జుబీన్ అనుమానాస్పద మృతి కేసులో మరో ఇద్దరి అరెస్టు..

మరిన్ని వివరాల కోసం త్వరలో సింగపూర్‌కు బయలుదేరనున్న సిట్ సభ్యులు..

Update: 2025-10-03 08:08 GMT
Click the Play button to listen to article

అస్సాం(Assam)కు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(Zubeen Garg) అనుమానాస్పద మృతి కేసులో గురువారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న సంగీత విద్వాంసురాలు శాఖర్జ్యోతి గోస్వామి, గాయని అమృతప్రభ మహంతను విచారణకు పిలిచి ఆపై ఆరెస్టు చేశారు పోలీసులు. ‘‘వీరిపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. ఆధారాలు కూడా దొరికాయి. లోతుగా విచారించేందుకు అరెస్టు తప్పదు’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీరిద్దరి అరెస్టుతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 4కు పెరిగింది. ఇటీవల గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహంత, శర్మతో పాటు మరో 10 మందిపై రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదకావడంతో కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి (S.I.T)కి అప్పగించింది అస్సాం ప్రభుత్వం.

సిట్‌ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తోన్న అస్సాం పోలీస్ సీఐడీ(CID) స్పెషల్ డీజేపీ మున్నా ప్రసాద్ గుప్తా గురువారం విలేఖరులతో మాట్లాడారు. ‘‘మహంత, శర్మను పోలీసు కస్టడీకి కోరాం. విచారణలో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. గార్డ్ మృతదేహానికి సింగపూర్‌లో పోస్టుమార్టం జరిగింది. అది త్వరలో ఆయన కుటుంబసభ్యులకు అందుతుంది. గౌహతిలో జుబెన్ మృతదేహానికి రెండో సారి పోస్ట్‌మార్టం జరిగింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (CFL) నుంచి రిపోర్టు రావాల్సి ఉంది. అది కూడా వచ్చాక గార్గ్ కుటుంబసభ్యులను సంప్రదిస్తాం.’’ అని చెప్పారు.


త్వరలో సింగపూర్‌కు..

‘‘ఘటన సమయంలో గార్డ్ వెంట ఉన్న డిప్యూటీ ఎస్పీ, గాయకుడి బంధువు సందీపన్ గార్గ్‌ను కూడా విచారించాం. తర్వలో కేసుకు సంబంధించిన ఆధారాలు, ఇతర వివరాల సేకరణకు త్వరలో ఒక బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. జుబీన్ అనుమానాస్పద మృతికి సంబంధించి అస్సాం అసోసియేషన్ సింగపూర్ సభ్యులకు కూడా భారత హైకమిషన్, సింగపూర్ అథారిటీ ద్వారా నోటీసులు CID నోటీసులు పంపింది.’’ అని పేర్కొన్నారు గుప్తా.


శ్యామ్‌కాను అన్నయ్య మాజీ డీజీపీ..

ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మాజీ డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తమ్ముడు. ప్రస్తుతం ఆయన అస్సాం రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్నారు. శ్యామ్‌కాను మరో అన్నయ్య నాని గోపాల్ మహంత.గౌహతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కావడానికి ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు విద్యా సలహాదారుగా పనిచేశారు.

సింగపూర్‌లో నిర్వహించిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి గార్గ్ వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ మృత్యువాతపడ్డారు. ఆయనకు నివాళి అర్పించేందుకు గౌహతిలో భారీగా అభిమానులు తరలివచ్చారు. 

Tags:    

Similar News