ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వైపుగా, కొనుగోలుశక్తిని పెంచే వైపుగా ప్రజలకు రుణభారాలు తగ్గించే వైపుగా ఎలాంటి చర్యలు ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-2025 బడ్జెట్ లో లేవు . ధరలను తగ్గించే వైపుగా, ప్రజలు భరించే పరోక్ష పన్నుల్ని తగ్గించే వైపుగా తగు చర్యలు బడ్జెట్లో లేనే లేవు. అదే సమయంలో కార్పొరేట్, సంపన్న వర్గాల నుండి వసూళ్లు చేసే ప్రత్యక్ష పన్నుల కంటే, నేడు మధ్యతరగతి, ఉపాధ్యాయ, ఉద్యోగ తదితర వర్గాల నుండి వసూళ్లు చేసే ఆదాయం పన్ను వాటా పెరిగింది. ఇది బడ్జెట్ దిశ, దశల్ని వెల్లడిస్తున్నది. ఈ ట్రీకిల్ డౌన్ థియరీకి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ఒక నిదర్శనంగా ఉంది.
ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం గానీ, ధరల నియంత్రణ కోసం గానీ ప్రత్యేక చర్యలు లేవు. అందుకై కేటాయింపులు లేవు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం గిట్టుబాటు ధరల మాట లేదు. రైతు రుణమాఫీ లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల మాట లేదు. కార్మికవర్గ ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. BOC, అసంఘటిత, మోటార్, స్కీమ్స్ తదితర రంగాల కార్మికుల సంక్షేమం కోసం చర్యలు లేవు. వలస కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ నిధి లేదు. ఆదివాసుల, దళితుల, స్త్రీల, మైనార్టీలకు ఆర్ధిక సంక్షేమ చర్యలు, తగు రక్షణ నిధులు లేవు. GST పన్నుల శాతాలు తగ్గింపు చర్యలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే, రోజూ మార్కెట్లో సరుకులు కొని బ్రతకాల్సిన ప్రజల కొనుగోలు శక్తిని నికరంగా పెంచడం కోసం చేపట్టిన శాశ్వత చర్యలు ఈ బడ్జెట్లో లేవు. ఇవన్నీ ఒక ఎత్తు! మన రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానం మరో ఎత్తు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 15,000 కోట్లు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు మీడియా ఈరోజు ఊదరగొట్టింది. ఇది పరమ అబద్ధం. నిజానికి కేంద్రం రాజధాని కోసం ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అప్పుల కోసం రుణదాత ఏజెన్సీల వద్దకు చిప్ప పట్టుకొని వెళ్తే, కేంద్రం జామీను (షూరిటీ) ఉంటుంది. ముక్కుపిండి వడ్డీతో సహా వసూలు చేసే సంస్థలవి. ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి పై ఆధారపడి మనుగడ సాగించే మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కల్పించిన దుస్థితి యిది. ఆచరణలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కల్పించే దురవస్థ యిది.
బడ్జెట్ ప్రత్యేక హెూదా లేదు. పోలవరం ముంపు బాధితుల ప్యాకేజిలు లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకి ప్యాకేజీలు లేవు. విశాఖ ఉక్కు మాట లేదు. రైల్వే జోన్ మాట లేదు. కేంద్ర విద్యా సంస్థల స్థాపన లేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల మాట లేదు. ముఖ్యంగా విభజన చట్టం అంశాలకు కట్టుబడి ఉన్నామని మోడీ ప్రభుత్వం గత పదేండ్ల నుండి ఇదే భజన పాట పడుతోంది. ఉత్తుత్తి హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కడుపులు నింపే బుద్ధి ప్రదర్శిస్తోంది. గతంలో ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ ఇచ్చి మోసం చేస్తోంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి అందించే ఆక్సిజన్ (వెంటిలేటర్) పై ఆధారపడి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం నేడు రాజకీయ మనుగడ సాగిస్తూ, తిరిగి అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఇంతటి తీరని ద్రోహానికి పాల్పడుతోంది. పైగా దక్షిణాది రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు భారత్లో కలిపింది. తద్వారా మున్ముందు GST పన్నుల వసూళ్లు, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షత, ఇంకా నియోజకవర్గాల వివక్షతా పూర్వక పునర్విభజన వంటి వివిధ అంశాలపై దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఏర్పాటును దెబ్బతీసే కుట్రబుద్దిని కూడా ప్రదర్శిస్తోంది.
ఈ వ్యాసారంభంలో పేర్కొన్న రెండు థియరీలు కూడా నేటి పాలకుల పాలనా విధానమనే నాణేనికి బొమ్మా బొరుసు వంటివే. తమ దోపిడీ వ్యవస్థ పరిరక్షణ కై సంక్షేమ థియరీని పాటించే సర్కార్లు సరుకుల్ని కొనుగోలు చేసే సాధారణ ప్రజలకు సంక్షేమ, సబ్సిడీ వంటి సాయం చేస్తే, పెట్టుబడిదారీ, వాణిజ్య వర్గాలు తమ సరుకులను అమ్మి లాభాలు గడిస్తాయని భావిస్తాయి. కానీ ట్రీకిల్ డౌన్ థియరీని నమ్మే సర్కార్లు తమ సరుకుల్ని అమ్ముకోవాల్సిన వాణిజ్య, పెట్టుబడిదారీ వర్గాలకు సబ్సిడీలు, పన్ను మినహాయింపుల వంటి ఆర్ధిక సహకారాల్ని అందించడం ద్వారా లాభాలు గడిస్తారని నమ్ముతాయి. కొనేవాడికి తిప్పలు ఉంటే అమ్మేవాడికి కూడా తిప్పలు వుంటాయని సంక్షేమ థియరీ చెబుతుంది. మొట్టమొదట అమ్మేవాడికి తిప్పలు లేకుండా సాయం చేస్తే, కొనేవాడు ఏదో విధంగా మార్కెట్ కి వెళ్లి సరుకుల్ని కొనుక్కోకతప్పదని ట్రీకిల్ డౌన్ థియరీ చెబుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రీకిల్ డౌన్ థియరీ చెలామణి అవుతోంది. అదే దారిలో భారత్ ప్రయాణం సాగుతోంది. ఫలితంగా ఆర్ధిక అసమానతలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించే వాస్తవాలు కూడా ఇవే! మోడీ ప్రభుత్వ బడ్జెట్లు కూడా ఇదే వెలుగులో సాగుతున్నాయి. ఈరోజు బడ్జెట్ కూడా దీనికో నమూనాగా ఉంది.
ఈ విధంగా ఒకవైపు ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా, మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల మోడీ ప్రభుత్వ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సి ఉందని మా పార్టీ పిలుపు ఇస్తున్నది. ఒకవైపు కేంద్రంపై పోరాటం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వత్తిడి చేస్తూనే, మరోవైపు మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సి ఉందని రాష్ట్ర ప్రజలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది.
( సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ. రచయిత అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ)