సునీల్ జాఖడ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన బీజేపీ

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సునీల్ జాఖడ్ దూరంగా ఉండడంతో ఆయన పార్టీని వీడారన్న వార్తలొచ్చాయి.

Update: 2024-09-27 10:06 GMT

సునీల్ జాఖడ్ పై వస్తున్న వార్తలపై బీజేపీ స్పష్టత నిచ్చింది. లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖర్ కుమారుడైన సునీల్ జాఖడ్.. బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లేనని పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ సరిన్ చెప్పారు. ఆయన తన పదవిలో కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు జాఖర్ ఎందుకు దూరంగా ఉంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ప్రతి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరు కావడం వీలుకాదని, అది అంత ముఖ్యం కాదని కూడా సరిన్ బదులిచ్చారు.

ఆల్ ది బెస్ట్ అంటూ కాంగ్రెస్ ట్వీట్..

పంజాబ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు జాఖడ్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సందర్భంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు.“మిస్టర్ @ సునీల్‌జాఖడ్, ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ ఎక్కడ?” ట్వీట్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత ..

లోక్‌సభ ఎన్నికల తరువాత జాఖడ్ రాష్ట్ర రాజకీయాల్లో మునుపటిలాగా యాక్టివ్‌గా లేరని సమాచారం. ఆయన చివరగా సెప్టెంబరు 3న చండీగఢ్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర నాయకత్వంలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. పార్టీలోకి వచ్చిన మాజీ కాంగ్రెస్ నాయకులకు కీలక పదవులు కట్టబెట్టడంపై కాషాయ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు.

ఏడాది క్రితం బాధ్యతలు..

బీజేపీ ఎమ్మెల్యే అశ్వనీ శర్మ తర్వాత జులై 2023లో జాఖడ్ పంజాబ్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైన మూడు నెలల తర్వాత మే 2022లో ఆయన బీజేపీలో చేరారు. మాజీ కాంగ్రెస్ సభ్యుడయిన జాఖర్ అబోహర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, గురుదాస్‌పూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాఖడ్ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా, అలాగే 2012 నుంచి 2016 వరకు పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.

Tags:    

Similar News