రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని పనిని గ్రామీణ మహిళలు చేసి చూపించారు
ఏపూరు గ్రామ మహిళల సాహసం గురించి సామాజిక కార్యకర్త కన్నెగంటి రవి విశ్లేషణ;
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ మహిళలు సాహసం చేశారు. గ్రామాన్ని మద్యం మత్తు నుండీ బయటకు తేవడానికి నడుం బిగించారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపులన్నిటినీ మూసి వేయించారు. గ్రామంలో 650 కుటుంబాలతో, 2500 జనాభా ఉంటుంది. ఈ గ్రామం నుండీ 300 మంది డ్రైవర్లుగా పని చేస్తారు. మద్యం కారణంగా ఇటీవల గ్రామానికి చెందిన కూరాకుల ధనుంజయ్ అనే డ్రైవర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆ వ్యక్తి కుటుంబాన్నే కాదు, మొత్తం గ్రామాన్నే విషాదంలో ముంచేసింది.
మరో సారి ఇలాంటి ఘటన జరగకూడదని భావించిన గ్రామ మహిళలు మద్యం పై యుద్ధానికి సిద్దమయ్యారు. గ్రామస్తులకు నచ్చ చెప్పారు. బెల్టు షాపుల యాజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా , మద్యం సేవిస్తే 20,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. మద్యం అమ్మేవారిని పట్టిస్తే 10,000 రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. గ్రామ మహిళలు చేసిన ఈ నిర్ణయం సాఫీగా అమలవుతున్నది. ప్రస్తుతం గ్రామం ప్రశాంతంగా ఉందని, అందరూ హాయిగా నిద్ర పోతున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా లింగం పేట మండలం సజ్జనపల్లి లోనూ గ్రామస్తులు మద్యానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే, ఎక్సైజ్ శాఖ ద్వారా కేసులు నమోదు చేయిస్తామని బెల్టు షాపుల వారిని హెచ్చరించారు. మద్యానికి వ్యతిరేకంగా ఈ చొరవ ప్రదర్శించిన ఏపూరు, సజ్జన పల్లి గ్రామస్తులకు మనం తప్పకుండా అభినందనలు చెప్పాలి.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మానిఫెస్టోలో బెల్టు షాపులను మూసేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మద్యానికి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనేక సభలలో మాట్లాడారు. కానీ గత 14 నెలల కాలంలో రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం ఈ ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. పైగా 2024-2025 బడ్జెట్ లో గతానికి మించి, ఎక్సైజ్ పన్ను ఆదాయాన్ని 25,000 కోట్లుగా అంచనా వేశారు. నిజంగా మద్య నియంత్రణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సాధారణంగా ప్రతి సంవత్సరం మద్యం వినియోగం తగ్గి, ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను ఆదాయం తగ్గాలి. మద్యం అమ్మకాల విలువ కూడా తగ్గాలి.
కానీ ఆచరణలో ఏమి జరిగింది ?
2014 లో రాష్ట్రంలో మద్యం అమ్మకాల విలువ 10,000 కోట్లు మాత్రమే. అందులో నుండీ సుమారు 2500 కోట్లు ఎక్సైజ్ పన్నుగా ప్రభుత్వానికి అందేది. కానీ 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాల విలువ 36,493 కోట్లు. ప్రభుత్వానికి ఆ సంవత్సరంలో సుమారు 17,000 కోట్ల ఎక్సైజ్ పన్ను ఆదాయం అందింది. అంటే పదేళ్ళలో మద్యం అమ్మకాల విలువ మూడున్నర రెట్లు, ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను ఆదాయం ఎనిమిది రెట్లు పెరిగిందన్నమాట.
మద్యం అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం లిక్కర్ వ్యాపారులకు లాభాల రూపంలో, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో, ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు వేతనాలు, లంచాల రూపంలో, రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో, వైద్యులకు ఫీజుల రూపంలో అందుతుంది. కానీ మద్యం వ్యసనం కారణంగా పురుషులకు అనారోగ్యాలు, పురుషుల చేతుల్లో మహిళలకు, పిల్లలకు హింస ఖచ్చితంగా అందుతాయి.
