పాలనలో ప్రభుత్వ జవాబుదారీ తనం పెరగాలి

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రజా పాలన కాకుండా, తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజా పాలన కోరుకుంటున్నారు.

Update: 2024-09-10 13:21 GMT

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రజా పాలన కాకుండా, తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజా పాలన కోరుకుంటున్నారు. పాలనలో ప్రభుత్వం నుండీ, ప్రజా ప్రతినిధుల నుండీ, అధికారుల నుండీ జవాబుదారీతనం పెరగాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చడం మంచిదే అయినా, అక్కడ ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు విలువ ఉండాలని, ఆ దరఖాస్తులలో ప్రజలు వెల్లడిస్తున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా పౌర సేవల హక్కు చట్టాన్ని రూపొందించి ఆమోదించాలని కోరుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, ఆదివాసీ తండా లో కాదు , ఈ డిమాండ్లు వినిపించింది , రాజధాని నగరం నడిబొడ్డున, స్పష్టంగా, బిగ్గరగా ఈ డిమాండ్లు మారుమోగాయి.

ఆదివాసీలు, దళితులు, పారిశ్రామిక కాలుష్య బాధిత గ్రామాల ప్రజలు, ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్ధుల తల్లితండులు, నగరాలలో విస్తరిస్తున్న గిగ్ అండ్ ప్లాట్ ఫారం లలో పని చేసే కార్మికులు, అర్హులైన వారందరికీ పెన్షన్, రేషన్ కార్డులు అందించాలని కోరుకుంటున్న పేద కుటుంబాల మహిళలు, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యులు సెప్టెంబర్ 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కోసం హైదరాబాద్ తరలి వచ్చారు. ప్రజాపక్ష మేధావులు, హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో తమ సమస్యలను, డిమాండ్లను వినిపించారు.

వాళ్ళు వినిపించిన సమస్యలు వేరు వేరయినా, వాటి స్వభావం ఒక్కటే. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తమకు అందుబాటులో లేకపోవడం, తాము ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో, ఏమయ్యాయో, స్వయంగా పరిశీలించు కునేందుకు అవకాశం లేకపోవడం, దరఖాస్తు ఇచ్చిన ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందో గ్యారంటీ లేకపోవడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్ని సార్లు తిరగాలో, కార్యాలయంలో తమ సమస్య విని పరిష్కరించే బాధ్యత ఏ అధికారికి ఉందో ప్రజలకు తెలియకపోవడం, సమస్య పరిష్కారం కాకపోతే, అందుకు కారణాలేమిటో ఎవరూ చెప్పకపోవడం, ఒక్కోసారి , సమస్య పరిష్కారం అయిందని , నిధులు శాంక్షన్ అయ్యాయని ప్రభుత్వ వెబ్ సైట్ లో కనిపిస్తున్నా, ఆ నిధులు తమ వరకూ ఎందుకు చేరలేదో స్పష్టత లేకపోవడం- ప్రజలందరూ ఎదుర్కుంటున్న కామన్ సమస్యగా వినిపించింది.

చట్టాలు కావాలని పోరాడిన ప్రజలు, వాటి అమలు కోసం కూడా పోరాడాల్సి వస్తుందనే నిష్టుర సత్యాన్ని సామాజిక కార్యకర్తలు సమావేశంలో వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విడుదల చేసే జీవో లు అమలు చేయని కారణంగా, ప్రతి సంవత్సరం హక్కుగా రావలసిన వేల రూపాయల ప్రభుత్వ సహాయం అందక పేద ప్రజలు నష్టపోతున్నారని, క్షేత్ర స్థాయిలో అధికారులెవరూ, సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల, రాష్ట్రం నలుమూలల నుండీ ప్రజలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ తరలి వచ్చి, రాష్ట్ర స్థాయి అధికారులకు తమ ఆవేదన చెప్పుకోవాల్సి వస్తుందని, కార్యాలయాల చుట్టూ తిరిగే సమయమూ, రాజధానికి ప్రయాణం చేసి రావడానికి ఆర్ధిక స్తోమతా లేని పేద కుటుంబాలు , చివరికి తమ హక్కులను వదులుకుని నిరాశతో , ఇంటి దగ్గరే ఉండిపోతున్నాయని కూడా సామాజిక కార్యకర్తలు ఆధారాలతో మాట్లాడారు.

