‘డీప్ ఫేక్’ కు విరుగుడు ‘సేఫ్ వర్డ్’ అని చెప్పిన సజ్జనార్

హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు వీసీ సజ్జనార్(Hyderabad CP VC Sajjanar) ఒక విరుగుడు చెప్పారు

Update: 2025-10-28 13:23 GMT
Hyderabad CP VC Sajjanar

సైబర్ మోసాలు వెయ్యిరకాలు. వీటిల్లో అధునాతన టెక్నిక్ ఏమిటంటే డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్. సైబర్ మోసగాళ్ళు డీప్ ఫేక్(Deep fake) లేదా వాయిస్ క్లోనింగ్(Voice Cloning) టెక్నిక్ ను ఉపయోగించి మోసాలు చేయటం చాలా ఎక్కువైపోయింది. దీనికి హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు వీసీ సజ్జనార్(Hyderabad CP VC Sajjanar) ఒక విరుగుడు చెప్పారు. నిజానికి సజ్జనార్ చెప్పింది కొత్త టెక్నిక్ ఏమీకాదు కాని కమీషనర్ హోదాలో పోలీసు శాఖ తరపున చెబుతున్నారు కాబట్టి బాగా ప్రాధాన్యత వచ్చింది. ఇంతకీ సజ్జనార్ చెప్పింది ఏమిటంటే డీప్ ఫేక్ కు విరుగుడు సేఫ్ వర్డ్ అని.

మామూలుగా సైబర్ మోసగాళ్ళు చేసేది ఏమిటంటే కుటుంబంలో ఎవరి పేరుతోనో పెద్దవాళ్ళలో ఒకరికి ఫోన్ వస్తుంది. అర్జంటుగా డబ్బులు కావాలని వెంటనే తన ఖాతాకు డబ్బులు పంపమని తొందరపెడతారు. ఉదాహరణకు తల్లి, దండ్రులకు పిల్లలు మాట్లాడుతున్నట్లుగా లేదా భార్యా, భర్తల్లో ఒకరికి మరొకరు ఫోన్ చేసి తాము పలానా అవసరంలో ఉన్నాను కాబట్టి అర్జంటుగా డబ్బులు పంపమని అడుగుతారు. ఎంత తొందరపెడతారంటే రెండోవాళ్ళు ఆలోచించుకునేంత సమయం కూడా ఇవ్వకుండా బాగా టెన్షన్లో పెట్టేస్తారు. అవతల వాళ్ళు ఎంత అవసరంలో ఉన్నారో అన్న ఆందోళనతో ఇవతలవాళ్ళు అడిగినంత డబ్బులు పంపించేస్తారు. తమ ఫోన్ చెడిపోయింది కాబట్టే ఫ్రెండ్ ఫోన్ నుండి చేస్తున్నట్లు మోసగాళ్ళు నమ్మబలుకుతారు. కాబట్టి అనుమానం లేకుండా పెద్దలు డబ్బులు పంపించేస్తారు.

కాసేపయిన తర్వాత పిల్లలకు పెద్దవాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అందాయా అనో లేకపోతే పలానా అవసరం తీరిందా అనో అడిగినపుడు పిల్లలు ఆశ్చర్యపోతారు. తాము ఎప్పుడు ఫోన్ చేసి డబ్బులడిగామని ఎదురు ప్రశ్నిస్తారు. దాంతో తాము మోసపోయామని అవతలివాళ్ళు గ్రహిస్తారు. అయితే అప్పటికే పుణ్యకాలం గడిచిపోవటంతో ఏమిచేయాలో పెద్దవాళ్ళకు దిక్కుతోచదు. దాంతో లబోదిబోమంటు పోలీసుస్టేషన్ కు వచ్చి ఫిర్యాదుచేస్తారు.

దీనికే సజ్జనార్ విరుగుడు చెప్పారు. ఆవిరుగుడు ఏమిటంటే కుటుంబసభ్యుల్లో ఎవరినుండైనా మిగిలిన వాళ్ళకు అర్జంటుగా డబ్బుపంపమని ఫోన్ వస్తే విషయం అంతా విన్న తర్వాత సదరు ఫోన్ కాల్ ను కట్ చేయమని చెప్పారు. తమకు ఎవరి పేరుతో అయితే ఫోన్ వచ్చిందో వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి నిజంగానే డబ్బులు అవసరం కోసం ఫోన్ చేసింది వాళ్ళేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని చెప్పారు. అలా నిర్ధారించుకున్నపుడు తమకు వచ్చిన ఫోన్ నిజమైనదా లేకపోతే సైబర్ మోసగాళ్ళదా అన్నవిషయం తేలిపోతుందన్నారు. డబ్బులడుగుతు కుటుంబసభ్యుల్లో ఎవరినుండి ఎవరికి ఫోన్ వచ్చినా కంగారుపడకుండా కాస్త ఆలోచించాలన్నారు.

ఇదికాకపోతే డబ్బుల ట్రాన్సాక్షన్ చేసుకునేటపుడు కుటుంబసభ్యులు తమ మధ్య ఒక పాస్ వర్డ్ ను పెట్టుకోవాలని సూచించారు. ఎవరి నుండి ఎవరికి ఫోన్ వచ్చినా ముందుగా సదరు పాస్ వర్డ్ చెప్పేట్లుగా నిబంధన పెట్టుకుంటే అదే సేఫ్ వర్డ్ లాగ సైబర్ మాసగాళ్ళనుండి రక్షిస్తుందని సజ్జనార్ చెప్పారు. ఇలాంటి టెక్నిక్ ల వల్ల డీప్ ఫేక్ లేదా వాయిస్ క్లోనింగ్ మోసాలనుండి తప్పించుకోవచ్చని కమీషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.

Tags:    

Similar News