2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడే నాటికి 9,26,879 మంది వితంతు మహిళలు నెలకు 200 రూపాయల పెన్షన్ పొందే వారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆసరా పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచారు. 2014 లో కొత్త పెన్షన్ లబ్ధిదారులతో కలసి వితంతు పెన్షన్ పొందే వారి సంఖ్య 12,61,190 మందికి చేరింది. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య 15,63,091 మందికి చేరింది. 2018 నుండీ ఆసరా పెన్షన్ మొత్తం కూడా నెలకు 2016 రూపాయలకు పెరిగింది. గత రెండున్నరేళ్లుగా 2022 జులై నుండీ ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన వితంతువులను పూర్తి స్థాయిలో నమోదు చేస్తే, వితంతువుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నది వాస్తవం.
మహిళలు వితంతువులుగా మారడానికి పురుషులలో పెరుగుతున్న రకరకాల అనారోగ్యాలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఫలితంగా, సంభవిస్తున్న అకాల మరణాలు ముఖ్య కారణం. పైన పేర్కొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర మగ వాళ్ళలో పెరుగుతున్న మద్యం వ్యసనం ఒక ప్రధాన కారణంగా ఉంది.
రాష్ట్రంలో 2023-2024 సంవత్సరం చివరికి 89,97,055 కుటుంబాలకు ఆహార బద్రత కార్డులు ఉన్నాయి. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులను ఎక్కువగా మంజూరు చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేస్తే, ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. అంటే రాష్ట్రంలో కోట్లాది మంది పేదలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారని అర్థం. ఇంత మంది పేదలున్న రాష్ట్రం,లో మద్యం అమ్మకాలు ప్రతి సంవత్సరం పెరగడం, ఆయా కుటుంబాల పేదరికాన్ని మరింత పెంచుతుంది.
రాష్ట్రంలో 2023-2024 సంవత్సరం చివరికి మొత్తం 1,38,15,346 గృహ వంట గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో సుమారుగా అన్ని కుటుంబాలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. (వంట గ్యాస్ కనెక్షన్ లేని పేద కుటుంబాలను మినహాయిస్తే) ఈ కుటుంబాలలో సుమారు 20 లక్షల మంది వితంతువులు ఉండడమంటే, రాష్ట్రంలో మహిళల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల ( SHG) సభ్యులైన మహిళలు తాము కష్టం చేస్తే వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసి , బ్యాంకులలో దాచుకోవడం, ఆయా మహిళా బృందాలు మళ్ళీ బ్యాంకుల నుండీ రుణాలు తీసుకుని కుటుంబాల అవసరాలకు ఖర్చు పెట్టుకోవడం మనకు తెలుసు. 2014-2015 లో 1,94,145 మహిళా బృందాలు బ్యాంకుల నుండీ 3708.10 కోట్లు రుణం గా తీసుకున్నాయి. ఆ రోజుల్లో మద్యం అమ్మకాల విలువ 10,000 కోట్లు. అంటే మహిళలు తీసుకున్న రుణాల కంటే, మూడు రెట్ల ఎక్కువ డబ్బులను మగవాళ్ళు మద్యం పై తగలేసేవాళ్ళన్న మాట. 2023-2024 లో 2,56,620 మహిళా బృందాలు బ్యాంకుల నుండీ మొత్తం 15,025 కోట్లు రుణంగా తీసుకుని కుటుంబాల పోషణకు వాడుకుంటే, ఇదే సంవత్సరం మగవాళ్ళు మాత్రం 36,493 కోట్లు ( రెట్టింపు డబ్బులు) మద్యం పై తగలేశారు. కుటుంబాలను అప్పుల పాలు చేశారు.
ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తున్నదంటే, ఇవాళ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు కేవలం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల శ్రమపై , మహిళల పొదుపుపై, మహిళలు బ్యాంకుల నుండీ తెచ్చే రుణాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే మగవాళ్ళ మద్యం వ్యసనం ఆయా కుటుంబాలు ఇక ఏ మాత్రం భరించలేని స్థితికి చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి 15,000 కోట్లు రైతు బంధు పేరుతో పెట్టుబడి సహాయం చేస్తే, రైతులకు చాలా గొప్ప సహాయం చేసిందని చెప్పుకుంటాం. ఇంతకు రెట్టింపు మొత్తాన్ని మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం దోచుకుందని మనం మర్చిపోతాం.
2024-2025 ఏప్రిల్ నెలలో 32,52,794 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి జీరో బిల్లు క్రింద 116 కోట్ల 8 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసి, చాలా గొప్ప పథకం అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటుంది.. 2023 డిసెంబర్ నుండీ 2024 మార్చ్ వరకూ మూడు నెలల్లో 1163 కోట్లు ఖర్చు చేసి ( అంటే సుమారు నెలకు మూడు వందల కోట్లు) మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేసిన గొప్ప మేలుగా మనం చెప్పుకున్నాం. కానీ నెలకు మూడు వేల కోట్లు రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా ఇదే ప్రభుత్వం రాష్ట్ర పేద కుటుంబాల సభ్యుల జేబుల్లో నుండీ గుంజుకుందని మనం గుర్తించం.
2023 ఏప్రిల్ లో సగటున కిలో 50.59 రూపాయలు ఉన్న బియ్యం ధరలు 2024 ఏప్రిల్ నాటికి సగటున 61.41 రూపాయలకు, గోధుమల ధర కిలో 40.91 రూపాయల నుండీ 45.16 రూపాయలకు, జొన్న ధరలు 53.48 నుండీ 58.41 రూపాయలకు, కంది పప్పు ధర కిలో 123.42 నుండీ 161.53 రూపాయలకు , శనగ పప్పు ధర కిలో 73.38 నుండీ 83.93 రూపాయలకు , కిలో పెసర పప్పు ధర 114.33 నుండీ 123.46 రూపాయలకు, మినప పప్పు ధర కిలో 121.86 నుండీ 141.85 రూపాయలకు ( ఇవన్నీ ప్రభుత్వం తన నివేదికలో ప్రకటించిన నిత్యావసర సరుకుల కనీస ధరలు) పెరిగినా, ఇవే కాక కూరగాయల ధరల భారం ప్రజలను కుంగ దీస్తున్నా రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.
కానీ మద్యం కంపెనీలకు లాభం చేయడానికి మాత్రం మద్యం ధరలను ( అన్ని బీర్ల పై 15 శాతం ) 2025 ఫిబ్రవరి 11 నుండీ పెంచింది. యునైటెడ్ బ్రువరీస్ కంపనీ 2025 జనవరి నుండీ మద్యం సరఫరాను నిలిపి వేయడంతో, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. లైసెన్స్ పొందిన షాపుల ద్వారా మాత్రమే కాకుండా , బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి వ్యాపారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఎంత ఎక్కువ ధరలకు మద్యాన్ని బెల్టు షాపుల ద్వారా అమ్ముతున్నారో మీడియా కథనాలు రోజూ వస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడం మీద ఉన్న దృష్టి, రాష్ట్రంలో మద్య నియంత్రణ మీద లేదని కనిపిస్తుంది.
