నా శిష్యురాలే.. కానీ పెద్ద అవినీతిపరురాలు..

చిత్రమేమిటంటే ఆమె రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావు కూడా రజనీపై ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమె అవినీతిని నిరూపిస్తానని సవాల్ విసిరారు.

Update: 2023-12-12 16:01 GMT
గురుశిష్యులు ప్రత్తిపాటి, విడదల రజనీ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి విడదల రజినిపై విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు. ఆమె చేసిన అవినీతి అంతా ఇంత కాదంటూ చెలరేగిపోయారు. ఇంతకాలం మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడెందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. చిత్రమేమిటంటే ఆమె రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావు కూడా విడదల రజనీపై ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమె రాజకీయ అవినీతిని నిరూపిస్తానని సవాల్ విసిరారు.

ఎవరీ రజనీ, ఏమా కథ...

తెలంగాణలో పుట్టి పెరిగి అమెరికాలో చదివి ఆంధ్రా కోడలుగా అడుగుపెట్టిన విడదల రజనీ వాస్తవానికి టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలంటారు. వీఆర్ ఫౌండేషన్ ను స్థాపించి సాంఘీక సేవా కార్యక్రమాలు చేపట్టిన రజనీ ఆ తర్వాత గురువును మించిన శిష్యురాలైయ్యారు. రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావును ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓడించి జగన్ మంత్రి వర్గంలో బెర్త్ సంపాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చడంతో రజనీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలే..

విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ టిక్కెట్ పై ఎమ్మెల్యే గా పోటీ చేసి పుల్లారావునే ఓడించారు. పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆమె అవినీతిని నిరూపిస్తా...

గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె చేసిన అవినీతి అంతా ఇంత కాదంటున్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆమె అవినీతి, దుర్మార్గాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నది మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభియోగం. మంత్రి దారుణంగా దోపిడీకి పాల్పడ్డారని, అవినీతి, భూముల కబ్జా, ఆక్రమణలు, బెదిరింపులతో డబ్బు దండుకున్నారని పుల్లారావు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేయడానికి తాను రెడీ అంటున్నారు ప్రత్తిపాటి. ఆమె నీతిమంతురాలైతే ప్రమాణానికి సిద్ధం కావాలని సవాల్ కూడా విసిరారు.

చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లదు..

`చెల్లని రూపాయి ఎక్కడికి వెళ్లినా చెల్లదు. సీటు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాలు చెరిగిపోవు. వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టినా వారికి ఘోర పరాభవం తప్పదు. అభ్యర్థులను మార్చినంత మాత్రానా జనం నమ్ముతారనుకోవడం భ్రమే‘ అని ప్రత్తిపాటి సాక్షాత్తు మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం. జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేరు. క్షమించలేరు’’ అని పుల్లారావు అంటుంటే ఇంకో అడుగుముందుకు వేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరి అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News