వైసీపీకి బిగ్ షాక్! అనుంగు అనుచరుడు ఆర్కే గుడ్ బై

సార్వత్రిక ఎన్నికలు పట్టుమని నాలుగు నెలలు కూడా లేవు. ఇప్పటికి 151 మందిలో ఐదు వికెట్లు పడ్డాయి. ఆరోది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలేం జరుగుతోంది వైసీపీలో..

By :  A.Amaraiah
Update: 2023-12-11 14:10 GMT
రాజీనామా పత్రాన్ని శాసనసభా కార్యదర్శికి అందజేస్తున్న ఆళ్ల

మొన్నఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇవాళ గుంటూరులో ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రేపు విశాఖలో తిప్పల నాగిరెడ్డి.. ఎవరు వీళ్లందరు, ఏమిటీ వీళ్ల తీరు.. వైసీపీలో ముసలం పుట్టిందనడానికి సంకేతాలా! అవుననే సందేహమే చాలా మందిలో వ్యక్తమవుతున్నా వైసీపీ నాయకత్వం మాత్రం వీటిని తేలిగ్గానే కొట్టిపారేస్తోంది. పార్టీ నాయకత్వం నోరు మెదకపోయినా లోలోన రగులుతున్న అసమ్మతికి ఇవన్నీ సూచనలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సార్వత్రిక ఎన్నికలు పట్టుమని నాలుగు నెలలు కూడా లేవు. ఇప్పటికి 151 మందిలో ఐదు వికెట్లు పడ్డాయి. ఆరోది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్న వేళ.. అధికార వైసీపీలో ఐదేళ్ల పాలన అంచుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. నిజానికి ఇవాళ వైఎస్సార్ సీపీకి తగిలింది గట్టి దెబ్బే. రాజీనామా చేసినాయన వల్ల ఏమవుతుందీ.. దానివల్ల పార్టీకి నష్టం ఎంత అనేది పక్కనబెడితే ఓ పెద్ద ఫిగర్ పార్టీ నుంచి తప్పుకున్నాడన్న చర్చ అయితే రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇప్పటి దాకా అణకువగా ఉన్నఎమ్మెల్యేలు రాజీనామాలంటూ గళాలెందుకు విప్పుతున్నారన్నది ప్రశ్న. పుట్టలోంచి వస్తున్న పాముల్లా బుసలు కొడుతున్నారన్నది జనం మదిని తొలుస్తున్న సందేహం.

బాలినేని తర్వాత ఆళ్ల...

‘మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవడం లేదని’ వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు చెప్పిన 24 గంటల్లోనే మరో ఎమ్మెల్యే షాకివ్వడం వైచిత్రి.

ఆళ్ల ఏమన్నారంటే...



Full View


‘‘ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ సీపీకి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్‌ కార్యాలయంలో లేఖను అందజేశాను. దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తా’’అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పడం గుర్తించాల్సిన అంశం. ఆయన నేరుగా స్పీకర్ ఛాంబరుకు వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఆ తర్వాత పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ గుడ్ బై చెప్పారు. నిజానికి వీళ్లద్దరేమైనా జగన్ కి పరాయి వాళ్లా అంటే కాదు. సాక్షాత్తు జగన్ కి సొంత మనుషులు. బాగా కావాల్సిన వాళ్లు. అయినా సరే షాక్ ల మీద షాకులిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాబోయే అంతర్గత తుపానుకు ఇవన్నీ సూచికలేమో అంటున్నారు పరిశీలకులు.


స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యే ఆర్కే..

వైసీపీపై తిరుగుబాటు చేసిన వాళ్లు ముగ్గురు నలుగురున్నా ఒక్క ఆళ్ల మాత్రమే స్పీకర్ ఫార్మాట్ లో పదవికి రాజీనామా చేశారు. నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు పార్టీలో ఉంటూనే వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయినా పదవికి పార్టీకి రాజీనామా చేయలేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు జెండా ఎత్తినా పదవులకు, పార్టీకి రాజీనామా చేయలేదు. అందుకు భిన్నంగా ఆళ్ల పదవిని, పార్టీని వదులుకున్నారు. బాధగానే ఉన్నా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న ఆళ్ల 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆరోజుల్లో కాంగ్రెస్‌లో YSR కోసం పనిచేశారు. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీటు, 2009లో పెదకూరపాడు సీటు ఆశించి భంగపడ్డారు. 2014లో వైసీపీ తరఫున మంగళగిరిలో వైసీపీ నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టి తన కల నెరవేర్చుకున్నారు. పట్టుమని పదేళ్లు కాకుండానే పదవికి గుడ్ బై చెప్పాడు.

పవన్ కల్యాణ్ ని ఓడించిన `తిప్పల’ కూడానా..