రాష్ట్రంలో 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో 40,62,120 మంది కార్మికులు (గ్రామీణ పేద కుటుంబాల సభ్యులు) పనిలో పాల్గొన్నారు. ఇందులో కూడా మగవాళ్ళ కంటే, మహిళలే ఎక్కువ. 2014-2015 లో ఈ పథకం క్రింద 44,11,000 మంది కార్మికులు పొందిన వేతనం 1212 కోట్లు కాగా , 2023-2024 లో కార్మికులు పొందిన మొత్తం వేతనం 2,176 కోట్లు మాత్రమే. కానీ ఈ పథకాన్ని గురించి అత్యంత అవినీతి కర పథకంగా మీడియా గగ్గోలు పెడుతుంది. ధనికులు, మధ్య తరగతి వాళ్ళు రోజూ ఆడిపోసుకుంటారు.ఈ పథకం పేదలకు బద్ధకాన్ని నేర్పుతుందని, వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు దొరకడం లేదని ఆరోపణలు వినిపిస్తారు. రాష్ట్రంలో ఈ పథకం క్రింద గత పదేళ్ళలో ( 2014-2024) ఖర్చు చేసింది 18,738 కోట్లు మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా ఒక్క 2023-2024 సంవత్సరంలో ప్రజల నుండీ కొల్ల గొట్టింది 36,000 కోట్లు. కానీ మీడియా దీనిపై మాట్లాడదు. మధ్య తరగతి కూడా మౌనంగానే ఉంటుంది.
రాష్ట్ర పారిశ్రామిక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం 2021-2022 లో ఒక వార్షిక నివేదికను వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర పరిశ్రమలలో 7,08,219 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఒక్క సంవత్సరంలో మొత్తం కార్మికులు పొందిన వేతనాలు కేవలం 11,500 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్రంలో ఒక్క సంవత్సరం మద్యం అమ్మకాల విలువలో (36,000 కోట్లు) ఇది మూడవ వంతు మాత్రమే. కార్మికులు ఎంత శ్రమ చేసినా , మద్యం దురలవాటు వల్ల ఎంతగా అనారోగ్యం పాలవుతున్నారో, ఆర్ధికంగా ఎంత నష్ట పోతున్నారో మనం అందరం చూస్తున్నదే.
2023-2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ కలసి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించిన అమ్మకపు పన్ను 72,296 కోట్లు. ఇందులో పెట్రోల్, డీజిల్ మీద విధించే అమ్మకపు పన్ను కూడా ఉంది. రాష్ట్ర ప్రజలు చెల్లించే GST దీనికి అదనం. కానీ మద్యం ప్రియులు ఈ ఒక్క సంవత్సరంలో చేసిన ఖర్చు 36, 000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రజలు చెల్లించే మొత్తం అమ్మకపు పన్నులో ఇది 50 శాతం అన్నమాట. ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించండి.
ఎవరో కొందరు వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లిస్తే, ప్రభుత్వాలు ఉచిత పథకాలకు ఆ మొత్తాలను ఉపయోగిస్తున్నాయని, నిధుల దుర్వినియోగం చేస్తున్నాయని, కొందరు వాపోతుంటారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం నుండీ వసూలయ్యే ఆదాయ పన్ను ( income tax ) విలువ 9,000 కోట్లు మాత్రమే. నిజానికి జరుగుతున్నది ఏమంటే, పేద ప్రజలు తమ రక్తం , చెమట నుండీ రక రకాల పన్నులు చెల్లిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నారు. మరో వైపు ఆదాయం తగ్గీ, ఖర్చులు పెరిగీ పేదరికం నుండీ బయట పడలేక ప్రభుత్వాలు అరకొర అమలు చేసే పథకాల కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2023-2024 సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం చేపల విలువ 6,514 కోట్లు, రొయ్యల విలువ 545 కోట్లు మాత్రమే. మన రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చేపలు , రొయ్యల కంటే, మద్యానికి ఎక్కువ విలువ ఉంది. చేపలు తింటే ఆరోగ్యం, మద్యం తాగితే హానికరం అని తెలిసినా, ప్రభుత్వాలు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మగవాళ్ళు మద్యాన్ని ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునే బియ్యం ఉత్పత్తి విలువ కూడా రాష్ట్రంలో మద్యం అమ్మకాల విలువ కంటే తక్కువే.
