సీఎంల ఎంపికలో మోదీ - షా ఫార్ములా అదేనా?

ఇందిరా గాంధీ ఎలా చేశారో..దాన్నే మోడీ-షా ఫాల్లో అవుతున్నారా? కొత్తతరం నాయకులను సీఎంలుగా ఎంపిక చేయడం వెనక ఆంతర్యం ఏమిటి?

Update: 2023-12-15 09:08 GMT



ప్రముఖ కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్‌ గీసిన కార్టూన్‌ ఇది. 1982లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో దీన్ని ప్రచురించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేతిలో గొడుగు పట్టుకుని.. ఎత్తుగా, బలంగా ఉన్న వ్యక్తులను దాటి నడుచుకుంటూ వెళ్తున్నట్లు లక్ష్మణ్‌ చిత్రీకరించారు. వరుసగా నిలుచున్న రాజకీయ నాయకులంతా సాంప్రదాయ వేషధారణలో (ధోతీ లేదా పైజామా/కుర్తా ధరించి) ఉన్నట్లు చూయించారు. ఇందిర ఒకరివైపు వేలు చూపిస్తూ, ‘‘సరే, మీరు..అక్కడ, మీరే సీఎం. నీ పేరు ఏమిటి?’’ అని అడుగుతున్నట్టుగా లక్ష్మణ్‌  గీశారు.

అదే కార్టూన్‌లో ‘ఆంధ్ర సీఎం కోసం వేట సాగుతోంది’ అనే శీర్షికతో ఉన్న ఒక వార్తాపత్రిక నేలపై విసిరేసినట్లు చూయించాడు.

ఒక సందర్భంలో హైదరాబాద్‌ పర్యటన నిమిత్తం రాజీవ్‌ గాంధీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు రాజీవ్‌గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఇది నచ్చని రాజీవ్‌.. అప్పుడు సీఎంగా టి అంజయ్యను బహిరంగంగా అవమానించారు. తర్వాత రాజీవ్‌గాంధీ  ఢిల్లీకి తిరిగి రాగానే తన తల్లితో చెప్పి అంజయ్యను బర్తరఫ్‌ చేసేలా చేశాడు.

సీనియర్లను పక్కనపెట్టి కాంగ్రెస్‌ పార్టీ తనకు ఇష్టమైన వ్యక్తులను సీఎంలుగా నియమించడం.. తెలుగు ఆత్మగౌరవ ఉద్యమానికి దారితీసింది. తర్వాత ఎన్టీ రామారావు రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించడం.. టీడీపీని స్థాపించడం..చివరికి ఆయన సీఎం కావడం జరిగిపోయాయి.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ కాషాయం పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎంల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. వారి పేర్లను వెల్లడించేందుకు వారం రోజుల సమయం తీసుకుంది. మోహన్‌ యాదవ్‌, భజన్‌ లాల్‌ శర్మ, విష్ణు దేవ్‌ సాయి పేర్లు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే రాజేంద్ర శుక్లా, జగదీష్‌ దేవదా, దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వా, విజయ్‌ శర్మ అరుణ్‌ సావో పేర్లు కూడా. చాలా కొద్దిమంది నాయకులకు మాత్రమే వీరి పేర్లు తెలిసి ఉండవచ్చు.

ఎన్‌డీఏ పాలనలో సీఎంల ఎంపికలో ప్రజాస్వామ్య భాగస్వామ్యం తక్కువ. పార్టీ పరిశీలకుల అభిప్రాయానికి కూడా పెద్ద విలువుండదు. ఈ ధోరణ కాంగ్రెస్‌ పార్టీది. కాని ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.

ఇటీవల ఎన్నికయిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ముఖ్యమంత్రులు పార్టీలో ప్రముఖ వ్యక్తులు కాదు. వారి పేర్ల ఎంపికలో ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక పాత్ర వహించారన్నది జగమెరిగిన సత్యం.

ఎప్పటికీ క్షమించడు.. మరచిపోడు..

‘‘2014 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థిగా మోడీ(Modi)ని బీజేపీ ప్రకటించింది. నేను రాసిన మోదీ జీవిత చరిత్ర దీనికి చాలా నెలల ముందు ప్రింట్‌ అయ్యింది. మోదీపై నా అభిప్రాయం, కోట్స్‌ కోసం ఇతర జర్నలిస్టులు నాతో మాట్లాడేవారు.కొన్ని వారాల తర్వాత.. ఓ చోట న్యూస్‌స్టాండ్‌లో కవర్‌పేజీపై మోదీ ఫొటోను ప్రింట్‌ చేసిన పుస్తకం ఒకటి చూశాను. మోదీ ఫొటో కింద ఒక కోట్‌ కూడా ఉంది. ‘‘మోడీ నెవర్‌ ఫర్గివ్స్‌ అండ్‌ ఫర్గెట్స్‌` బయోగ్రాఫర్‌ నీలాంజన్‌ ముఖోపాధ్యాయ అని రాసి ఉంది.’’

