ఈసీ తీరుపై బీహార్‌లో రాహుల్ త్వరలో పాదయాత్ర..
SIR ప్రక్రియ ద్వారా సుమారు 65 లక్షల ఓటర్లను తొలగించిన ఎలక్షన్ కమిషన్..;
ఎన్నికల సంఘాన్ని(EC) కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(BJP) తమ స్వప్రయోజనాలకు వాడుకుంటోందని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ కూడా వారు చెప్పినట్లుగా నడుచుకుంటోందని విమర్శించారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)ను ఈసీ పూర్తి చేయించింది. 7.9 కోట్ల మంది ఓటర్లలో సుమారు 65 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. కొంతమంది ఒకటి నుంచి ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదయి ఉండడం, మరికొంతమంది శాశ్వతంగా వలస వెళ్లిఉండడం, ఇంకొంతమంది ఓటర్లు చనిపోయినట్లు సర్వేలో తేలింది.
ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల మధ్యలో ఆయన పాదయాత్రలు చేపట్టబోతున్నారు. అయితే షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు. ఈ పాదయాత్రలో భారత కూటమి మిత్రపక్షం ఆర్జేడీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆ పార్టీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
రాహుల్ పాదయాత్రపై బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. రక్షా బంధన్ (ఆగస్టు 9) తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. బీహార్ దక్షిణ జిల్లాలైన కైమూర్, రోహ్తాస్, ఔరంగాబాద్, గయా, నవాడలను కవర్ చేస్తూ రాష్ట్ర రాజధాని పాట్నాలో పాదయాత్ర ముగిస్తుందని పేర్కొన్నారు. జూలై 30న జరిగిన జరిగిన మహాఘట్బంధన్ లేదా గ్రాండ్ అలయన్స్ (బీహార్‌లో ప్రతిపక్ష కూటమి అని పిలుస్తారు) సమన్వయ కమిటీ సమావేశంలో ఈ యాత్రకు సంబంధించిన తాత్కాలిక ప్రణాళికపై చర్చ కూడా జరిగింది.