నిన్న ఢిల్లీలో.. నేడు గుజరాత్‌లో..కూలిన టెర్మినల్ పైకప్పులు

భారీ వర్షాలకు విమానాశ్రయాల్లో టెర్మినళ్ల పైకప్పులు కూలిపోతున్నాయి. అప్రమత్తమైన కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వాటి పటిష్టతను పరిశీలించాలని సూచించింది.

Update: 2024-06-29 11:51 GMT

భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం వెలుపలి టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. నిలిచిపోయిన వర్షం నీళ్లను తొలగిస్తున్నప్పుడు ఇది పడిపోయింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇటీవలె న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లో టెర్మినల్ 1 పై కప్పు కూలిపోవడంతో 45 ఏళ్ల టాక్సీ డ్రైవర్ మరణించాడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దాంతో టెర్మినల్ 1లో రోజుకు 200 విమానాల రాకపోకలను రద్దు చేశారు.

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబానికి రూ.20 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

జబల్పూర్ విమానాశ్రయంలో కూడా..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ విమానాశ్రయంలోని పైకప్పు కూడా కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానాశ్రయాల్లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలతో అప్రమత్తమైన మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో టర్మినళ్ల పైకప్పు ధృడత్వాన్ని పరిశీలించాలని ఆదేశించింది.

Tags:    

Similar News