ఈ పరిశీలన చేసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అలాగే చివరి వ్యక్తిని కూడా కాదు. ఈ బిరుదును సంపాదించుకున్న మొదటి వ్యక్తి లేదా చివరి వ్యక్తి మోడీ కూడా కాదు.

2011-12లో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో మోదీ ఉన్నారు. మోడీ అన్ని పోటీల్లో ముందుండి ప్రధాని అయ్యారు. ఇక చౌహాన్‌, వసుంధర రాజేలు 2018 వరకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరు నాయకత్వం వహించిన ప్రచారాల్లో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారు.

వ్యక్తిగత ద్వేషం కాదు

దాదాపు రెండు దశాబ్దాల పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ సారథ్యంలో కొనసాగిన ఇద్దరు నేతలను పక్కన పెట్టాలనుకోవడం.. వారిపై మోదీకి ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల కాదు. నవంబర్‌ 2005లో ఉమాభారతి తర్వాత చౌహాన్‌, 2002లో భైరోన్‌ సింగ్‌ షెకావత్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాజే నాయకత్వ మద్దతు కోల్పోయారు.

మూడు రాష్ట్రాలలో బీజేపీ(BJP)కి మంచి మెజార్టీ లభించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కొత్త ముఖాలను తెరమీదకు తేవాలన్న మోదీ-షా(Amit Shah)లు భావించినట్లున్నారు. చౌహాన్‌, రాజే బలప్రదర్శన చేసినా వారు లొంగలేదు.

విశేషమేమిటంటే.. ఎంపికైన నాయకులకు ప్రజలతో పాటు పార్టీలోనూ చెప్పుకోదగ్గ ఫాలోయింగ్‌ లేదు. వారు మోదీ షాల అడుగుజాడల్లో నడుస్తారు. 2014 నుంచి చాలా మంది బీజేపీ నాయకులు నాయకత్వం దయతో సీఎంలుగా ఎన్నికయ్యారు.

కుల సమీకరణాలు..

ఈ ఎంపికల వెనుక లాయల్టీ ఫ్యాక్టర్‌ మాత్రమే కాదు. ఇందిరాగాంధీ కార్టూన్‌లో నాయకులను ఎంచుకునే రకం ఇప్పుడు బీజేపీలోనూ కనిపిస్తుంది. ప్రస్తుత సీఎంలు, డిప్యూటీ సీఎంల ఎంపిక ఉత్తర భారతదేశంలోని కులాలను దృష్టిలో ఉంచుకుని జరిగింది. అగ్రవర్ణాలు, ఒబీసీలు, దళితులు, గిరిజనులేనే కాకుండా ప్రతి కులాన్ని సంతృప్తి పరిచే య్నతంలో ఇదో భాగం. ఈ సమీకరణాలతో ఆధిపత్య, ఆధిపత్యేతర కులాలకు పార్టీ దగ్గరయ్యే అవకాశం ఉంది.

2014లో విజయం సాధించిన తర్వాత మోదీ ధైర్యంగా కుల పరమైన బుజ్జగింపులు చేయలేదని గుర్తుచేసుకోవాలి. మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానాలలో ఆధిపత్యం లేని వర్గాల వారిని ముఖ్యమంత్రులుగా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ మరాఠా కాదు. రఘుబీర్‌ దాస్‌ గిరిజనుడు కాదు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ జాట్‌ కాదు.

ఇప్పుడు మూడు రాష్ట్రాలలో సమగ్ర విజయం సాధించిన తర్వాత కూడా.. మోడీ-షా ద్వయం ప్రతి ప్రధాన కులానికి ప్రాతినిధ్యం కల్పించాలని.. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రుల ఎంపిక జరిగిందనుకోవాలి.

మూడు రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.  ఢిల్లీ  నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రభుత్వం, పార్టీని పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇది లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారాన్ని సులభతరం చేస్తుంది.

పాత తరం నాయకులను మార్చడానికి, పార్లమెంటు ఎన్నికల్లో కొత్తవారిని స్థానం కల్పించే దిశగా కాంగ్రెస్‌ ఇప్పటివరకు ప్రయత్నం చేయలేదు. మోడీ, షా తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలపై విజయం సాధిస్తున్నారు.

(ఫెడరల్‌ స్పెక్ట్రమ్‌ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు అందించడానికి ప్రయత్నిస్తుంది. కథనాలలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితకు చెందినవి.)

Tags:    

Similar News