బిఆర్‌ఎస్‌లో ‘ఆ ముగ్గురి’ ముసలం
ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌ను షూట్ చేయాలని పార్టీలోనూ, బయటా ఎవరు కోరుకుంటున్నారు?;
భారతీయ రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస)్ లో ఆ ముగ్గురి మధ్య ఏం జరుగుతోంది? నాలుగో పాత్ర లో కీలక సూత్రధారి ఏం చేయబోతున్నారు? కెసిఆర్ నిర్ణయిస్తే తను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని . హరీష్ రావు ప్రకటించడం ఆ తదుపరి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడటం, ఎమ్మెల్సీ కవిత భిన్న స్వరాలు వినిపించడం దేనికి నిదర్శనం? వీటన్నిటిపై సర్వాధినేత కెసిఆర్ మౌన సంకేతాలు ఏమిటి? ఇవన్నీ వ్యక్తిగత సర్దుబాటులో సవాళ్లేనా, రాజకీయ వ్యూహాలు ప్రజా సంబంధమైన అంశాలు అసలంటూ ఉన్నాయా? దేశాన్ని పాలించే బిజెపి, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా ల అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుంది? ఈ ముగ్గురు ఒకే కుదురు కింద కొనసాగడం సాధ్యమ ఏదైనా? ఇప్పుడు బిఆర్‌ఎస్ నేతలను అభిమానులను ఆందోళన గురి చేస్తున్న ప్రశ్నలు ఇవి. భారతపాకిస్తాన్ యుద్ధమేఘాలు. ఆంధ్రప్రదేశ్ తగాదాలలోనే తలమునకలవుతున్న మీడియాలో వీటికి తగినంత సమయం, స్థలం లభించకపోవచ్చు. కానీ తెలంగాణ పరిణామాలు పరిశీలించేవారికీ,ి అందులోనూ బిఆర్‌ఎస్ చుట్టూ తమ కార్యక్రమాలు ముడి వేసుకున్న వారికి ఈ ప్రశ్నలు అనివార్యం అవుతున్నాయి. ఊహగానాలు కట్టు కథలు. అని కొట్టి వేయడానికి వీలు లేకుండా సాక్షాత్తు సంబంధిత కీలక నేతల నుంచే నేరుగా వస్తున్న సంకేతాలు అవి. వాస్తవానికి ఈ వ్యాఖ్యత ఇటీవల రాసిన నాలుగు వ్యాసాల పరంపరలో ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తబడినవ.ే కాకపోతే. అప్పుడు అనుకున్న దాని కంటే వేగంగా ,జటిలంగా ఇవి తీసుకొచ్చాయి. బి ఆర్ ఎస్ ఇబ్బందికర పరిస్థితి వల్ల ఏర్పడిన స్తబ్దత, శూన్యత దీనికి ఒక ప్రధాన కారణం.
