రొటీన్ కు భిన్నంగా రేవంత్ ఆలోచించలేడా?
రేవంత్ ఏడాది పాలన సమగ్ర విశ్లేషణ-3
రేవంత్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజుతో ఏడాది నిండింది. పదేళ్ళ KCR ప్రభుత్వ నిరంకుశ పాలన తరువాత మార్పు కోరుకుని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వ చేదు జ్ఞాపకాలు మరచి పోయేలా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగాలని కూడా ప్రజలు కోరుకున్నారు. ఈ సంవత్సర కాలం అలా సాగిందా లేదా అనేది ప్రజలు బేరీజు వేసుకుంటారు.
ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండీ గడచిన ఈ సంవత్సర కాలంలో రెండు పరిమితులు స్పష్టంగా కనపడ్డాయి. ఒకటి, గత ప్రభుత్వం పదేళ్ళ పాలనా కాలంలో KCR ప్రభుత్వం భారీగా చేసిన 7 లక్షల కోట్ల అప్పుల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేకుండా దెబ్బ తిన్నది. గత పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం అమలు చేయక పోవడమే కాదు, వివిధ పథకాలకు నిధులు కేటాయించి కూడా విడుదల చేయకపోవడం వల్ల, ఆయా రంగాలలో బకాయిలు పేరుకు పోయాయి. వివిధ నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బకాయిలే కాదు, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయంబర్స్ మెంట్ లాంటి పథకాలకు కూడా బకాయిలు పెరిగి పోయాయి. ఆర్టీసీ, జెన్కో, ట్రాన్స్ కో , పౌర సరఫరాల శాఖ లాంటి కార్పొరేషన్ లను కూడా అప్పుల ఊబిలో దించేశారు. రేవంత్ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన ఈ అప్పుల వల్ల , రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెంపుకు, ఖర్చులకు, కొత్తగా అప్పులు చేయడానికి పరిమితులు ఏర్పడ్డాయి.
రెండవది, 2024 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంటు ఎన్నికల కారణంగా మూడు నెలలు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలకు పరిమితులు ఏర్పడ్డాయి. నెల వారీగా వస్తున్న పన్నుల ఆదాయాన్ని, కొత్తగా చేస్తున్న అప్పులను, పాత అప్పుల అసలు,వడ్డీలను తీర్చడానికి ఖర్చు చేయాల్సి రావడం వల్ల, వివిధ పథకాల పాత బకాయిలను కొన్నయినా, క్లియర్ చేస్తూ రావడం వల్ల మానిఫెస్టో లో కొత్త పథకాలకు, 6 గ్యారంటీల అమలుకు నిధుల కొరతను ఈ ప్రభుత్వం ఎదుర్కుంటున్న మాట నిజం.
అయితే, రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు, ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, డాంబికంగా చేసిన కొన్ని ప్రకటనలు మొదట్లో ప్రజలకు ఆశలను కలిగించాయి. క్రమగా, కాలం గడిచిన కొద్దీ ప్రజలకు నిరాశను మిగిల్చాయి . అవే ప్రకటనలు బీజేపీ , BRS లాంటి పార్టీలకు అస్త్రాలను అందించాయి.
వాటిలో ముఖ్యమైనది 6 గ్యారంటీలను 100 రోజులలోపు అమలు చేస్తామని చేసిన ప్రకటన. ఈ ప్రకటన అత్యంత తొందర పాటుతో కూడినది, ప్రభుత్వ పాలనా తీరుపై , రాష్ట్ర పన్నుల ఆదాయం పై ఏ మాత్రం వాస్తవికతతో సంబంధం లేకుండా చేసిన ప్రకటన ఇది. లేదా అప్పటికప్పుడు, ప్రతిపక్షాల నుండీ ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి చేసిన అబద్దపు ప్రకటనైనా అయి ఉండాలి.
ప్రభుత్వం చేసే అబద్దపు ప్రకటనలను ప్రతిపక్షాల కోసం వేసిన రాజకీయ ఎత్తుగడలుగా ప్రజలు చూడరనీ, తమను ప్రభుత్వం మోసం చేయడంగా భావిస్తారనీ, మరో వైపు ప్రభుత్వం అసమర్ధంగా పాలన సాగిస్తుందనే అంచనాకు కూడా వస్తారనే స్పృ హ ప్రభుత్వాలకు ఉండాలి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ఇందులో భాగంగా చూడాలి.
