ఆయన పాదయాత్ర... ఈయన తొలి మీటింగ్ అక్కడే..

అప్పటి కలెక్టర్ పుష్పా సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్పీ ని సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి రిపోర్టు ఇవ్వమని కోరారు. ఎలక్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2023-11-30 06:38 GMT
TDP Logo

(పి.శ్రీనివాసులు నాయుడు)

1994.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భారీ విజయం సాధించాయి. ఆ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో గెలుపొందిన మిత్రపక్షాల శాసనసభ్యులకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మ‌గ్దూమ్ భవన్ లో పార్టీ నాయకులు దాసరి, సురవరం సమక్షంలో చిన్నపాటి అభినందన సభ జరిగింది. మద్దతిచ్చిన సీపీఐకి వారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి నాటి హోం శాఖ మంత్రి పి.ఇంద్రారెడ్డి, కో- ఆపరేటివ్ శాఖ మంత్రి టి.దేవేందర్ గౌడ్, హరీశ్వర రెడ్డితో పాటు గెలుపొందిన శాసనసభ్యులు అందరూ హాజరయ్యారు. నేను చెప్పదలచిన విషయం అర్ధం కావాలంటే ఇదంతా ప్రస్తావించాలి.

చెడిన పొత్తు, ఒంటరి పోరు

తర్వాత కొంత కాలానికి సహకార సంఘాలకు ఎన్నికలు వచ్చాయి. CPI కి ఎవరితోనూ అవగాహన లేదు. పోటీచేయాలని ఉత్సాహపడి, మండల కమిటీలు తీర్మానం చేస్తే సాధ్యా, అసాధ్యాలను అంచనా వేసి జిల్లా కమిటీ ప్రోత్సహించింది. అలాంటిదే షాబాద్ మండలం, నరెడ్లగూడ సొసైటీ. అపుడపుడే ఆ మండలంలో పార్టీ వేళ్ళూనుకుంటున్నది. (ఈ మండలం లోనిదే అయిన తాళ్ళపల్లి గూడ గ్రామంలో నిమజ్జనం కాకుండా మిగిలిన రెండు వినాయకుల విగ్రహాల వెనక పెద్ద చరిత్ర ఉంది. అది వేరే కథ). ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశ్చిమ భాగంలో నాడు నెలకొని వున్న ప్రత్యేక పరిస్థితులే షాబాద్ మండలంలో కూడా వున్నాయి . అంతటా కర్ర పెత్తనమే..అక్కడికి పోతే అది ఒక మండల కేంద్రమనే భావనే కలిగేదికాదు.ఎప్పుడూ ఒకఇబ్బంది కరమైన నిశబ్దం అక్కడ రాజ్యమేలేది.

అన్నీ ఏకపక్ష రాజకీయాలే

వ్యవహారాలన్నీ ఏకపక్షంగా జరిగేవి. ఆరోజుల్లో వారు ఏది నిర్ణయిస్తే ,అదే శాసనంలా అమలు అయ్యేవి. అప్పటికే పలు హత్యలు జరిగిన ప్రాంతం.అలా హత్య అయిన వారిలో ఇంద్రారెడ్డి మేనల్లుడు కూడా ఒకరున్నారు.ఈ ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీ చేయాలనేది పార్టీ భావన. అపుడపుడే పార్టీలో ఎదుగుతున్న యువకుడిని అభ్యర్తిగా నిర్ణయించింది. అయితే అధికార పార్టీ వారు ఆ సొసైటీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని చాలా పట్టుదలగా ఉన్నారు.నామినేషన్లకు ఒకటి రెండు రోజుల ముందుహైదరాబాద్లో ఉన్న నాకు అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థి ఫోన్ చేసాడు. ఇతర ప్రధాన పార్టీల వారెవరూ అనగా కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు పోటీలో ఉండరనీ, తన ఎన్నిక లాంచనమేననీ చెబుతూ సిపిఐ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టవద్దని కోరాడు. ఆయన చెప్పింది విని, ఔట్ రైట్ గా తిరస్కరించకుండా మధ్యేమార్గంగా, మీరు చైర్మన్ పదవి తీసుకుని, ఒకటి రెండు డైరెక్టర్ పదవులు మా వారికి ఇవ్వండని చెప్పాను.ఆయన ఆవేశంగా తిరస్కరించి, అది నాకు సాధ్యం కాదన్నాడు. నీ కది సాధ్యం కానపుడు, నా కిదీ సాధ్యం కాదన్నాను. మా అభ్యర్థి పోటీని నేనూ ఆపలేనని సంభాషణ ముగించాను.

