ఉద్యమాల ద్వారానే ప్రజలు తమ హక్కులను సాధించుకో గలరని మరోసారి రుజువైంది. అంతేకాదు మరిన్ని ప్రజాస్వామ్య ఉద్యమాలకు తొవ్వ చూపింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ తంతు ముగిసింది. వ్యూహత్మకంగా పావులు కదిపి ఎస్. సి. వర్గీకరణ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఎన్. డి. ఏ. భాగస్వామ్య పక్షాల కోర్ట్ లోకి సమస్యను విసిరింది. ఉప కులాల వారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో తమ న్యాయమైన వాటా ఫలాలు అందుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
'వేయి గొంతులు, లక్షడప్పులు' చలో హైదరాబాద్ పిలుపు వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వానికి కొండంత ఊరట లభించింది. మాదిగ మేధావుల ఫోరం కూడా మాలలను తమ అన్నలు అనడం ప్రారంభమైంది. కారంచేడు,చుండూరు ఘటనలో వలె అగ్రవర్ణాల దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకున్నది. సమస్య తాత్కాలికంగా ముగిసినట్లు కనిపించినా సెగ మాత్రం చల్లారలేదు. మాదిగలు ఇంకొంత వాటా పెరగాల్సి ఉందని చెబుతుండగా మిగతా ఉపకులాలకు చెందిన బుడిగ జంగాలు,నేతకాని వంటివారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఇందుకు ప్రధాన కారణం ఒకటి, రెండు, మూడు గ్రూపులలో విభజన సరిగా చేయక పోవడం వలన తాము తీవ్రంగా నష్ట పోతామని ఆందోళలో ఉన్నారు. ఈ వర్గీకరణతో ఉపాధి, ఉద్యోగ అవకాశాల విషయంలో నష్టం జరుగుతుందని ఆగ్రహంతో ఉన్నారు.తాము మాత్రం తాము నష్టపోతున్నాం అంటున్నారు.
తెలంగాణలో వర్గీకరణ జరగడంతో సవాలును మొదటిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు, ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి విసిరింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ చేసి ఫలాలు అందించిన ఘనత గతంలో చంద్రబాబుకు( తెలుగుదేశం పార్టీ) ఉన్నది.
ఇక పోతే పార్లమెంటు ఎన్నికలకు ముందు మందకృష్ణ మాదిగ హైదరాబాదులో భారీ సభ నిర్వహించి ప్రధాని మోడీని ఆహ్వానించి వర్గీకరణ పై హామీ పొందారు. మరో అడుగు ముందుకేసి, ఎవరు ఏ పార్టీలో ఉన్న బిజెపిని గెలిపించాలని పిలుపుకూడా ఇచ్చారు .అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ మెడకు ఉచ్చులా బిగియనుంది.
దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బిజెపి, దాని భాగస్వామ్య పక్ష పార్టీలు అధికారంలో ఉండడం వలన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన తప్పని పరిస్థితి బి.జె. పి. కి రావడంతో పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారనుంది. ఒక రకంగా కృష్ణ మాదిగ నాయకత్వానికి కూడా ఇది పెను సవాల్ వంటిదే.
తెలంగాణ లో వర్గీకరణ జరిగిన కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన "వేయి గొంతులు ఎక్కడ గానం చేయాలి, లక్ష డప్పులు ఎక్కడ మోగించాలి" అన్న విషయం తేల్చడం అంత తేలికైన పని కాదు. తదుపరి కార్యక్రమం వెంటనే అమరావతికి వేదికగా మారుతుందా? లేకపోతే ఢిల్లీకి చేరనుందా? వర్గీకరణ సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాదు కాబట్టి ఉద్యమాన్ని కొనసాగించి ముందుకు తీసకుపోవడం అనివార్యం కూడా.
ఇదిలా ఉంటే ఎస్టీలలో ఉప కులాల విభజన సమస్య కూడా తీవ్రం కానుంది. అసలు ఎస్టీలు ఎవరు? అనే విషయంలోనే సమస్య రగడగా మారింది. గోండ్లు, కొలాములు, కోయలు, చెంచులు తదితరులు మాత్రమే తెలంగాణలో ఎస్టీలని లంబాడాలు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన అగ్రవర్ణాల వారని చర్చ జరుగుతుంది. 1976 వరకు ఆదివాసులు మాత్రమే ఎస్. టి. లు గా ఉండే వారు. ఆ తర్వాతే లంబాడాలను ఎస్. టి. జాబితాలో చేర్చారు. అందుకే ఈ విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో వీరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి.