అసెంబ్లీ తొలి సమావేశాలలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చేసిన మరో ప్రకటన కూడా ఇలాంటిదే, నిజానికి ప్రభుత్వానికి అలాంటి చిత్తశుద్ధి ఉంటే, మొదటి సమావేశంలో కాకపోయినా, రెండవ సమావేశంలో అయినా అందుకు పూనుకోవాలి. కానీ సంవత్సరం గడిచినా, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే విషయం లో అడుగు ముందుకు పడలేదు. అంటే, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా చేసే ఆడంబర ప్రకటనలు అమలు కాకపోతే, ప్రభుత్వానికి అవే గుదిబండలుగా మారతాయి. ప్రభుత్వం పై విశ్వాసాన్ని తగ్గిస్తాయి.
అలాగే ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో ప్రజా పాలన పేరుతో గ్రామాలలోకీ , బస్తీలలోకీ ప్రభుత్వ అధికారులు వెళ్ళి తీసుకున్న దరఖాస్తులు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు స్పష్టత లేదు. 200 యూనిట్ల వరకూ ఇళ్లకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి హామీల అమలుకు ఈ దరఖాస్తులు ఒక మేరకు ఉపయోగపడ్డాయి కావచ్చు కానీ, రైతు భరోసా, రైతు బీమా, కౌలు రైతు గుర్తింపు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్, ఆసరా పెన్షన్ పెంపు లాంటి హామీల అమలుకు ఆ దరఖాస్తులు ఏ మేరకు ఉపయోగపడతాయో ఇప్పుడు చెప్పలేని స్థితి.
ఉదాహరణకు ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వం ఈ డిసెంబర్ 6 న ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ విడుదల చేసింది. అంటే ఆయా గ్రామాలలో,బస్తీలలో అధికారులు అర్హులను గుర్తించే ప్రక్రియ మళ్ళీ చేపడతారని అర్థం. 6 నెలల కొకసారి ప్రభుత్వ అధికారులు గ్రామాలలోకీ, బస్తీల లోకీ వచ్చి, ప్రజా పాలన క్రింద కొత్త వారి నుండీ దరఖాస్తులు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ సంవత్సరం మధ్యలో ఆ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదు. ఇది కూడా ఒక రకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే.
కానీ మిగిలిన తొమ్మిది నెలలలో అయినా ప్రభుత్వానికి దొరికిన సమయాన్ని రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు సీరియస్ గా ఉపయోగించుకుందా ? అలాగే అభయ హస్తం మానిఫెస్టో లో వివిధ ప్రజా సమూహాలకు ఇచ్చిన హామీల అమలుకు ఏమైనా ప్రయత్నాలు చేసిందా ? అంటే చేయలేదనే చెప్పాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. పేద ప్రజలకు తక్షణం ఉపయోగపడే హామీల అమలుకు ప్రభుత్వ చర్చలలో ప్రాధాన్యత తగ్గిపోయింది.
ఉదాహరణకు కోటి మందికి పైగా ఉన్న అసంఘటిత కార్మికులకు – ముఖ్యంగా హమాలీ, బీడీ, భవన, నిర్మాణ రంగ, రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రాధమిక చర్చలు కూడా ప్రభుత్వం ప్రారంభించలేదు. ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇవ్వకపోయినా, లక్షలాదిగా ఉన్న గృహ కార్మికులకు సంబంధించి, ఆ రంగంలో పని చేస్తున్న యూనియన్లు సూచించినట్లుగా కాకుండా, అతి తక్కువ వేతనాలతో కనీస వేతనాల జీవో విడుదల చేయడం తప్ప, వారికి సంబంధించిన ఇతర అంశాలేవీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ చర్చకు చేపట్టలేదు. స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం లో ఉన్న కార్మికులకు మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా, నెలకు 10,000 రూపాయల వేతన హామీని అమలు చేయడం లేదు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలలో ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కూడా కనీస చర్చలు ప్రారంభించలేదు.
గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులకు సంబంధించి , జాతీయ స్థాయి నుండీ , ముఖ్యంగా రాహుల్ గాంధీ నుండీ వచ్చిన ఒత్తిడితో, కొన్ని చర్చలు ప్రభుత్వ స్థాయిలో చేపట్టినా, ఇప్పటి వరకూ ఒక స్పష్టమైన విధానం రూపొందలేదు. జీవో వెలువడలేదు. ఈ రంగంలో ఉన్న బడా కార్పొరేట్ కంపనీలను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి, ఆయా రంగాల కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయించలేని నిస్సహాయ స్థితిలో ఉందనేది స్పష్టం.
రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో కార్మికులు ఉన్నా, ఆ కార్మిక శాఖకు ఒక మంత్రిని నియమించలేదంటే, ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలలో సాధారణ కార్మికులు లేరని స్పష్టంగా చెప్పవచ్చు. మానవ వనరుల రీత్యా కార్మిక శాఖ అత్యంత బలహీనంగా ఉంది. ఆ శాఖ పని తీరు అత్యంత పేలవంగా ఉంది. కార్మికుల రక్త మాంసాలను యాజమాన్యాలు పిండి పిప్పి చేస్తున్నా, ఒక్క కార్మిక చట్టాన్ని కూడా అమలు చేయకుండా కార్మికులను దోచుకుంటున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు లాంటివి పని చేయకపోయినా, కనీస వేతనాలకు సంబంధించి జీవో లు వెలువడక పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదు.
ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి, ఆర్టీసీ సంస్థలలో ఉన్న కార్మికులకు కూడా హక్కులు అమలు కావడం లేదు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఆర్టీసీ కార్మికులకు రెండు (2017, 2021 ) వేతన సవరణలు చేస్తామని, గత ప్రభుత్వం కార్మికులకు పడిన బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ లో కార్మిక సంఘాలను గుర్తిస్తామని ఇచ్చిన హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడానికి చర్యలు చేపట్టలేదు.
వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వ్యవసాయ కూలీలను కూడా రైతు బీమా పరిధిలోకి తీసుకు వస్తామని చెప్పినా, ఈ సంవత్సర కాలంలో అది అమలుకు నోచుకోలేదు. అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల రైతు భరోసా సహాయం అందిస్తామని చెప్పినా, అది కూడా అమలు కాలేదు.
40 లక్షల మందికి పైగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు , ప్రస్తుతం ఉన్న పెన్షన్ ను 4000/ 6000 రూపాయలకు పెంచి ఇస్తామని ఇచ్చిన హామీ పై కూడా ఈ సంవత్సర కాలంలో అడుగులు ముందుకు పడలేదు. సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కనీసం రేషన్ కార్డు మార్గదర్శకాలను కూడా అందరితో చర్చించి ఇప్పటివరకూ ఫైనల్ చేయ లేక పోయింది. ఋణమాఫీ సహా అన్ని పథకాల అమలుకు రేషన్ కార్డ్ ను అర్హతకు క్రైటీరియా గా పెట్టి, రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం అంటే, లక్షలాది పేద కుటుంబాలకు అన్యాయం చేయడమే. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమే.
జాతీయ కుటుంబ లబ్ధి పథకం క్రింద , మరణించిన పేద కుటుంబాలకు ఇవ్వాల్సిన 20,000 రూపాయల NFBS పథకం కూడా రాష్ట్రం లో ఈ సంవత్సరం అమలుకు నోచుకోలేదు. అడవి జంతువుల వల్ల గాయపడి, మరణించిన వారికి, విద్యుత్ షాక్ మరణాలకు, పిడుగుల వల్ల మరణాలకు జీవో ప్రకారం పరిహారం అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు, ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు కూడా జీవో 194 ప్రకారం గత సంవత్సర కాలంగా ఒక్కరికీ కూడా పరిహారం అందడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు కాలేదు.
ఇవన్నీ ఎందుకు వివరంగా ప్రస్తావించవలసి వచ్చిందంటే, ప్రభుత్వ ఎజెండా లో పెదాలు, వాళ్ళకు ఇచ్చిన హామీలు లేకుండా పోయాయాయి అని గుర్తు చేయడానికే. 30,000 ఎకరాలలో అందమైన నాలుగవ నగరం, అందులో గోల్ఫ్ కోర్టులు, క్రికెట్ స్టేడియాలు, రేస్ కోర్టులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా విలేజెస్, ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ పార్క్ లు, నేషనల్ హైవేలను విస్తరించడాలు పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ కంపనీలకు, ఆయా ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్ లకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కావు.