ఒక్క నామినేషనూ పడలేదు

అతను చెప్పినట్లే జరిగింది.ఇతరు లెవరూ నామినేషన్ వేయలేదు. ఆరోజు ఆఖరి రోజు. నామినేషన్ పత్రాలతో ప్రభుత్వ కార్యాలయ గుమ్మం వరకూ చేరుకున్న సీపీఐ అభ్యర్థి పి.భీమ్ భరత్ ను అమాంతంగా బయటకు లాగి, అపహరించుకుని వేగంగా వెళ్లిపోయారు. అందరూ అందోళనలో ఉండగా, వారు వెనువెంటనే ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు ప్రకటించాలని డిమాండ్ మొదలు పెట్టారు. ఎన్నిక రద్దుచేసి, మరలా నోటిఫై చేయాలని కోరుతూ మేము కలెక్టర్ ను అభ్యర్థించాం. ధర్నా చేసాం. ఏకగ్రీవంగా ఎన్నిక ముగిసినట్టు ప్రకటించాలని కోరుతూ MLA హరిశ్వర్ రెడ్దితోసహా ఇతరులందరూ కలెక్టర్ తో వాదించారు. తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తూ రాత్రి పొద్దుపొయే వరకూ ఉభయపక్షాలూ కలెక్టర్ కార్యాలయం వద్ద మొహరించి వున్నాయి .

ఎలక్షన్ రద్దు మా విజయమే

అప్పటి కలెక్టర్ శ్రీమతి పుష్పా సుబ్రహ్మణ్యం, జిల్లా యస్ పి.ని సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి రిపోర్టు ఇవ్వమని కోరారు. రెండురోజుల తర్వాత ఎలక్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫలితంగా రెండు రోజులపాటు దాడులు, ప్రతిదాడులతో షాబాద్ అట్టుడికిపోయింది. మా వారిని 58 మందిని అరెస్టుచేసి, కేసులు పెట్టారు. కొత్తకొత్తగా పార్టీ కి దగ్గరైన వారిలో అనేకమంది తర్వాతి కాలంలో కార్యకర్తలుగా, నాయకులుగా ఎదిగారు .

దీనిపై అంతటా, అన్ని వర్గాల లోను పెద్దచర్చే జరిగింది. షాబాద్ లో ఎప్పుడూ దాడులేగానీ, ప్రతి దాడులు జరిగింది లేదు. అందుకే ఇది సహజంగానే ఆసక్తిని రేకెత్తించింది. సిటీకి తూర్పు ప్రాంతంలో వున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సిపిఎం బలంగా వుంది.మిగిలిన ప్రాంతంలో ఎర్రజెండాలు బహు తక్కువగా కనిపించేవి. ఏది ఏమైనా,ఇక్కడ ఈ మార్పులు అణచివేతకు గురైన అభాగ్యుల్లో మాత్రం ఒకింత అశనూ ఆనందాన్ని కలిగించాయి .