చిన్న పని చేయడానికి కూడా ప్రభుత్వ సిబ్బంది లంచాలు ఆశిస్తున్నారని, ముఖ్యంగా ప్రభుత్వ స్కీములు లబ్ధిదారులకు ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే, ఆ ఫైల్ పక్కన పెడుతున్నారని, గ్రామంలో దొరికే కూలీ పని పోగొట్టుకుని ఒక్క దరఖస్తు ఇవ్వడానికి, ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కుటుంబాలు రోజంతా ఎదురు చూడవలసి వస్తుందని, ఎవరు దరఖాస్తు తీసుకుంటారో, ఎన్ని గంటలకు తీసుకుంటారో స్పష్టత లేక రోజంతా ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజలు పడిగాపులు పడుతున్నారని, ఆర్ధికంగా నష్టపోతున్నారని కూడా, కార్యకర్తలు జ్యూరీ ముందు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

రాజ్యాంగానికి 73,74 సవరణలు చేసి, గ్రామ పంచాయితీకు, మున్సిపల్ వార్డుకు అధికారాలు ఇచ్చినా , ఏ విషయం మీదయినా, ముఖ్యమంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే నిర్ణయాలవుతాయని గత పదేళ్లుగా అమలైన కేంద్రీకృత పాలనా పద్ధతుల వల్ల , గ్రామ స్థాయిలో పరిపాలన పూర్తిగా స్తంభించి పోయిందనీ, మండల, జిల్లా స్థాయిలో కూడా అధికారులెవరూ చొరవ చేసి, సమస్యలు పరిష్కారం చేయడం లేదనీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా ఈ విషయంలో పెద్దగా మార్పులేదని బాధితులు తమ అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చిన దరఖాస్తుకు ఎలాంటి రశీదు ఇవ్వరనీ, కనీసం దానిని జాగ్రత్తగా ఫైల్ చేయరనీ, ఎప్పుడెళ్ళినా కొత్త దరఖాస్తు రాసి ఇవ్వమంటారనీ, నిజమైన ప్రజా పాలన అందించాలంటే, మొత్తంగా ఈ వ్యవస్థను సరి చేసి, గ్రామ స్థాయిలో, ;లేదా వార్డు స్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరి నోటి వెంటా వినిపించింది.

2006 నుండీ అమలులోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం క్రింద గత పదేళ్ళ కాలంలో ఒక్కసారి మాత్రమే కొందరికి వ్యక్తిగత పట్టాలు ఇచ్చారనీ, ఇంకా వేలాదిమంది పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టా హక్కులు లభించలేదని, ఆదివాసీలు దున్నుకుంటున్న భూమికే కాకుండా, మొత్తం అడవి పై , అడవి వనరులపై సాముదాయక హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం , దాని ఊసే ఎత్తడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా పశవుల మేత కోసం, అటవీ ఫలసాయం సేకరణ కోసం అడవికి వెళ్ళిన ఆదివాసీలపై, ఫారెస్టు అధికారులు దాడులు చేసి కేసులు బనాయిస్తున్నారని, ఆదివాసీ కుటుంబాలలో కొత్త తరం పిల్లలకు అడవి పై జ్ఞానం, అవగాహన కలిగి ఉండడం, అటవీ ఫలసాయం వినియోగించుకునే అధికారం కలిగి ఉండడం లాంటి సాధారణ హక్కులకు కూడా ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల ఆటంకం ఏర్పడుతుందని అత్యంత వెనుకబడన ఆదివాసీ తెగకు చెందిన ఒక మహిళ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.