. హరీష్ రావు విషయమే తీసుకుంటే ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయనను షూట్ చేయాలని పార్టీలోనూ, బయటా ఎవరు కోరుకుంటున్నారు? లేక ఆయనకు తుపాకీ ఇచ్చి ఎవరైనా షూట్ చేయించాలనుకుంటున్నారా? కాంగ్రెస,్ బిజెపిల హస్తం ఇందులో ఉన్నదని కొంతమంది చేసే ఆరోపణల నిజమెంత? ‘నేను కేసీఆర్ నిర్ణయిస్తే కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎన్నిసార్లు ప్రకటించాలని’ హరీష్ రావు అడుగుతుంటారు.. అయితే ‘కెసిఆర్ నిర్ణయిస్తే అనే తోక ఎందుకు తగిలిస్తారు? మీరుగా స్వయంగా అనుకూలత ప్రకటించడం జరగదా’ అని ప్రత్యర్థి వర్గాలు సవాల్ విసురుతాయి. పార్టీకి కర్త కర్మ క్రియ కెసిఆర్ కనుక ఆయన చెప్పినట్టు చేస్తానని చెప్పడం సరైనదని ఆయన అంటారు. ప్రాంతీయ పార్టీలలో అధినేతల కుమారులే వారసులు కావటం సర్వ సాధారణం గనక దీనికి హరీష్ మానసికంగా ఎప్పుడో సిద్ధమై ఉన్నారని కూడా అనుచరులు చెబుతుంటారు. అయితే నిజంగా కేసీఆర్ అలాంటి ప్రకటన చేస్తే ఆ మరుక్షణం ఆశ్చర్యకరమైన పరిణామాలు తప్పవని కొందరు సన్నిహితులైన మీడియా మిత్రులు ఇప్పుడు కూడా చెబుతున్నారు. ‘ట్రబుల్ షూటం’్ బిరుదుతో ‘ట్రబుల్స్’ వచ్చినప్పుడు మాత్రం వాడుకొని ఆయననే ‘ట్రబుల్స్’ లో పెడుతుంటే ఎలా అని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే టిఆర్‌ఎస్ రజతోత్సవ సభ సమయంలో హరీష్ రావుకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడ ఇచ్చే పిలుపు ,రాజకీయ సందేశం ఎలా ఉండాలన్న దానిపై ఆయన వెంటబడి అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసినాపెడచెవిన పెట్టారు. టిఆర్‌ఎస్ శాసనమండలి సభ్యుడు స్వయంగా చానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ దీన్ని ద్రవపరుస్తున్నది. భారీ సభ అనగానే ముందుగా కనిపించే హరీష్ రావును పక్కనపెట్టి సభలో ఇవ్వాల్సిన సందేశంపై కూడా సంప్రదించకుండా ఎన్ని మాటలు చెప్పినా లాభమేమిటని వారి ఆగ్రహం. ఆయన ను పక్కన పెట్టడానికి సిద్ధిపేటలో కాకుండా సభా స్థలాన్ని అటూ ఇటూ చెప్పి వరంగల్ తీసుకుపోయారని వారంటారు. అయితే హరీష్‌రావునుంచి ఆశించిన ఆర్థిక సహాయం రాకపోవడం ఈ ఆగ్రహానిక,మార్పులకు కారణమనేది ఇందుకు భిన్నమైన మరో కథనం.
తమకు కాంగ్రెస్ విలన్ అని చెప్పడం ద్వారా బిజెపికి అనుకూల సంకేతాలు ఇస్తే చాలు అన్నది కేసీఆర్ అభిప్రాయమైతే నేరుగా బిజెపి అనుకూల వైఖరి తీసుకోవాలని పార్టీలో మరో వైఖరి గా చెబుతున్నారు ఇందులో హరీష్ రావు కేటీఆర్ లు ఎటు ఉంటారనేది ఒకటైతే కెసిఆర్ మాత్రం తెలంగాణ రాజకీయ నేపథ్యాన్ని బట్టి పూర్తిగా బిజెపిని నెత్తిన పెట్టుకోవద్దని అనుకుంటున్నట్టు అంతర్గత కథనాలు చెబుతున్నాయి. ‘ఆపరేషన్ కగార్’ ను వ్యతిరేకించటం సరైనదైనా ఆ ఒక్క దాంతో ఆయన బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్టుగా చెప్పడం సరైనదేనా? గత వ్యాసంలో చెప్పినట్టు కొన్ని వర్గాలు ముఖ్యంగా బుద్ధి జీవులు చేస్తున్న పని అదే.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి హరీష్ రావును ఎవరితోనో ముడిపెట్టి మాట్లాడటం జరుగుతూనే వస్తుంది కాబట్టి ఇవన్నీ పెద్ద ఆశ్చర్యం కలిగించవు.