ఎన్టీఆర్ నుంచి పిలుపు

ఎన్నిక రద్దు, దాడులు, ప్రతిదాడులు,తర్వాత అరెస్టులు, కేసులు ఇలా సాగుతూండగా, సిపిఐ వారు, ముఖ్యమంత్రి NTR ను కలవాలని అనుకుంటున్నారని ఒక పత్రిక ప్రముఖంగా రాసింది. ఈ వార్త అగ్గికి ఆజ్యం తోడైనంత పని చేసింది. అదే రోజు రాత్రి పది, పదకొండు గంటల సమయంలో నా ఇంటికి ప్రముఖ నాయకుడు ఫోన్ చేశాడు. ఆయన మాట్లాడలేదు...అరిచాడు, బెదిరించాడు,హెచ్చరించాడు. చివరకు చంపుతానన్నాడు. చివరికి సహనం కోల్పోయిన నేనూ తీవ్ర స్థాయిలో జవాబిచ్చాను. ప్రజల కోసం పనిచేస్తున్న కమ్యూనిస్ట్ తో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే అనీ, రోజూ గ్రామాల్లో స్కూటర్ పై తిరిగే నన్ను చంపడం నీకు చాలా సులభమేకానీ,నేను చచ్చిన ఆరు నెల్లలోపు నీ ఇంటికాడ నీ పాడె లేస్తుంది అని గుర్తుంచుకో అని జవాబిచ్చి ఫోన్ పెట్టేశా. జరిగిందంతా పత్రికల్లో వచ్చింది. జిల్లాలో పార్టీ బాగా స్పందించింది. ప్రజలూ నిరసించారు. నిన్నటి వరకూ మిత్రపక్ష పార్టీలుగా సహకరించుకుని తిరిగిన వారికి, ఇంతలోనే ఏమైంది అన్న వారూ ఉన్నారు.మిత్రపక్షం అంటే బేషరతుగా అధికార పార్టీకి సరెండర్ అయ్యి, వారు విదిలిస్తే ఏరుకునే వారిగా మిగిలిపోవాలా అనే ప్రశ్న మాకు ఎదురైంది.

మరొక ఉదాహరణ.అప్పుడు టీడీపీ అయితే ఇప్పుడు కాంగ్రెస్. ఇంద్రారెడ్డి ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి, పార్టీ ఓట్లను బదిలీ చేశాం. వారికి పదవులొచ్చాయి. అదే ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థలఎన్నికల్లో, పార్టీతో అవగాహన వుంటే పార్టీ బలపడుతుందనేది వారి అసలు ఉద్దేశం. సిపిఐ వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తుపైపోటీ చేయమని ప్రతిపాదించి అవమానించారు .ఆ ప్రతిపాదనను నిష్కర్షగా తిరస్కరించి, స్వంతంగా పార్టీ గుర్తు మీదే పోటీ చేసి, జిల్లాలో వీలయినంత వరకూ ఉద్యమ బేస్ ను కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఉదా: ఇంద్రారెడ్డి స్వగ్రామంలో సర్పంచ్ గా జంగయ్య, MPTC సభ్యునిగా చిలకల యాదయ్య గెలిచారు.

1995లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. TDP చీలింది. ఇక్కడి వారు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతితో చేరారు. చంద్రబాబుముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలలకు ప్రజల వద్దకు పాలన (PVP ) పేరుతో మొట్టమొదటి అధికారిక బహిరంగ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో ప్లాన్ చేశారు. అందులోనూ తొట్ట తొలి బహిరంగసభ చేవెళ్లలో నిర్వహించే బాధ్యత(కలెక్టర్ ద్వారా) సిపిఐ కి ఇచ్చారు. అందరూ కొనియాడేలా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. వేలాదిమంది హాజరైన ఆ సభలోఆ ప్రాంతంలో జరుగుతున్న వాస్తవాలను నేను వివరించి, ప్రజా సమస్యలపై కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేయగా, CM వాటిని అన్నింటిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు. ఊట చెరువులు నిర్మాణానికి 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. చేవెళ్లకు RDO కార్యాలయాన్ని తరలించేందుకు అంగీకరించారు. అంబేద్కర్ విగ్రహాన్నికి నిధులిస్తామని అంగీకరించారు. ముఖ్యంగా షాబాద్ లో 58 మందిపై మోపిన కేసులను ఉపసంహరించటం జరిగింది.

నాటి సొసైటీ ఎన్నికలల్లో సీపీఐ తరఫున నామినేషన్ వేయటానికి అడ్డంకులను ఎదుర్కొనివిఫలమైనఅప్పటి పామెన భీమ్ భరత్, ప్రస్తుతం చేవెళ్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి. నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో చేవెళ్ల రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు!

(- రచయిత  ఏఐవైఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు)


Tags:    

Similar News