2023-2024 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తయిన బొగ్గు విలువ 19,211 కోట్లు మాత్రమే, రాష్ట్రంలో మొత్తం మద్యం అమ్మకాల విలువ 36,000 కోట్లలో ఇది సగం మాత్రమే. రాష్ట్ర బొగ్గు గనుల ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా కార్మికులు మద్యం వ్యసనం పై పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువ. బొగ్గు సృష్టించే కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలో కార్మికుల, ఇతర ప్రజల అకాల మరణాలు కూడా ఎక్కువే. అందుకు మద్యం అలవాటు మరింత దోహదం చేస్తున్నది. శారీరక శ్రమ అలసటను మరచి పోవడానికి తాగుతున్నాం అనే వాళ్ళ వాదనలో అసలు పసలేదు. డాక్టర్లు ఆ విషయాన్ని చాలా సార్లు స్పష్టంగానే చెప్పారు. బద్రత తో కూడిన పని , ఆరోగ్యకరమైన ఆహారం, తగిన విశ్రాంతి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయని అందరూ చెబుతున్నదే.
రాష్ట్రంలో స్త్రీలకు, పిల్లలకు పౌష్టికాహారం అందక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 నివేదిక ప్రకారం పిల్లలలో( 6 నెలల నుండీ 59 నెలల లోపు) 60.7 శాతం మంది రక్త హీనతతో బాధ పడుతున్నారు. 15-49 సంవత్సరాల మధ్య గర్భిణీ స్త్రీలలో 48.2 శాతం మంది, 15-49 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మొత్తం స్త్రీలలో 56.6 శాతం రక్త హీనతతో బాధ పడుతున్నారు.
15-59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన రాష్ట్ర రైతులలో ( భూమిపై పట్టా హక్కులు కలిగిన కనీసం 30,000 మంది రైతులు ప్రతి సంవత్సరం అకాల మరణాలకు గురవుతున్నారని, రాష్ట్ర రైతు బీమా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. భూమి లేని కౌలు రైతులు, వ్యవసాయ కూలీలలో ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది. మగవాళ్ళలో మద్యం అలవాటు గ్రామ స్థాయిలో పిల్లలలో కూడా విస్తరించడానికి కారణమవుతుంది. స్కూల్ పిల్లలు కూడా మద్యానికి, డ్రగ్స్ కు, సిగరెట్లకు బానిసలవుతున్నారని అనేక మంది చెబుతున్నారు.
రాష్ట్ర స్థాయిలో యువత మద్యానికి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని, ఏ రకమైన శారీరక, మేధో శ్రమలు చేయలేని అశక్తులుగా ఉంటున్నారని, అందరూ విమర్శిస్తారు. ఆవేదన చెందుతారు. ఈ రాష్ట్ర యువత తగిన నైపుణ్యాలు పెంచుకుని వివిధ రంగాల పనులలో పని చేయడానికి సిద్దం కావడం లేదనే కారణంగా ఇతర రాష్ట్రాల నుండీ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వచ్చి, అన్ని రంగాలలో పనులను ఆక్రమిస్తున్నారని మనం గమనిస్తున్నదే. రాష్ట్రంలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సంబరాలు చేసుకునే ప్రభుత్వం ఈ రాష్ట్ర యువతను మద్యం బారి నుండీ బయట పడేయడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. పన్ను ఆదాయం పై ఆశతో, ప్రభుత్వాలు మద్య నియంత్రణకు సిద్దం కావడం లేదు.
ఎన్నికలలో ఓటు వేయడానికి ప్రజలకు మద్యం పంపిణీ చేసి రాజకీయ పార్టీలు, మద్యం పై పోరాడడానికి సిద్దంగా లేవు. ఒకప్పుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మద్య వ్యతిరేక పోరాటాలను నిర్మించిన లెఫ్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు కారణమేదైనా, ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడడం లేదు. మద్యానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్మించడానికి సిద్దం కావడం లేదు,
ఈ నేపధ్యంలో ప్రజలే , ముఖ్యంగా మహిళలే, రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించాలి. మద్య నియంత్రణతో ప్రారంభించి, మధ్య నిషేధం వైపు ప్రయాణించాలి.