పైగా ఈ నాల్గవ నగరం పేద, మధ్యతరగతి పజలకు అందుబాటులో ఉండేది కాదు. పూర్తిగా కంపెనీల ధనవంతుల స్వర్గ ధామం. అక్కడ తప్పకుండా తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు.
మరో విషాదం ఏమిటంటే, ఇలాంటి నాలుగవ నగరం కోసం దళితుల నుండీ అసైన్డ్ భూములనూ , రైతుల నుండీ పట్టా భూములనూ భూ సేకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నిర్మాణం చేయడం. ప్రభుత్వ మారిన ప్రాధాన్యతలలో పేదలు,మధ్యతరగతి ప్రజలు లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఒక రకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు మరింత అభివృద్ధి చెందడానికి, వాటిని చేపట్టిన రాజకీయ నాయకుల ఆస్తులు మరింత పెరగడానికి తోడ్పడే ప్రాజెక్టులు.
మూసీ నది పునరుద్ధరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో రైళ్లు, రీజనల్ రింగ్ రోడ్డు, స్కైవే లు, నగరం మధ్యలో నాలుగు బడా అండర్ పాస్ లు, లేదా ఫ్లై ఓవర్లు కూడా ఈ కోవలోకే వస్తాయి. బడ్జెట్ లో అవసరమైన నిధులు లేనప్పుడు, పేదల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలుకు నిధుల కొరత ఉన్నప్పుడు, ఆశించిన స్థాయిలో పన్నుల ఆదాయం రానప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ చేపట్టకూడని ప్రాజెక్టులు ఇవి. క్యాబినెట్ ప్రాధాన్యత ఇచ్చి చర్చించకూడాని అంశాలు ఇవి. కానీ, గత సంవత్సర కాలంలో క్యాబినెట్ లో ఎక్కువ సమయాన్ని,స్థలాన్ని ఆక్రమించాయి. ఆమోదం పొందాయి. పైగా ఈ ప్రాజెక్టులన్నీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ( పిపిపి) మోడల్ లో చేపడుతున్నవి. అప్పులు చేసి ఖర్చు చేస్తున్నవి. అంటే, రాబోయే కాలంలో ఇవన్నీ ప్రజలపై అత్యంత భారాన్ని మోపెవి. మరో రూపంలో రాష్ట్రంలో నిర్మాణ మయ్యే మౌలిక సౌకర్యాలన్నీ ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లిపోతున్నాయని అర్థం.
గత నిరంకుశ పాలకులపై, వారి విధానాలపై, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విరుచుకుపడి మాట్లాడేవారు. KCR ఏ భాషలో మాట్లాడితే , ఆ భాషలో సమాధానం చెప్పేవారు. ఆనాడు సాధారణ ప్రజలు ఆ భాషను హర్షించి ఉండవచ్చు. కానీ, అధికారం చేపట్టాక కూడా రేవంత్ భాషలో పెద్దగా మార్పులు చేసుకోలేదు. అదే దూకుడును కొనసాగిస్తున్నారు. పాలనలో, హామీల అమలులో పెద్దగా మార్పులు లేకపోయినా, ముందుకు పోకపోయినా, భాషలో దూకుడు తగ్గకపోతే, ప్రజలు ముఖ్యమంత్రి గారిని భిన్నంగా చూస్తారు. మా పాలనకు, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డొస్తే , ఎవరినైనా బుల్డోజర్ లతో తొక్కేస్తాం అని ఇటీవల ముఖ్యమంత్రి హెచ్చరించారు. నిజానికి ఈ బుల్డోజర్ భాష బీజేపీ నాయకులది. ఆచరణ బీజేపీ ప్రభుత్వాలది. ఈ భాషను, ఆ చర్యలను ఇటీవల సుప్రీం కోర్టు తప్పుపట్టింది కూడా. రేవంత్ ఆ భాషను, ఆ చర్యలను అరువు తెచ్చుకోవడం అంటే, బీజేపీ భావజాలాన్ని అరువు తెచ్చుకోవడమే. అంటే రేవంత్ రోజూ కీర్తించే గాంధీ కుటుంబ భావజాలానికి వ్యతిరేక మార్గంలో పోవడమే. ముఖ్యంగా రాహుల్ గాంధీ రోజూ ప్రవచించే ఆలోచనలకు భిన్నంగా పోవడమే. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు త్వరగా గుర్తిస్తే, ఈ ప్రభుత్వానికే మేలు జరుగుతుంది.
