100 రోజుకు చేరనున్న పాలస్తీనా జాతి నిర్మూలన యుద్ధం.

హౌతీ గెరిల్లా శిబిరాల పై దాడుల పేరిట యెమెన్ పై అమెరికా, బ్రిటన్ దాడులు నిరసనగా రోడ్డెక్కిన ప్రజలు.అరబ్ ముస్లిం సర్కార్లకు ముందు నుయ్యి వెనక గోయ్యి పరిస్థితి

Update: 2024-01-13 01:51 GMT
Source: Social media

(ఇఫ్టూ ప్రసాద్)


గాజా పై ఇజ్రాయెల్ జాతి నిర్మూలన యుద్ధం నూరవ రోజుకు చేరనుంది. ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 

గత 24 గంటల్లో ఎర్రసముద్రం కేంద్రంగా జరిగిన రెండు పరిణామాలు యుద్ధ క్షేత్ర విస్తరణని సూచిస్తోంది. హౌతీ గెరిల్లాలపై దాడులు పేరిట అమెరికా, బ్రిటన్ 73 ఎయిర్ రైడ్స్ యెమెన్ పై చేశాయి. యెమెన్ మంటై మండుతోంది. నిరసనగా రాజధాని సానా నగరంలో సహా దేశ ప్రజలు యావత్తూ రోడ్లపైకి వస్తోంది. ఇది సౌదీ అరేబియా సహా అరబ్ దేశాల సర్కార్లను ఇరకాటంలోకి నెట్టింది. ముఖ్యంగా అమెరికా తొత్తు సర్కార్లు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.

సుదీర్ఘ కాలం జాత్యహంకార విధానాలకు వ్యతిరేకంగా పోరాట చరిత్ర గల దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం లో ఇజ్రాయెల్ జాతి నిర్మూలన మారణకాండను సవాలు చేస్తూ కేసు దాఖలు చేసిన విషయం తెల్సిందే. 84 పేజీల నివేదికలో జాతి హననాన్ని నిరూపించే సాక్ష్యాలను చేర్చి హేగ్ న్యాయస్థానంలో దాఖలు చేసింది. నేడు హేగ్ కోర్టు ప్రపంచ సంచలన కేంద్రంగా మారింది. అక్కడ కూడా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ముస్లిం దేశాలు, ముఖ్యంగా సహజాతి అరబ్ దేశాల సర్కార్లు చేయలేని సాహస కార్యాన్ని ఈరోజు దక్షిణాఫ్రికా చేయడంతో వాటి ముసుగుని బట్టబయలు చేస్తోంది.

తాను దురాక్రమణ చేసిన ఇరాక్ లో మిగిలిన అమెరికా సైనిక స్థావరాలపై గెరిల్లాల క్షిపణి దాడులు వరసగా జరుగుతున్నాయి. ఈశాన్య సిరియాలో నిర్మించుకున్న అమెరికా సైనిక స్థావరాల పై కూడా సరిగ్గా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, వర్తమాన ప్రపంచ గమనంలో శరవేగంగా పెను మార్పులు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలో పాలస్తీనాకు అంతర్జాతీయ సంఘీభావ దినం పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక, జియోనిస్ట్ ఇజ్రాయెల్ యుద్ధ వ్యతిరేక సంస్థలు, శాంతి సంఘాలు పిలుపు ఇచ్చాయి. 

Tags:    

Similar News