ముఖ్యంగా ఢిల్లీలోని నాలుగు ఎంపీ సీట్లను ఆప్ కు కేటాయించడం, మూడు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం పార్టీలోని చాలామంది నాయకులను నచ్చడం లేదు. " ఢిల్లీ అసెంబ్లీలో మాకు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు. ఎంపీ సీట్లను కూడా మేము గెలవకపోవచ్చు.
కానీ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ తరువాత రెండో స్థానంలో నిలిచాం. మా ఓటు బ్యాంకు భద్రంగా ఉంది." అని కాంగ్రెస్ పార్టీకీ చెందిన ఓ నాయకుడు, ఎంపీ ఫెడరల్ తో అన్నారు. చాలా సంవత్సరాల నుంచి బీజేపీకి ఆప్ ను బీ టీమ్ గా ప్రచారం చేశాం. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీని బీజేపీని గెలిపించడానికే ఇక్కడ పోటీకి దిగిందని కాంగ్రెస్ ప్రచారం చేసిన అంశాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆప్ తో పొత్తు పెట్టుకుంది. దీన్ని ఏమని ప్రచారం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆప్ రోజు బలపడుతూనే కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తోంది. నిజానికి ఢిల్లీలో 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను అంతం చేసిందే ఆప్. మొదట కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత టర్మ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. తాజాగా పంజాబ్ లో ను కాంగ్రెస్ పార్టీ పాలనను అంతం చేసింది కూడా ఆప్ అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాట.
తాజా ఒప్పందంలో భాగంగా ఆప్ కు హర్యానాలో ఒక సీటు లభించింది. అలాగే పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తాయి. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ కు భరూచ్, భావ్ నగర్ సీట్లను కేటాయించింది. అలాగే చంఢీగఢ్, గోవాలో ప్రకటించిన అభ్యర్థను చీపురు పార్టీ ఉపసంహరించుకుంటుంది.
దీంతో గోవాలోని రెండు ఎంపీ స్థానాల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ పోటీ చేయనుంది. అలాగే అస్సాంలోని మూడు స్థానాలను కూడా ఆప్ త్యాగం చేయనుంది. వాటిలో అభ్యర్థులను ప్రకటించిన డిభ్రూగఢ్, గువాహాటీ, సోనిట్పూర్ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ సీట్లను త్యాగం చేయడం, కొన్ని చోట్ల సీట్లను సాధించడం అనేది మాత్రం నిస్సందేహంగా ప్రతిపక్ష ఇండి కూటమిలో మిగిలిన పార్టీలను ఆనందంలో ముంచివేస్తుందని మాత్రం చెప్పవచ్చు.
అయితే గుజరాత్, హర్యానాలోని పొత్తులపై కూడా స్థానిక నాయకత్వం ఆనందంగా ఏం లేదు. హర్యానాలోని కురుక్షేత్ర సీటును ఆప్ కు కేటాయించడం పై మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడా విచారం వ్యక్తం చేశారు. అయితే పార్టీ నిర్ణయాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. పార్టీ హర్యానాలోని 10 స్థానాల్లో బలంగా ఉందని ఆయన చెబుతున్నారు.
మరోవైపు గుజరాత్ లోని భరూచ్ స్థానంపై అహ్మద్ పటేల్ వారసులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థానం పై తమకు పట్టుందని అయితే.. ఆప్ కేటాయించడం ఏంటని వారి వాదనగా ఉంది. ముఖ్యంగా కుమారుడు ఫైసల్ పటేల్, కూతురు మంతాజ్ పటేల్ " తమ తండ్రి చివరిసారిగా 1984 లో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. కావునా ఈ సీట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి" అని పట్టుబడుతున్నారు.
ఓటర్లు అంగీకరిస్తారా?
ఏదైన కూటమి ప్రజా అంగీకారం పొందితేనే విజయ సాధించినట్లు అవుతుంది. కూటమి కట్టాక ఓట్ల షేరింగ్ అత్యంత ముఖ్యం. అందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయం ముఖ్యం. ముఖ్యంగా ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రారంభించబడింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఆప్ ను తమ శత్రువు గానే చూశారు.
అలా వేరుగా ఉన్న ఓట్లను కలిపి ఓటు వేయించగలారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కాంగ్రెస్ పార్టీపై అనేక అవినీతి ఆరోపణలను గుప్పించింది కూడా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీనే. కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపుతామని మొదట్లో ఢిల్లీ ఓటర్ల దగ్గరికి వెళ్లింది కేజ్రీవాల్ అని కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఫెడరల్ తో అన్నారు. నేడు అదే పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు కచ్చితంగా దెబ్బతీస్తుందని సదరు ఎంపీ ఆవేదనచెందారు.
బీజేపీ ఆరోపణాస్త్రాలు
కాంగ్రెస్, ఆప్ పొత్తు పై బీజేపీ విమర్శలు గుప్పించింది. కేంద్రమంత్రి హర్దీప్ పూరీతో సహ ఆ పార్టీకి చెందిన పలువురు మాట్లాడుతూ.. పంజాబ్ లో ప్రత్యర్థులుగా పోటీ చేస్తారట. కానీ హర్యానా, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాలలో మిత్రులుగా పోటీ పడతారంట అంటూ ఎద్దేవా చేసింది.
ఇది ఎలాంటి అవకాశవాద రాజకీయాలో గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. మరోవైపు అహ్మద్ పటేల్ కు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గౌరవం ఇదే నా అంటూ కొత్తరాగం అందుకుంది. తనకు చెందిన భరూచ్ స్థానం ఆప్ కు కేటాయించడం ఆయన చేసిన సేవలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గిఫ్ట్ అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
ఇండి కూటమిలోని చాలా పార్టీలు కాంగ్రెస్ అవలంభిస్తున్న విధానాలతో అంత సంతృప్తికరంగా లేవు. ముఖ్యంగా తమపై కాంగ్రెస్ పార్టీ పెత్తనం చేస్తూ.. ఎక్కువ సంఖ్యలో సీట్లను పొందడానికి ఎత్తులు వేస్తోందని వారు ఆరోపించారు. అయితే మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
దాంతో దాని వైఖరిలో మార్పు వచ్చినట్లు తాజా కుదిరిన పొత్తుతో తేటతేల్లమైంది. మధ్య ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఒక సీటు వదిలివేయడం, బెంగాల్ లో సీట్ల సంఖ్యను తగ్గించుకుని మమతా బెనర్జీ దగ్గరకు వెళ్లడం, ఆప్ తో పొత్తు ఇవన్నీ దాని బిగ్ బ్రదర్ వైఖరిని వీడినట్లే కనిపిస్తోంది. అయితే సుదూర భవిష్యత్ లో ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారవచ్చు.