`పార్టీలో ఏదో జరుగుతోంది. అనుకున్నంత సజావుగానైతే లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి తప్పుకోవడం పెద్ద షాకే’ అన్నారు సుదీర్ఘకాలంగా రాజకీయాలను పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు వి.గోపాలరావు. ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీకి మరికొందరు కూడా గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వరుసలో విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నట్టు తెలిసింది. తిప్పల నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని సుమారు 17 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించిన వారు. అలాంటి వ్యక్తి 48 గంటలుగా పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు.

ఆళ్ల రాజీనామా ప్రభావం ఎంత...

ఆళ్ల తప్పుకోవడం వైసీపీకి బిగ్ షాకే. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకీ రాజీనామా చేయడం రాష్ట్రంలో పెద్ద చర్చకే తెరలేపింది. రాజీనామాకు వ్యక్తిగత కారణాలే అంటున్నా జగన్ కు తలలో నాలుకలా ఉంటూ చంద్రబాబును అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు దాకా లాగిన వాడు ఇంత అర్థంతరంగా ఎందుకు తప్పుకున్నాడన్నది చర్చనీయాంశమైంది. పార్టీ లోపలా బయటా ఆళ్ల పలుకుబడి తగ్గడమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నారు. అయితే ఆయన అనుచరుడైన తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే రాజీనామా చేశారన్నది ఆయన వాదన. 1250 కోట్ల రూపాయల నిధులు నియోజవర్గానికి ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ తర్వాత మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.

వైఎస్సార్ కు సన్నిహితుడే..

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలియాస్ ఆర్కే కుటుంబానికి పెద్ద ఆర్ధిక, అంగబలం ఉంది. లోక్ సభ సభ్యుడు, అత్యంత సంపన్నుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రామకృష్ణారెడ్డికి సొంత అన్న. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ ముఖ్యమంత్రి అయినపుడు 5 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేయించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాడు ఆర్కే. ఆ తర్వాత జగన్ కి కూడా అంతగా సన్నిహితంగా మెలిగిన వారు. చంద్రబాబు అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టినప్పుడు దాన్లో క్విడ్ ప్రో కో ఉందని కోర్టుకు వెళ్లిన వాడు ఆర్కే. మంచి వ్యక్తిగా పేరుంది. డౌన్ టూ ఎర్త్ అంటుంటారు.

మరెందుకు రాజీనామా చేసినట్టు..

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకున్నాయి. ఈమధ్య కాలంలో పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ఓపెన్ అయ్యాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటైంది. ఇప్పటికే మంగళగిరిలో ఆర్కే కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా జగన్ దాకా వెళ్లింది. అయినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆళ్లను దూరం పెడుతూ వచ్చారు. ఆ విభేదాలే చివరకు ఆయన రాజీనామాకు దారి తీశాయంటున్నారు.

అసలు కథ వేరా?

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని, వాళ్లకు రుణపడి ఉంటానన్న ఆళ్ల 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ పై స్వల్ఫమెజారిటీ గెలిచారు. నీతి, నిజాయితీలతో.. ధర్మంగా పనిచేశానని ఆయనే చెప్పినందున వంక పెట్టాల్సిన పని లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన హవా తగ్గిందని సీఎం జగన్ సర్వేలో తెలిందని, అందుకే 2024 ఎన్నికల్లో మంగళగిరిలో ఎక్కువగా ఉండే చేనేత వర్గాలకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారని చెప్పారని, ఆ తర్వాత రాజీనామా చేశారన్నది పార్టీలోని ఓ పెద్ద నాయకుడు చెప్పిన మాట. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన చిరంజీవి సైతం దూసుకెళ్తున్నారు.

వేడెక్కిన రాజకీయాలు...

రాజకీయాలు ఉన్నట్లుండి వేడెక్కాయి. గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఆయన అనుచరులు కూడా అదే బాట పట్టారు. రెడ్డి సామాజికవర్గానికి పట్టుండీ, సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న తాడేపల్లికి చెందిన వైసీపీ నేతలనేక మంది ఆళ్ల నడిచిన బాట పట్టారు. ప్రస్తుతం వార్తలో వ్యక్తిగా మిగిలారు.

ఇది ఐదో వికెట్..

2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలిచిన వైఎస్సార్ సీపీకి పెట్టని కోట నెల్లూరు జిల్లా. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటింరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమధ్య పార్టీకి నానాశాపనార్ధాలు పెట్టి తప్పుకున్నారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వీళ్లలో ఎందరు టీడీపీ పంచన చేరతారో, మరెందరు రాజకీయ సన్యాసం తీసుకుంటారో మున్ముందు వేచి చూడాలి. రాజీనామాల పర్వంలో మరెంత ముందుంటారో కూడా ఇంకో నెలబోతే తెలుస్తుంది. ఎన్నికల వేళ వైసీపీకి తగులుతున్న షాక్ లు ఏవైపు దారి తీస్తాయన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉంది.

Tags:    

Similar News