కోవిడ్-19 సంబంధిత మరణాలకు పరిహారం శాంక్షన్ అయినా , బాధిత కుటుంబానికి ఇప్పటికీ అందకపోవడం, గత రెండేళ్లుగా అందని వితంతు పింఛన్లు, నేరం జరిగిందని రుజువయినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ క్లెయిమ్లు, గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాపితంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికీ అందించకపోవడం, వంటి వివిధ ఫిర్యాదులను పౌరులు జ్యూరీకి సమర్పించారు.

తెలంగాణ కు తరలి వస్తున్న పరిశ్రమల గురించి గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ పరిశ్రమలు వెదజల్లే విష కాలుష్యం గురించి పట్టించుకోవడం లేదని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , తన నివేదికలను బయట ప్రజల ముందు ఉంచడం లేదనీ, పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వం తో చేసుకుంటున్న ఒప్పందాల ప్రతులు , వివిధ ప్రభుత్వ శాఖలు ఆయా పరిశ్రమలకు ఇస్తున్న అనుమతుల పత్రాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని కాలుష్యం బారిన పడుతున్న గ్రామాల ప్రజలు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం,మొక్కజొన్న పంటల ఆధారంగా 29 ఇథనాల్ పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్ధు చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్ పాలసీని పునః పరిశీలన చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడానికి కేంద్రం నుండీ అనుమతులు పొందుతున్న కంపెనీలు, స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయడం లేదని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది.

రాజస్థాన్ తరహాలో తెలంగాణలో కూడా జవాబుదారీ చట్టం తేవాల్సిన అవసరముందని జ్యూరీ బలంగా అభిప్రాయపడింది. అధికారులలో జవాబుదారీతనం, ప్రజల గొంతును ప్రభుత్వం వినడం, సమస్యల పరిష్కారానికి ప్రతిస్పందించడం ప్రజాస్వామ్యానికి మూలాధారమని జ్యూరీ గుర్తు చేసింది. . తెలంగాణకు పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, చురుకైన సమాచార వెల్లడి అవసరమని, ఇది పౌరులకు, ప్రభుత్వానికి ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుందని జ్యూరీ సూచించింది.

నిర్ణీత కాలపరిమితితో కూడిన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను అమలు చేయాలని, దరఖాస్తులకు పబ్లిక్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పారదర్శకతను మెరుగుపర్చాలని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎనిమిది అంశాల తీర్మానం పబ్లిక్ హియరింగ్ సమావేశంలో ఆమోదించారు.

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండీ ప్రారంభించి అమలు లోకి తెచ్చిన “జన్ సూచన పోర్టల్” తరహాలో తెలంగాణ లో కూడా అన్ని ప్రభుత్వ శాఖల, అన్ని ప్రభుత్వ పథకాల సమాచారంతో ఒక సమాచార పోర్టల్ ను వెంటనే ప్రారంభించి, ప్రజల ముందుకు తేవాలని సమావేశంలో వచ్చిన డిమాండ్ ను పరిగణనలో పెట్టుకుని ప్రజావాణిపై పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్మిస్తామని సీనియర్ అధికారులు దివ్య దేవరాజన్, టి.రవికిరణ్ హామీ ఇచ్చారు.

రైతు స్వరాజ్య వేదిక , తెలంగాణ పట్టణ ప్రజల పోరాటాల వేదిక (శ్రమ్-NAPM ) , పీపుల్స్ మానిటరింగ్ కమిటీ (పీఎంసీ), ఏఎస్ఈఎం, దళిత బహుజన ఫ్రంట్ , తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ , లిబ్టెక్, సోషల్ అకౌంటబిలిటీ ఫోరం ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ తదితర సంస్థలు సంయుక్తంగా ఈ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం నిర్వహించాయి.

ఫెడరల్ వ్యాసం- 4 - 10-09-2024

ప్రజా పాలనలో ప్రభుత్వ జవాబుదారీ తనం పెరగాలి

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, ఫోన్: 9912928422 

Tags:    

Similar News