కవిత అన్ని పార్టీలకి మైనస్సేనా?
గతంలో ఒక మంత్రి పదవిలో కూడా లేని కవిత ఇప్పుడు పార్టీ పెట్టగలదా?;
తెలంగాణాలో కవితకు సంబంధించిన వార్తలు రోజుకొకటి చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ‘భౌగోళిక తెలంగాణా తప్ప సామాజిక తెలంగాణా ఇంకా రాలేదు’అన్న దగ్గర నుండి నేడు ‘సింగరేణి జాగృతి’స్థాపన వరకూ ఆమె రాజకీయంగా తనను తానూ గొప్ప నాయకురాలిగా నిరుపించుకోవాలన్న తపనతో అడుగులు వేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కవితకు నిజంగా ఒక స్వంత పార్టీ పెట్టి నడపగల జనాకర్షణ ఉందా? కవితను కేసిఆర్ కూతురుగా కాకుండా చూసి,ఆమెను ఆదరించే ఆస్కారం ఉందా?
ఉద్యమం కెసిఆర్ కి కలిసొచ్చింది. కానీ ఓ రకంగా చూస్తే అది కెసి ఆర్ వారసులకు మాత్రం అది అదృష్టంగా మారలేదు.తెలంగాణా అస్తిత్వ ఉద్యమంతో ముఖ్యమంత్రి అయ్యాడు కెసి ఆర్.కానీ ఆయన సంతానానికి ఆ నేపథ్యం లేదు. కెసిఆర్ అధికారంలో ఉన్న పదేళ్ళలో కెటిఆర్ మంత్రిగా చేసినా,ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలంగాణా ప్రజలు ఆయన్ని ఒక బలమైన రాజకీయ నాయకుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి పదవిలో కూడా లేని కవిత ఇప్పుడు పార్టీ పెట్టగలదా? ఇది ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో రాజుకుంటున్న ప్రశ్న. పోనీ తెలంగాణలో బిసి వాదం బలంగా ఉన్న ఈ సమయంలో ఏదో ఒక బిసి పార్టీకి సహకారం అందించి కింగ్ మేకర్ కాగలదా ?
ఈ విషయం గురించి సైకియాట్రిస్ట్ ,’తెలంగాణా మేధావుల సంఘం’అధ్యక్షుడు బి.కేశవులు ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడుతూ,
‘బిసిలు ఎవరినైనా నమ్ముతారు కానీ కల్వకుంట్ల కవితను మాత్రం నమ్మరు.సాధారణ వ్యక్తిగా ఉన్న ఆమెకు ఈ రోజు ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? ఆమె తన ఆస్తులను బహిరంగంగా ప్రకటించిబిసిలకి వాటిని ఇస్తేనే ఆమె నిజాయితీని బిసిలు కొంతవకు నమ్మవచ్చు. అది కూడా కేవలం 5 శాతం మంది మాత్రమే నమ్మొచ్చు.ఆమె బిసిల నమ్మకాన్ని గెలుచుకోవడం మాత్రం సాధ్యమయ్యే విషయంలా కనబడం లేదు.’
కవిత తండ్రికి లేఖ రాసింది. ఏ స్పందన లేదు.ఆమెను లిక్కర్ స్కాం తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ దూరంగా పెట్టింది.అది ఆమె అసంతృప్తికి ప్రధాన కారణం.ప్రత్యక్షంగానే తనను ఖైదు చేసిన బిజెపి గురించి ఎల్కతుర్తి సభలో తండ్రి పెద్దగా విభేదిస్తూ మాట్లాడకపోవడం పట్ల ఉన్న అసంతృప్తిని బయట పెట్టింది.బి ఆర్ ఎస్ పార్టీ, స్వయంగా తన తండ్రి పెట్టిన పార్టీ, తనను పట్టించుకోవడం లేదన్న ఆక్రోశం ఆమెలో కనిపిస్తుంది.పోనీ దీనికి ప్రతిచర్యగా కాంగ్రెస్ లేదా బిజెపితో కలుద్దామని అనుకున్నా,ఆమె వల్ల బి ఆర్ ఎస్ కి ఎలా మైనస్సో ,కాంగ్రెస్ కి అంతే. అలాగే ఇక స్వయంగా అరెస్ట్ చేసిన బిజెపి ఆమెను కలుపుకుని తన ఇమేజ్ ని నాశనం చేసుకోలేదు.ఇలా పొత్తుల పరంగా చూస్తే ఆమె అన్ని పార్టీలకు మైనస్సే. ఈ విషయం గురించి రాజకీయ విశ్లేషకులు కూరపాటి వెంకట నారాయణ ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడుతూ,
‘కవిత ఏం చేసినా స్వంత పార్టీని పెట్టే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక లోపాయికారీ రాజకీయం కూడా నడుస్తూ ఉండొచ్చు. కేసిఆర్ తన పార్టీలో ఉంటె ప్లస్ కాదు కనుక ఆమెను సొంత రాజకీయాల్లో ప్రయత్నం చేస్తే, కొంత అవకాశం ఉండొచ్చని సూచించి ఉండొచ్చు.లేక ఈ కోపం నిజమే అయినా, కొన్నాళ్ళకి ఆమె తండ్రితో సర్దుకుని రాజీ పడి బి ఆర్ ఎస్ లోనే ఎదో ఒక హోదాలో ఉండాలి.ఇంతకు మించిన ఆప్షన్ కవితకు ప్రస్తుత పరిస్థితుల్లో లేదు.’
అలాగే ఫెడరల్ తెలంగాణా అసిస్టెంట్ ఎడిటర్ కోపల్లె ఫణి కుమార్ మాట్లాడుతూ,
‘మైనస్ కేసిఆర్ జీరో కవిత. కెసిఆర్ కూతురుగా తప్ప స్వంత రాజకీయ ఉనికి,బలం కవితకు లేవు.అంతటి జనాకర్షణను సాధించగల శక్తి కూడా ఆమెకు లేదు.’
ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం మాట్లాడుతూ,
‘తమ వ్యూహాలు పని చేయనప్పుడు కౌంటర్ రాజకీయాలు రచించి అమలు చేయడం కేసీఆర్ లక్షణం. బహుశా కవిత ద్వారా లోపాయికారీగా ప్రారంభించినా ఆశ్చర్య పడ వలసిన అవసరం లేదు. కవిత ద్వారా తాము పోగొట్టుకున్న చోటే అధికారం పొందడానికి కవితను ఇప్పటికి పల్లెత్తు మాట్లాడని కెసిఆర్ అదే దేశీయ వెచ్చాలని రాజకీయ కల్వంలో వేసి నూరుతుంటాడు.ఆయన అవకాశాల కోసం పొంచి ఉన్న దెబ్బతిన్న పులిలా ఎదురుచూస్తుంటాడు.’
మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు సొంత రాజకీయాలు,పొత్తు రాజకీయాలు కూడా కలిసిరాని కాలం నడుస్తూ ఉంది. ఇక తండ్రితో రాజీ పడటం లేక బ్రతిమాలి,ఏదో ఒక హోదాలో కేసిఆర్ బిడ్డ ముద్రతో సాగడం తప్ప కవిత రాజకీయ భవిష్యత్తుకి ఇంకో మార్గం కనబడటం లేదు.
* * *