. ఇప్పుడు కేటీఆర్ విషయానికి వస్తే పార్టీలో రెండవ స్థానం ఆయన నిర్వహిస్తున్నప్పటికీ విధాన నిర్ణయంలో మాత్రం కెసిఆర్ కేసి చూడడమే తప్ప మరో విధాóయకం లేని పరిస్థితి. తమిళనాడులో కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను ఎప్పుడూ పూర్తి నేతగా చేయలేదు. అదే ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ తను ఉండగానే అఖిలేష్ యాదవ్ కు పగ్గాలప్పగించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటి వరకు ఇంతే. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ నేరుగా లోకేష్ తోనే సంభాషణలు మొదలుపెట్టారు. కేసీఆర్ విషయానికి వస్తే ‘నేను గట్టిగా ఉన్నంతవరకు కేటీఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తానని’ శాసనసభ సాక్షిగా ప్రశ్నించారు. ఆయన మనస్తత్వం తెలిసినవారు కూడా అది నిజమనే అంటారు. తన తర్వాత కేటీఆర్ అని తప్ప తానుండగా అతనికి సారథ్యం అప్పగించటం కెసిఆర్ ఊహకు అందని విషయం. యూపీ, మహారాష్ర,్ట బీహార్ వంటి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అనుభవాలు చూసినప్పుడు నిజంగా తన అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే కుటుంబ సభ్యులు కూడా దూరమైపోవచ్చని ఆందోళన కూడా కేసీఆర్ కు ఉండొచ్చు. అందుకే ఆయన తన మాటల నైపుణ్యంతో, డబాయింపులతో దాన్ని దాటేస్తుంటారు. నిజానికి కొన్ని కీలక సందర్భాల్లో కేసీఆర్ నిర్ణయాలు కేటీఆర్ కూడా మింగుడు పడలేదు. ఈ పదవి ఎప్పుడూ ఉంటుందా, కావాలంటే వెళ్లి ఉద్యోగం చేసుకోలేమా అని కూడా ఆయన బహిరంగంగా నిర్వేదం ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
ఇలా అంటున్నప్పటికీ కెటిఆర్ సిఎం పదవి కోసం చాలా ఆశగానే ఉంటారని ప్రత్యర్థి వర్గాల కథనాలు చెబుతాయి. హరీష్ రావు సంగతి అలా ఉంచి కెసిఆర్ వ్యవహార శైలి తోనే తనకు శిరోభారం తప్పదని కేటీఆర్ కు కూడా తెలుసు. అధికార వర్గాలు, మీడియా ప్రచారకులు తనను ఆకాశానికి ఎత్తినా వాస్తవ రాజకీయంలో గడ్డు పరీక్షలు ఊహించలేనంత అమాయకుడు ఏమి కాదు. పైవర్గాలు, విద్యాధికుల్లో తనకొక ప్రత్యేక ‘స్లాట’్ సృష్టించుకున్నప్పటికీ రెండవ సారి అధికారంలోకి వచ్చాక ,ఇప్పుడు అది పోయాక కేటీఆర్ మాటలు చేతలు కొన్ని విమర్శలకు గురవుతున్నాయి. ఈ సమయంలో అంతర్గత ఘర్షణలు మొదటికే మోసం గనుక ముందు వాటిని చక్కబర్చుకోవాలన్నదే ఆయన ఆలోచనగా చెబుతారు. అందుకోసమే హరీష్ రావు ఇంటికి వెళ్లారు కానీ బావ మరదలుగా ఇదేమి కొత్త కాదని కూడా సమర్థించుకుంటున్నారు.
