసు ఇలాంటిదే. రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో తాను బర్రెలు కాసుకుంటున్నానని ఒక వీడియో చేసినందుకు శిరీష అనే నిరుద్యోగి మీద అక్కడి పోలీసులు కేసులు పెట్టివేధించారు. రెండేళ్లుగా ఆమె కోర్టు చుట్టూతిరుగుతూనే ఉంది. తన పరిస్థితిని ప్రజలముందర పెట్టేందుకు ఆమె కోల్లాపూర్ నియోజకవర్గం నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.
ఇదే విధమయిన అణచివేత ఆంధ్రలో కూడా ఉందని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవలే ఉనికిలోకి వచ్చిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న అన్నిరకాల అణిచివేతల మీద దృష్టి సారించి ఒక నివేదిక రూపొందించేందుకు ఈ కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మాజీ డిజిపి ఎం. వి భాస్కరరావు పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏ.సత్య ప్రసాద్, ది హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు సభ్యులు.
బుధవారంనాడు విజయవాడలో బెంజ్ సర్కిల్ లోని ఒక హోటల్ సమావేశ మందిరంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రి సభ్య కమిటీ సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో అమరావతి రైతు ఉద్యమకారులు, సామాజిక హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు , వివిధ రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల నాయకులు, ముఖ్యంగా ప్రభుత్వ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో సామాన్య పౌరులపై , ప్రతిపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలపై , దళిత , మైనార్టీ , ప్రజలపై , మహిళలపై పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని , సెక్షన్ 30 ,144 వంటి వాటిని నిరవధికంగా కొనసాగిస్తున్నారని , అసభ్య పదజాలం ప్రయోగిస్తున్నారని , లాఠీలతో విరుచుకు పడుతున్నారని , అక్రమకేసులు బనాయిస్తున్నారని వీరంతా త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు.
సామాజిక మాధ్యమం ద్వారా ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు పోలీసు వేధింపులకు గురై, కేసులో ఇరుక్కున్న పూందోట రంగనాయకమ్మ తొలుత మాట్లాడుతూ ఆకేసు తర్వాత తన వ్యక్తిగత జీవితం దుర్భరం అయిపోయిందని , దాని నుండి తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒక అభిప్రాయం చెప్పడమే నేరంగా మారిపోవడం దారుణమని ఆమె అన్నారు.
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం పోరాడుతూ , పలు కేసుల్లో ఇరుక్కుపోయి కోర్టు వాయిదాలకు తిరుగుతున్న కంభంపాటి శిరీష , మార్త పావని, కొమ్మినేని వరలక్ష్మి , కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా పోలీసులతో తాము ఎదుర్కున్న వేధింపులను వివరించారు.
అమరావతి రైతు ఉద్యమ నేత గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ ఇప్పటికే రెండువేల మందిని కేసుల్లో పెట్టారని , ఇంకా ఎంతమందిని పెడతారో తెలియదని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ జిల్లాలలో ఈ త్రిసభ్య కమిటీ పర్యటించి పోలీసు వ్యవస్థ పనితీరును , పౌరులకు జరుగుతున్న అన్యాయాలను , అక్రమ కేసులను పరిశీలించి , సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తుంది.
పోలీసుల వ్యవహారశైలిపై , అక్రమకేసులు పెడుతున్న తీరుపై దృష్టి సారించాలని పలువురు కోరిన మీదట ఈ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని, ప్రజలపట్ల , రాజ్యంగంపట్ల నిబద్దత కలిగిన పెద్దలు సభులుగా ఉండేందుకు అంగీకరించారని , కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవాలను పరిశీలించి ఒక నేవిదిక ఇస్తుందని , దాన్ని తమ సంస్థ తరపున రాష్ట్ర గవర్నర్ కు అందజేస్తామని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్రాంత డిజిపి ఎం.వి. భాస్కరరావు మాట్లాడుతూ బాధితుల అనుభవాలు హృదయ విదారకంగా ఉన్నాయని , పాలకులు నియంతల మాదిరి తయారై , తమ ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థను ఒక పనిముట్టుగా వినియోగించు కుంటున్నారని భాస్కరరావు అన్నారు.
ఇది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితమైన ధోరణి కాదని , దేశమంతటా పౌరుల ప్రాథమిక హక్కుల పరిస్థితి ఇలాగే ఉందని , బీహారులో మద్య నిషేధం పేరుతో ఐదులక్షల మంది ప్రజల్ని కటకటాల వెనక్కి పెట్టారని , ప్రశ్నించే వారి నోరు నొక్కడానికి మద్య నిషేధ చట్టాన్ని అడ్డగోలుగా ప్రయోగిస్తున్నారని అన్నారు.
సీనియారిటీని పక్కన పెట్టి డిజిపిలను ఎంపికచేయడం , ప్రమోషన్ల, బదిలీల ప్రక్రియ రాజకీయ నేతల చేతుల్లో ఉండటం కూడా పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని భాస్కరరావు అభిప్రాయ పడ్డారు.
తెలంగాణాలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసినందుననే అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారని భాస్కరరావు అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా.ఎన్.తులసిరెడ్డి , సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు అక్కినేని వనజ , బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, డా.సమరం , డా.కే.ఎల్ రావు తనయుడు కే. విజయా రావు , సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ డా. దివాకరబాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర హక్కులను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చొరవను అభినందించారు. తమ వంతుగా సంస్థకు తోడ్పాటు ఇస్తామని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ , మైనార్టీ హక్కుల కార్యకర్త ముల్లా మహమ్మద్ హుసేన్ , కుల నిర్మూలనా పొరాటసమితి నాయకుడు కృష్ణ , హైకోర్టు న్యాయవాదులు నర్రా శ్రీనివాస్ , ఉమేష్ చంద్ర తదితరులు మాట్లాడారు.
కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ సహాయ కార్యదర్శి వి.లక్ష్మణ రెడ్డి, సి.ఎఫ్.డి. కార్యవర్గ సభ్యులు విజయవాడ పూర్వ మేయర్ డా. జంధ్యాల శంకర్ , నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ ప్రో .రంగయ్య , ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.