‘మహారాష్ట్ర పప్పు’గా ముద్ర వేసుకోవద్దు
ఓటరు లిస్టులో వ్యత్యాసాలను ఎత్తిచూపిన శివసేన (యుబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే నుద్దేశించి కౌంటర్ ఇచ్చిన సీఎం ఫడ్నవీస్..
మహారాష్ట్ర(Maharashtra)లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (అక్టోబర్ 27) శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే.. ముంబైలోని వర్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు జాబితాలో పేర్లు, ఫొటోలు, అడ్రస్, తదితర వివరాలు సరిగా లేవని ఎత్తిచూపారు. ముసాయిదా ఓటరు లిస్టు ప్రచురితమయ్యాక, ఆ వివరాలను ప్రతి వార్డుకు వెళ్లి ఓటర్ల వివరాలతో క్రాస్ చెక్ చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
ఆదిత్య ఠాక్రే(Aditya Thackeray) వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) స్పందించారు. ఠాక్రే ప్రెజెంటేషన్‌ను ఎగతాళి చేస్తూ..ఆయన "మహారాష్ట్ర పప్పు"కాకూడదని ఆకాంక్షిస్తున్నానని కౌంటర్ ఇచ్చారు.
"నాకు ఆదిత్య తెలుసు. అతను 'పప్పుగిరి' చేస్తాడని నేను ఊహించలేదు. నిన్నటి అతని ప్రజెంటేషన్ రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన దానికి ప్రతిరూపం. ప్రతిపక్షాలు చేస్తున్నదంతా కవర్ ఫైరింగ్ మాత్రమే. ఓటమి తప్పదని, ప్రజలు తమతో లేరని వారికి తెలుసు." అని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది.
వరద సాయంపై మంత్రివర్గం సమీక్ష..
దీపావళికి ముందు వరద ప్రభావిత రైతుల కోసం ప్రకటించిన రూ.31,628 కోట్ల ఆర్థిక సాయం ప్యాకేజీని మంత్రివర్గం సమీక్షించిందని ఫడ్నవీస్ తెలిపారు. ఇప్పటివరకు 40 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.8వేల కోట్లు జమ అయ్యాయని, పక్షం రోజుల్లో రైతులకు పంపిణీ చేయడానికి అదనంగా రూ.11వేల కోట్లు విడుదల చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు.
రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.21వేల కోట్లు నేరుగా బదిలీ అయ్యిందని, అందులో రూ.8వేల కోట్లు పంపిణీ చేశామని, మంగళవారం రూ.11వేల కోట్లు మంజూరయ్యాయని ఫడ్నవీస్ విలేఖరులకు వివరించారు. అదనంగా రూ.1,500 కోట్లు విడిగా విడుదల చేస్తామని చెప్పారు.
'రైతులకు కనీస మద్దతు ధర’
రైతులు తమ ఉత్పత్తులను సేకరించే ముందు సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. "వ్యాపారులు కనీస మద్దతు ధర (MSP) ఇస్తే.. వారు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవచ్చు. అలాకాకుండా, రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే.. MSP నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది" అని చెప్పారు.
షోలాపూర్-తుల్జాపూర్-ధారశివ్ రైల్వే లైన్ సవరించిన రూ.3,295 కోట్ల వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.