ఈ ఇద్దరిని మించి కెసిఆర్ కుటుంబంలో అసలైన సవాళ్ళు కవిత నుంచి ఎదురవుతున్నాయంటారు. నిజానికి ఆమె సన్నిహితులైన కొందరు అధికారంలో ఉండగానే ఈ విషయాన్ని చెబుతుండేవారు. ఆమె అప్పటి ఇంటర్వ్యూలలో కూడా కొడుకులకే వారసత్వం అన్న దానిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మొన్న ఎన్నికల సమయంలో, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నష్టపోవడానికి కవిత, ఆమె అనుయాయుల తీరుతెన్నులు కారణమనే విమర్శ బిఆర్‌ఎస్ లో బలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో ఆమె పాత్ర పై చాలా వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. వీటికి పరాకాష్టగా లిక్కర్ కుంభకోణంలో చిక్కుకోవడం, అరెస్ట్ కావటం పార్టీని కూడా కలవరపరిచింది. ఒక విధంగా కేసీఆర్ ఆమెను కాపాడుకోవాలనే కారణంతోనే బీజేపీతో రాజీకీ వచ్చారని బలమైన అభిప్రాయం ఏర్పడిరది. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కవితను ఓదార్చడంలో సందర్శించడంలో ముందున్నప్పటికీ రాజకీయంగా కలిగిన నష్టాన్ని మటుకు విస్మరించలేని పరిస్థితి. బీజేపీ మీద కేసీఆర్ విమర్శలు ఒక్కసారి ఆగిపోవడం కాంగ్రెస్ నే విలను చేయటం వెనుక ఇదో ప్రధానమైన కోణం.
వీటన్నిటి తర్వాత కవిత మాటలు చర్యలు ికూడా బిఆర్‌ఎస్కు ఇంకా ఇరకాటంగా మారి పోయాయి. తనపైన కొంతమంది కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నారని వారు ఎవరో సరైన సమయంలో చెప్తానని ఆమె చేసిన వ్యాఖ్య పార్టీ అంతర్గత వ్యవహారాలను బయిటపెట్టినట్టయింది.. పదేళ్లు పాలించిన సంగతి మర్చిపోయి తెలంగాణలో గత 14 ఏళ్లుగా సామాజిక న్యాయం అమలు కాలేదని ఆమె అన్నారు. ఒక విధంగా ఇది కెసిఆర్ పాలనపై ప్రత్యక్ష అభిశంసనే. మా ప్రభుత్వం ఉన్నంత మాత్రాన అన్ని మార్చలేము కదా.. ఇలా జాగ్రత్తగా కూడా ఆమె మాట్లాడకపోవడం అసమ్మతికి నిదర్శనం, సామాజిక న్యాయం జరగలేదని ఆమె నేరుగా చెప్పడం పై కాంగ్రెస్ నాయకులు, మంత్రులే ఆనందం ప్రకటించారు. ఇక తర్వాత ఒక సందర్భంలో మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అన్నప్పుడు మందహాసంతో ఆమోద పూర్వకంగా స్పందించారు తప్ప నాన్న, అన్న వంటి ప్రస్తావన చేసింది లేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నా ఆమె గట్టిగా ఖండిరచి లేదు.బిఆర్‌ఎస్ ను వీడే ప్రసక్తి లేదు వంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. కెసిఆర్ పట్ల హరీష్ రావుల వీర విధేయత ప్రకటించింది లేదు. బిజెపి ఒత్తిడి వల్లనే కవిత ఇలా చేస్తున్నారని పార్టీ ఏర్పాటుకు అవసరమైన వనరుల నిధుల సమీకరణ కోసం కుటుంబంలోనూ విభేదాలు నడుస్తున్నాయని చాలా కథలు మీడియా వారి మాటల్లో వినిపిస్తున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే కెసిఆర్ ఆఫం,్ కవిత డిమాండ్ మొత్తాలు కూడా మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇవన్నీ ఊహగానాలైనప్పటికీ రాజకీయ వాతావరణాన్ని,బిఆర్‌ఎస్ అంతర్గత పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. కవిత ఇక ఆ పార్టీలో