ఉద్దానం కిడ్నీ బాధితులకు ఊరట

ఉద్దానికి ఉత్తరాంద్ర కేరళ అని పేరు. అక్కడ ప్రజలని తరతరాలుగా కిడ్నీ జబ్బులు పీడిస్తున్నాయి. చివరకు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి ఊరట కల్గిస్తున్నారు. ఆయనేం చేశారు?

Update: 2023-12-14 04:46 GMT
కిడ్ని సెంటర్, ఉద్దానం

శ్రీకాకుళం జిల్లా.. ఉద్దానం.. రాష్ట్రంలో అత్యధిక మూత్రపిండాల వ్యాధులతో అల్లాడుతున్న ప్రాంతం. దేశదేశాల వాళ్లు వచ్చి పరిశీలించారు. పరిశోధించారు. ఆమధ్య జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్దానంపై పెద్ద రీసెర్చే చేశారు. సమస్యను దేశ ప్రజల దృష్టికి తెచ్చారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ ఉద్దానం బాధితులకు ఊరట చేకూర్చారు. జల ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఉద్దానం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారు.

ఈ రెండు ప్రాజెక్టులే కీలకం..

కిడ్నీ రోగాల బారి నుంచి ఉద్దానం ప్రాంతాన్ని రక్షించే మహత్తర పథకం డిసెంబర్‌ 14న అంటే గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. కిడ్నీ వ్యాధులకు నీటి కాలుష్యమే కారణమని భావిస్తున్నారు. స్వచ్ఛ జల ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభంతో కిడ్నీ బాధితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

దశాబ్దాల కల ఇది...

ఉద్దానం వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసుల కోసం తలపెట్టిన రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో వైఎస్సార్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. జల జీవన్ మిషన్ నిధులు- సుమారు 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పథకాన్ని నిర్మించారు. దీంతో ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది.

వంశధార నుంచి నీళ్లు...



ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. హిరమండలం వంశధార రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతానికి నీరు చేరుతుంది. మూత్ర పిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని ఈ ప్రాజెక్ట్‌ అందిస్తుంది. మొత్తం ఆరు లక్షల 78 వేల మందికి, మరో ముప్పైయ్యేళ్ళ తరవాత కూడా 8 లక్షల మంది జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌...

పలాస పట్టణంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది కష్టాలకు చెక్ పెట్టే విధంగా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. దీనికి డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పెట్టారు. 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఆసుపత్రిని నిర్మించారు. ఈ పరిశోధనా కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. 54 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం, 20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి మొత్తం 74 కోట్లతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రం స్థాపించారు.

ఉద్దానం కోలుకో..

సుదీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు ఈ రెండు ప్రాజెక్టులు పెద్ద ఊరటనే చెప్పాలి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు ఇకనైనా చెక్‌ పెట్టగలిగితే ఈ ప్రాజెక్టుల ప్రయోజనం నెరవేరినట్టని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత పేరాడ పరమేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలన్నది పరమేశ్వరరావు అభిప్రాయం. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడాన్ని తప్పుబట్టిన ఆయన ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందన్నారు. విమర్శలు ఎలా ఉన్నా తాగునీరు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటును ప్రజలు హర్షిస్తున్నారు.

Tags:    

Similar News