నిజానికి రేవంత్ కు , కాంగ్రెస్ ప్రభుత్వానికి సాహసం, ధైర్యం ఉంటే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే, ఈ బుల్డోజర్ భావజాలానికి గురికాకుండా కొన్ని రంగాలలో రొటీన్ కు భిన్నంగా స్పష్టమైన విధానాలను రూపొందించాలి. వాటిని ధైర్యంగా ప్రకటించి అమలు చేసే సాహసం ప్రదర్శించాలి. అప్పుడు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో బలపడకుండా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, కోరుకుంటున్నట్లు మరో పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగడానికి ప్రజల అనుమతి పొందవచ్చు.
1. ప్రజాస్వామిక పాలనా స్పూర్తికి మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఉల్లంఘనలను ప్రభుత్వం సవరించుకోవాలి. ప్రజావాణి ని మరింత బలోపేతం చేయాలి. మొదటి సంవత్సరంలో మూసీ, లగచర్ల , దిలావర్ పూర్ అనుభవాల నుండీ ప్రభుత్వం నేర్చుకుని, ప్రజలతో, ప్రజా సంఘాలతో, పౌర సమాజ ప్రతినిధులతో చర్చల ద్వారా, ప్రజల సమస్యల పరిష్కారానికి పూనుకోవాల;ఇ. ఆ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళడానికి శాశ్వత మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి.
2. రేవంత్ పాలన రెండవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సమయంలో డిసెంబర్ 9 నుండీ మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి, వాటిని అమలు చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు చేయాలి.
3. ఎన్నికల మానిఫెస్టో లో పేద ,మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు, దళితులకు,ఆదివాసీలకు,వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు చేయాలి. అందుకు అవసరమైన విధాన ప్రకటనలను ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో చేయాలి.
4. SC, ST, BC సబ్ ప్లాన్, ముస్లిం డిక్లరేషన్ లను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించాలి. అభివృద్ధి పేరుతో, దళితుల, వెనుక బడిన వర్గాల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను లాక్కోబోమనీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.
5. వ్యవసాయ రంగంలో సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక, సేంద్రీయ వ్యవసాయ విధానం రూపకల్పనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి,2025 ఖరీఫ్ నుండీ వాటిని అమలులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించాలి.
6. ఒక సర్వే నంబర్ లో ఎవరు సాగు చేస్తే వారికి మాత్రమే – అంటే నిజమైన సాగుదారులకు మాత్రమే - ప్రభుత్వ పథకాల సాయం అందుతుందని, 2011 చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతులను గుర్తిస్తామని స్పష్టంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో విధాన ప్రకటన చేయాలి. ఇందుకోసం భూమి యజమానులు సహా, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి ప్రభుత్వమే పూనుకుంటుందని కూడా ప్రకటించాలి.
7. కేవలం వరిని ప్రోత్సహించడం కాకుండా, పప్పు ధాన్యాలను , నూనె గింజలను, చిరు ధాన్యాలను, కూరగాయలను ప్రోత్సహిస్తామని, స్పష్టంగా అసెంబ్లీ లో ప్రకటించాలి. ఎగుమతి ఆధారిత, సాగు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలను కాకుండా, రాష్ట్రానికి అవసరమయ్యే అన్ని పంటలను ప్రోత్సహిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటన చేయాలి. బడ్జెట్ లో విలువైన నిధులను, రాష్ట్రంలో ఖరీదైన నీళ్ళను ఉపయోగించి వరి లాంటి పంటలను పండించి, వాటిని ఎగుమతి చేయడం అర్థం లేని పనిగా ప్రభుత్వం గుర్తించాలి.
8. రాష్ట్రంలో కాలుష్య కారక ఫార్మా , ఇథనాల్, ఇతర పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్ధు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీ లో స్పష్టంగా ప్రకటించాలి. కేంద్రం అనుమతులు ఇచ్చిన ఆసరే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను ఉపయోగించుకుని, తాము రాష్ట్రాన్ని, రాష్ట్ర పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయాలి.