అధికారంలో, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో లంబాడాలు ముందు ఉన్నారని ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం. కాకపోతే లంబాడాలకున్న బలమైన నాయకత్వం మిగతా తెగలలో కనిపించడం లేదు. అంతమాత్రాన మిగిలిన వారిని తక్కువగా అంచనా వేయలేం. ఇదిలా ఉండగా బీ.సీ.లు కూడా అసంతృప్తి గానే ఉన్నారు. తమకు రాజ్యాధికారంలో సరైన దామాషాలో వాటా దక్కడం లేదని చాలా కాలంగా నినదిస్తూనే, నిలదీస్తూనే ఉన్నారు.
కాకపోతే బి. సి. లలో కూడా గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలీ, మున్నూరు కాపు కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నారు. మిగిలిన కులాల వారి స్థితి నామ మాత్రమే. అలాగే అగ్ర కుల / వర్ణాలలో ఉన్న వారంతా ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా ముందున్నారని చెప్పలేం. క్రిస్టియన్ , ముస్లిం మైనారిటీల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అంటే పరిస్థితి అందుకు భిన్నంగా లేదని అర్థం.
సామాజిక, రాజకీయ రంగంలో వెనుకబాటులో, కులంతో బాటు ధనం కూడా కీలక భూమిక పోషిస్తున్నది. పాలకులను అడుక్కుంటే సరిపోదని, ఉద్యమాల ద్వారానే తమ హక్కులు సాధించుకోగలమని తెలంగాణలో మరోసారి రుజువయ్యింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు, ఎస్సీ లవర్గీకరణ ఇటీవల సాధించిన విజయాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
పోరాటాల, త్యాగాల, ఉద్యమాల ఘన చరిత్ర తెలంగాణ కు ఉన్నది. దున్నే వానిదే భూమి ప్రాతిపదికగా సాగిన సాయుధ రైతంగ పోరాటం, భూస్వాముల కబంద హస్తలనుండి లక్షలాది ఎకరాలను పేద రైతాంగం స్వాధీనం చేసుకోవడం అందరికీ తెలిసిన వాస్తవం. రజాకార్లను గడగడలాడించి,నిజాముకు చెమటలు పట్టించిన ఘనత మహాత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానిది.ఐదు దశాబ్దా ల కాలంలో పలురూపాలలో నడిచిన ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. మూడు దశాబ్దాల అలుపెరగని ఉద్యమం ద్వారానే వర్గీకరణ సాకారమైంది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతావని భావించి పోరాడిన / త్యాగం చేసిన ప్రజలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగ సమస్య, విద్యారంగ సమస్యలు, అసంఘటిత కార్మికుల సమస్యలు అలానే ఉన్నాయి. సింగరేణి ప్రయివేటీ కరణ, ఓపెన్ కాస్ట్ గనుల సమస్య పరిష్కారం కాలేదు. భారీ జలవనరుల ప్రాజెక్ట్ లు, ఫ్యాక్టరీ ల ఏర్పాటు కారణంగా ఏర్పడిన నిర్వాసితుల సమస్యలు కొలక్కి రావడంలేదు. ఆదివాసుల 1/70 చట్టం అమలు, అటవీ హక్కుల చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. పొడుభూముల విషయం తేలడం లేదు. ఇసుక, గ్రానైట్, ల్యాండ్, లిక్కర్ మాఫియా సమస్యలు తీవ్రంగా వేదిస్తున్నాయి.కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర సమస్యలు, ఫార్మా కంపెనీల సమస్యలు, కాలుష్య సమస్యలు, కొత్త ఫ్యాక్టరీల కోసం భూములను ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల సమస్యలు, ఉచిత విద్యా వైద్యం అమలు సమస్యలు, ప్రభుత్వ విద్యా, వైద్య రంగంలో అధ్యాపకుల కొరత సమస్య, మౌలిక వసతుల ఏర్పాటు సమస్య పరిషరించాల్సి ఉన్నది. పౌర, ప్రజాస్వామిక హక్కుల పరి రక్షణ ఎండమావిగానే కనబడుతున్నది.ఇలా చెప్పుకుంటూ పోతే చేoతాడన్ని సమస్యలు. వివిధ వర్గాల ప్రజల డిమాండ్లు తెలంగాణలో అపరిష్కృతంగా మిగిలే ఉన్నాయి. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ మారోమారు ప్రజాస్వామిక ఉద్యమాలకు, విముక్తి పోరాటాలకు వేదిక / దివిటీ గా మారనున్నదా? ఇదే ఇవాళ ప్రధానంగా రాజకీయ విశ్లేషకులలో జరుగుతున్న ప్రధాన చర్చ.