ఇమడటం సాధ్యం కాదని ముగ్గురు నేతల తర్వాత నాలుగో స్థానంలో ఉండటానికి ఆమె సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ రావు కన్నా కవిత తిరుగుబాటు ప్రభావాన్ని ఎదుర్కోవటంపైనే కెసిఆర్ దృష్టి ఉందంటున్నారు ఆమెకు అంత విస్తారమైన ప్రభావం ఉందని దీని అర్థం కాదు. కాకపోతే దీని వల్ల బీజేపీకి కలిగే ప్రయోజనం, అధినేత కుమార్తెను విమర్శించడంలో సమస్య ఇబ్బంది ఇవే వారు మాట్లాడుతున్నారు. పోలిక చెప్పాలంటే ఏపీలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణంతో పోల్చుతున్నారు. ఇవన్నీ ఎవరు నేరుగా అంగీకరించకపోవచ్చు కానీ ఇవన్నీ రాజకీయ వర్గాల్లోనూ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్న కథనాలే
రజతోత్సవ సభ తర్వాత ప్రజల్లోకి దూసుకు వెళ్లే బదులు అంతర్గత విభేదాల వివాదాలలో కూరుకుపోవడం బి ఆర్ ఎస్ కు యాంటీ క్లైమాక్స్ లాంటిది. ప్రజా సమస్యలు, జాతీయ రాజకీయాలు మొత్తంగా చేపట్టగలిగిన స్థితి లేకుండా పోయింది. ఉప ఎన్నికలు వస్తాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని ఏవేవో కథనాలు ప్రచారం చేసినా ఇప్పటికి ఆ సూచనలు ఏమీ లేవు. మనకు లేని ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలని దానిపై హాస్యాస్పదమైన వాదన దేనికని బిఆర్‌ఎస్ అభిమా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమపై జరుగుతున్న దాడి, కేసులు, గత పాలనపై ఆరోపణలు వీటిని మాటలలో గట్టిగా ఎదుర్కొంటున్న కేటీఆర్ పంచులు ట్వీట్లు హరీష్ రావు డైలాగులు పేలుతున్నా ఒక శక్తివంతమైన యంత్రాంగంగా ిపంచులు బిఆర్‌ఎస్ కదలలేకపోతున్నది. రాష్ట్రం రాగానే తమ చేతికి అధికారం రావడం, పదేళ్లు కొనసాగడం వల్ల బిఆర్‌ఎస్ లో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక నయా రాజకీయ ప్రాబల్యవర్గాలు పుట్టుకొచ్చాయి అనేది సత్యం. వారిపై అనేక చోట్ల ఆరోపణలు కూడా తప్పలేదు ఇది కూడా వారి రాజకీయ క్రియాశీలతను చొరవను దెబ్బతీస్తున్నది.
అన్నిటిని మించి బిఆర్‌ఎస్ రాజకీయ విధానంలో స్పష్టత ఇవ్వకపోవడం ఎందుకు కారణమవుతున్నది శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్ మతతత్వ వ్యతిరేక భాష,కేంద్ర పెత్తనంపై దాడి ఓటమితోనే వెనక్కు పోయాయి. . కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ గా చేసుకోవడం కూడా చెల్లుబాటు కావడం లేదు. బిఆర్‌ఎస్ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడే తీరు రేవంత్ రెడ్డి మాటల దాడకి సమర్థనగానే మారుతున్నది/. ఇన్ని సవాళ్ల నుంచి బయటపడడం సమస్యగా ఉంటే ఇప్పుడుబిఆర్‌ఎస్ ప్రధమ పరివారంలోని నలుగురిలో ముగ్గురు మూడు రకాలుగా వార్తల్లోకి రావడం, ఇద్దరు దాదాపు దూరమవుతారని లేదా దూరం పెట్టారనే కథనాల కల్లోలం దాగడం లేదు. అదేదో పెళ్లి చూపుల కథలో పిల్లవాడు మంచివాడే ఉంగరం కూడా అతనిదే అని చెప్పినట్టుగా . ఏమీ లేదని పదేపదే ఖండిరచిన కొద్దీ మరింత ముదురుతున్నదనేది నిజం.. మరి కెసిఆర్ కావాలనే దీన్ని సాగదీస్తున్నారా? ఆజ్యం పోస్తున్నారా? కాస్త ముందు వెనకో తేలక తప్పదు.