9. పరిశ్రమల కోసం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమి అవసరమైనప్పుడు, ఆ భూమి సేకరణ పేరుతో రైతులనుండీ తక్కువ పరిహారం చెల్లించి భూమి గుంజుకోకుండా, అవసరమైన మేరకు రైతులను ఒప్పించి భూమిని లీజుకు తీసుకోవాలి. ఆ భూమిలో ఏర్పడే కంపనీలలో , సంస్థలలో రైతులకు భూమి విలువకు అనుగుణంగా తగిన వాటాలు ఇవ్వాలి. ఆ భూమిలో కంపనీ ఏర్పాటు కాకపోయినా, ఏర్పడిన కంపనీ, ఏ కారణం చేత మూత పడినా ఆ భూమి యాజమనులైన రైతులకే చెందుతుంది.
10. రాష్ట్రంలో ఏర్పడే ప్రతి పరిశ్రమ, సంస్థ , సేవా రంగంలో వచ్చే కంపనీలు, సంస్థలు కూడా తప్పకుండా 80 శాతం ఉద్యోగాలు స్థానిక తెలంగాణ యువతకు మాత్రమే ఇచ్చేలా TS IPASS చట్టంలో సవరణ చేస్తామని, ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించాలి. రాష్ట్రంలో ఏర్పడే ప్రతి సంస్థా, కంపనీ కార్మికులకు సంక్షేమం, భద్రత అందించేలా కార్మిక చట్టాలను అమలు చేయాల్సి ఉంటజడని, ఆయా కంపనీలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు , లేదా అనుమతులు ఇచ్చేటప్పుడు స్పష్టమైన కండిషన్స్ పెట్టాలి.
11. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్యం అందేలా రాబోయే అయిదేళ్లలో వైద్య రంగంలో తగిన విధానాలు రూపొందించాలి. కేవలం ఆరోగ్య శ్రీ మొత్తాన్ని 10 లక్షలకు పెంచడం ప్రజల ఆరోగ్య, వైద్య రంగ సమస్యలకు పరిష్కారం కాదు. గ్రామ స్థాయి నుండీ రాష్ట్ర స్థాయి వరకూ వైద్య ,ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో అనారోగ్యాలకు కారణంగా ఉన్న అన్ని రకాల కాలుష్యం, మద్యం, విషాహారం, కలుషిత తాగునీరు, మీథేన్ సహా గాలి కాలుష్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి.
12. విద్యా రంగంలో కేజీ నుండీ పీజీ వరకూ ఉచిత విద్య గత ప్రభుత్వం ఇచ్చిన హామీ సరైంది కానీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేస్తూ, బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ, కామన్ స్కూల్ సిస్టమ్ వైపు ప్రయాణం చేయాలి. ఇప్పటి లాగా, రోజుకో విధాన ప్రకటన సరైంది కాదు. బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ సహా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడానికి విధాన నిర్ణయం తీసుకుని, మధ్యాహ్న భోజనం పథకం స్కూల్ కేంద్రంగా కొనసాగించాలి. ఈ పథకాన్ని సెంట్రలైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన విద్యా హక్కు చట్టాన్ని , చట్టం స్పూర్తితో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలి. మోడీ ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానానికి దూరంగా ఉంటామని ఈ అసెంబ్లీ లో తీర్మానం చేయాలి.
13. రాష్ట్రంలో సగం జనాభా ఉన్న మహిళల సమస్యలపై ఒక విధానం రూపొందించడానికి తక్షణమే మహిళా, ట్రాన్స్ జందర సంఘాలతో ఒక సమావేశం నిర్వహించాలి.
రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటనలు చేయగలిగితే, రెండవ పాలనా సంవత్సరంలో వీటిని అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, ప్రజలు హర్షిస్తారు. “లేదూ, మా పద్దతి మాదే , మా అభివృద్ధి నమూనా మాదే” అని మొదటి సంవత్సరం లాగే రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళితే, ప్రజలు ఆగ్రహం , అసంతృప్తి వ్యక్తం చేస్తారు. పౌర సమాజం కూడా మొదటి సంవత్సరం లాగా మౌనంగా ఉండబోదు.